వార్తా ఛానెళ్ళకి మళ్ళీ రేటింగ్స్

వార్తా ఛానెళ్ళకి మళ్ళీ రేటింగ్స్

దేశంలోని వార్తా ఛానెళ్ళకు మళ్ళీ రేటింగ్స్ మొదలవుతున్నాయి. వెంటనే రేటింగ్స్ సిస్టమ్ మొదలుపెట్టాలని బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్ ) ను కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ ఆదేశించింది. గత మూడు నెలల డేటాను విశ్లేషించి… నెల వారీగా విడుదల చేయాలని సూచించింది. గతంలో టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ స్కామ్ బయటికి వచ్చాక రేటింగ్స్ ఇవ్వడాన్ని బార్క్ నిలిపివేసింది. బార్క్ లో కొందరు ఉద్యోగులను లంచాలతో లోబరుచుకున్న న్యూస్ ఛానెళ్ళు తమకు ఎక్కువ రేటింగ్స్ వచ్చేలా మేనేజ్ చేశాయి. ఈ రేటింగ్స్ ఆధారంగానే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన బ్రాండెడ్ కంపెనీలు ఆయా న్యూస్ ఛానెళ్ళకు ప్రకటనలు (అడ్వర్టైజ్ మెంట్స్) ఇస్తుంటాయి. దాంతో రేటింగ్స్ కోసం అన్ని ఛానెళ్ళ మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. అలాగే కొన్ని ఛానెళ్ళు రేటింగ్స్ కోసమని చౌకబారు న్యూస్ ను పదే పదే చూపిస్తూ తమ స్థాయిని దిగజార్చుకునే ప్రయత్నాలు చేసేవి.
ఇప్పుడు బార్క్ లో చాలా మార్పులు జరిగాయి. ఈసారి పక్కాగా ఎలాంటి లోపాలకు తావు లేకుండా రేటింగ్స్ ఇస్తామంటోంది బార్క్. ఈ కొత్త విధానం ప్రకారం వార్తలు, ప్రముఖ విషయాల రిపోర్టింగ్ గురించి నాలుగు వారాల సగటు ఆధారంగా బార్క్ రేటింగ్స్ ఇస్తుందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. TRP కమిటీ నివేదిక, ట్రాయ్ 2020 ఏప్రిల్ 28న ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా రేటింగ్స్ ప్రకటించాల్సి ఉంది. ఇకపై బార్క్ లో పాలకమండలి, టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. వీటిల్లో స్వతంత్ర సభ్యులు ఉంటారు. ఒక శాశ్వత పర్యవేక్షణ కమిటీని కూడా నియమిస్తారు. అలాగే డేటా యాక్సెస్ ప్రోటో కాల్ ను మరింత పకడ్బందీగా రూపొందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *