TS: పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..!

TS: పోడు భూముల గురించి సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..!
తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరాంపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని జిల్లాల కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 లోపు పోడు భూములు సాగు చేస్తున్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా పోడు భూములపై సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అడవులు పరిరక్షణ, పోడు భూముల వ్యవసాయం, హరితహారంతో పాటుగా పలు అంశాలపై చర్చించారు. అడవులను రక్షించే గిరిజనులను కాపాడండి..అడవులను నాశనం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కేసీఆర్ ఆదేశించారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలో అటవీ భూముల రక్షణలో కలెక్టర్లు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అడవులను కాపాడేందుకు ప్రజా ప్రతినిధులతో పాటుగా, అధికారులుకూడా కీలక పాత్ర వహించాలని వారిపై కలెక్టర్లు అజామాయిషీ ఉండాలని కేసీఆర్ సూచనలు జారీ చేశారు.
తెలంగాణలో అడవిపై ఆధారపడ్డ గిరిజనులను గుర్తించి వారికి రైతు బంధు అందేలా చూడాలని.. అదే విధంగా దొంగతనంగా అడవిలో గంజాయి సాగు చేసే వారికి రైతు బంధు, కరెంట్ కూడా కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమాయక గిరిజనులు అడవిని కంటికి రెప్పలా కాపాడుకుంటారని సీఎం అన్నారు. జిల్లాల్లో అటవీభూముల రక్షణపై అఖిలపక్షం సమావేశం నిర్వహించాలని కేసీఆర్ సూచించారు.