సినీగేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు

సినీగేయ రచయిత సిరివెన్నెల ఇకలేరు

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (66) కన్నుమూశారు. సిరివెన్నెలకు ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వచ్చింది. దీంతో ఆయనకు సగం ఊపిరితిత్తు తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత బైపాస్ సర్జరీ కూడా జరిగింది. సిరివెన్నెల గత ఐదు రోజులుగా ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. ఎక్మో మిషన్ పై ఉన్న తర్వాత.. క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, ఒబీస్ పేషెంట్ కావడం, కిడ్నీ డ్యామేజ్ కావడంతో ఇన్‏ఫెక్షన్ శరీరమంతా సోకింది. దీంతో మంగళవారం 4 గంటల 7 నిమిషాల ప్రాంతంలో సిరివెన్నెల తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని భాస్కర్ రావ్ వెల్లడించారు.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి కన్నుమూతతో టాలీవుడ్ విషాదంలో మునిగిపోయింది. సినిమా ప్రేమికులంతా సాహిత్య లోకానికి చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.

సిరివెన్నెల మరణవార్త విన్న వెంటనే  కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని మెగాస్టార్ చిరంజీవి, తమన్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైద్యులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. కన్నీటి పర్యమంతమయ్యారు.

పార్థివదేహాన్ని అభిమానులు సినీ ప్రముఖుల సందర్శనార్ధం  ఫిల్మ్ చాంబర్ కు తరలించారు. దర్శకుడు రాజమౌళి, కీరవాణి సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించారు. ఫిల్మ్ నగర్‏లోని మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలను నిర్వహించనున్నారు. సిరివెన్నెల అస్తమించడంతో సినీ ప్రపంచం మూగబోయింది.

నాలుగు దశాబ్దాల సినిమా కెరీర్‌‌లో దాదాపు 800 చిత్రాల్లో 3 వేలకు పైగా పాటలు రాసిన సిరివెన్నెల.. ఉత్తమ సినీ గేయ రచయితగా 11 సార్లు నంది అవార్డులు, 4 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు గెల్చుకున్నారు. 2019లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.

సిరివెన్నెల మృతిపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు,  ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, ఇతర సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *