రష్యాను వెంటాడుతున్న కరోనా… రికార్డ్ స్థాయిలో కేసులు…మరణాలు
ప్రపంచ వ్యాప్తంగా గత రెండేళ్లుగా కరోనా విలయతాండంవం చేస్తుంది. కరోనాతో పాటు డెల్టా వేరియంట్ కూడా కొన్ని అగ్రదేశాలను కూడా వణికిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. రష్యా, చైనా, న్యూజిలాండ్, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి అగ్రదేశాల్లో మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రష్యాలో గత కొన్ని రోజులుగా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. 28-10-2021న రష్యాలో ఏకంగా 41,096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 2,159 మంది మృతి చెందారు. కోవిడ్, డెల్టా వేరియంట్ తో పాటు కొత్త కొత్త వైరస్ లు అగ్రరాజ్యాలను పట్టి పీడిస్తున్నాయి. అయితే కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత రష్యాలో అత్యధికంగా నమోదైన కేసులు ఇవేనని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ వెయ్యికిపైగా మరణాలు సంభవిస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 6 వ తేదీ వరకు వారం రోజులపాటు జీతంతో కూడిన సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. ప్రజలెవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. రష్యాలో మొత్తం 14.6 కోట్ల మంది జనాభా ఉండగా, ఇందులో కేవలం 4.9 కోట్ల మంది మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఓ వైపు ఇంజెక్షన్ చేయించుకున్నా..కరోనా బారిన తప్పడం లేదు.