టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు..!
టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ క్రికెట్ ఆపరేషన్స్ (NCA) హెడ్ కోచ్ గా ఉన్న ద్రవిడ్ దరఖాస్తుల స్వీకరణకు చివరి రోజైన తన దరఖాస్తును సమర్పించాడు. ఇప్పుడు టీమిండియా ప్రధాన కోచ్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో అందరి దృష్టి ద్రావిడ్ పైనే పడింది. ఇది ఇలా ఉండగా…ద్రవిడ్ నమ్మిన బంటు, మాజీ పేసర్ పరాస్ మాంబ్రే నిన్న బౌలింగ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు సమర్పించాడట. దీంతో పాటుగా ద్రవిడ్ నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ క్రికెట్ ఆపరేషన్స్ (NCA) హెడ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పోటీ పడుతున్నారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇటీవల జరిగిన ఐపీఎల్ సందర్భంగా ద్రవిడ్‌తో సమావేశమైన బీసీసీఐ సారథి సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా హెడ్ కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నెల మొదట్లో పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్‌ల కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. గడువు నేపథ్యంలో చివరి రోజైన ఇవాళ ద్రవిడ్ తన దరఖాస్తును సమర్పించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14 సీజన్ ఫైనల్ సమయంలో రాహుల్ ద్రావిడ్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి.. పదవీ కాలం ఇప్పుడు జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లీగ్‌తో ముగియనుంది. టీ20 ప్రపంచప్ తర్వాత విరాట్ కోహ్లీ కూడా పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నాడు.