ఆరో రోజు సరస్వతీదేవి అలంకరణ

ఆరో రోజు సరస్వతీదేవి అలంకరణ

ఆరో రోజు సరస్వతీదేవి అలంకరణ

దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆశ్వయుజ శుద్ద షష్టి, మూలా నక్షత్రం నాడు అమ్మవారిని శ్రీ సరస్వతిదేవిగా అలంకరిస్తారు. మూలా నక్షత్రం అంటే అది అమ్మవారి జన్మనక్షత్రం. చదువుల తల్లి ఈ సరస్వతి దేవి. మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఈ సరస్వతి దేవి. ఆది ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిణిగా శుంభనిశుంభులనే రాక్షసుల్ని వధించింది. దానికి చిహ్నంగా అమ్మవారిని సరస్వతిదేవిలా అలంకరిస్తారు. సరస్వతీ అలంకారంలో అమ్మవారిని దర్శించడం మహాభాగ్యమని భక్తులు భావిస్తారు.

పూజా సమయం: తెల్లవారుజామున 4:09 నుంచి ప్రారంభమై రాత్రి 1:51 వరకు ఉంటుంది.

ఉదయం: 10:31 నుంచి 11:49 వరకు

సరస్వతి దేవి పూజా విధానం: మారేడు దళాలతో పూచిస్తే మంచిది

సరస్వతి దేవికి నైవేద్యం:  పరమాన్నం, దద్దోజనం, పాలు, రవ్వకేసరి

తినకూడదని పదార్ధాలు: పుల్లగా ఉన్న పదార్థాలు తినరాదు

సరస్వతి దేవికి ఇష్టమైన పుష్పాలు: తెల్లని చామంతి, తెల్ల మందారం, తెల్ల గులాబీ

దానం చేయాల్సినవి: పుస్తకాలు, పెన్నులు, పలకలు, పెన్సీల్స్

పఠించాల్సిన మంత్రం: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామారూపిణీ

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా… ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

సరస్వతి దేవి వాహనం: హంస, నెమలి

ఆయా ప్రాంతాలను బట్టి చదువుల తల్లి, దేవనాగరి: సరస్వతీ, తెలుగు: సరస్వతీ దేవి

సరస్వతీ దేవి చరిత్ర: హిందూ మతంలోని ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవేరి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ నది కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి. నవరాత్రి, వసంత పంచమి ఉత్సవాలలో సరస్వతీదేవి ఆరాధన ప్రముఖంగా జరుగుతుంది. స్వరూపం ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ, పద్మ పురాణంలోనూ సరస్వతి దేవి గురించి వివిధ గాధలున్నాయి.

సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాధ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాధ.

సరస్వతి దేవిని పూజించడం వల్ల వాక్ సుద్ధి, బుద్ధి , వివేకం,విద్య, కళలు, విజ్ఞానం అనేవి కలుగుతాయి. వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా , పుస్తకం మాలా ధారిణిగా వేదాల్లో చెప్పబడింది.

బమ్మెర పోతన రాసిన: సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం.“శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు” నదిగా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉట్టంకించాడు.సరస్వతి ధరించే వీణ పేరు”కచ్ఛపి”. పరాశక్తి, జ్ఞాన ప్రదాతసరస్వతి తన కవిత్వంలో రచించారు.

కొన్ని గ్రంథాల ప్రకారం రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినది. పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకరు. ఆ మాత కేవలం చదువులనే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకు ప్రసాదిస్తుందని దేవీ భాగవతం నవమ స్కంధం ఐదో అధ్యాయం వివరిస్తోంది. మహామాయ,భాషా జ్యోతిర్మయి,కళారస హృదయగా సరస్వతీ పూజలందుకొంటోంది.

జ్ఞాన ప్రదాతగా సరస్వతి పై కొన్ని గాధలు ఇలా చెప్పబడ్డాయి:

పూర్వం ఓసారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్థాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు.

అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమంది. అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తర్వాతనే అనంతుడు నిర్మలమైన  జ్ఞానాన్ని సిద్థాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు.

వాల్మీకి చెప్పిన కథ: వాల్మీకి జగదాంబను స్మరించాడు. అలా ఆయన సరస్వతి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్నిపొందాడు. వ్యాసుడు కూడా నూరేళ్ళపాటు పుష్కర  తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు. ఆ తర్వాతే  ఆయన వేద విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు. శివుడు పాటు దివ్వవాణిని తలచుకొని ఆ శక్తి  ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు.

పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి  భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు.

అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి  కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని , గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు.

సత్సభలలో మంచి విచారణ శక్తిని,సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత  యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా  దేవీ భాగవతంలో ఉంది.

శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. చదువుల తల్లి సరస్వతీదేవి రూపములో దుర్గాదేవి దర్శనమిచ్చే పవిత్రమైన రోజు. అమ్మను కొలిస్తే విద్యార్ధులకు చక్కని బుధ్ధిని వికాసము కలుగుతుంది.

శ్రీ సరస్వతీ అష్టోత్తర శత నామావళి పఠించి పూజ చేసుకోనవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *