శ్రావణ మంగళగౌరీ పూజ ఎలా..?

శ్రావణ మంగళగౌరీ పూజ ఎలా..?

శ్రావణ మంగళగౌరీ వ్రతం

శ్రావణ మాసంలో వచ్చే నాలుగు మంగళవరాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ) మంగళ గౌరీ. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్లైన స్త్రీలు మాంగల్యానికి అధిదేవత ‘గౌరీదేవి’ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగల్యాన్ని పదికాలలపాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలు కొని ఐదేళ్లపాటు ఆచరించే వ్రతమే ‘మంగళగౌరీ వ్రతం’. శ్రావణ మాసంలో ఎన్ని మంగళ వారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళగౌరీని పూజిస్తారు. వివాహమైన మొదటి సంవత్సరం పుట్టినింటి లోనూ, ఆ తరువాతి నాలుగు సంవత్సరాలు అత్తవారింటిలోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటారు. ఈ వ్రతం చేయడం వలన భోగభాగ్యాలే కాక,
దీర్ఘ సుమంగళి భాగ్యం కూడా స్వంతమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందువలన పరమ శివుడు కూడా మంగళగౌరీని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.  వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.

   వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. (శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వచును)

  ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు.

  ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి. పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు 

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధానం..

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి. మంగళగౌరీని 5 ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై 4 మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం “మంగళగౌరీ” విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి లేక గౌరీ దేవి ఫొటో ని కూడా పూజించవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి.

మంగళగౌరీ వ్రత విధానం : ఆచమనం పాటిస్తూ ఆచమనం చేసిన తరువాత పూజావిధానాన్ని పాటించాలి. వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

శ్రీ మంగళ గౌరీ  వ్రతకథ :

పూర్వం ధర్మపాలుడనే ఒక ధనికునికి సదాచార సంపన్నురాలైన భార్య ఉండేది. కానీ వారికి పుత్ర సంతానం లేదు. వారు ఎన్నో వ్రతాలు చేశారు. దానాలు చేశారు. కానీ సంతానం కలగలేదు. ఒకనాడు భర్త అనుమతితో భార్య తన ఇంటి ముందునుంచి వెళ్లే భిక్షకుని జోలెలో బంగారం వేయగా, అతను కోపించి సంతానం కలుగకుండుగాక అని శపించాడు. దాంతో ఆ దంపతులు అతణ్ని ప్రార్థిస్తే అల్పాయుష్కుడైన ఒక కుమారుడు కలుగుతాడని, అయితే అతనిని పెళ్లాడే అమ్మాయి తల్లి ‘మంగళ గౌరీ వ్రతం’ చేసి కుమార్తెకు వాయనమిస్తే ఆ ప్రభావంవల్ల ఈ కుమారుడు మరణించడని అంటే ఆమెకు వైధవ్యం ప్రాప్తించదని భిక్షువు సూచించాడు.

అనంతరం వారు సంతానవంతులై కుమారునికి పదహారేళ్ల వయసురాగానే కాశీకి వెళ్లే వీరికి మార్గ మధ్యంలో దైవలీల ఫలితంగా మంగళగౌరీ వ్రతాన్ని చేసిన తల్లి గల ‘సుశీల’ అనే కన్యతారస పడుతుంది. సుశీల తల్లిదండ్రులను ఒప్పించి సుశీలతో తమ కుమారుని వివాహం జరిపిస్తారు. ఆమె సాహచర్యంతో భర్తకు పదహారేండ్ల అకాల మరణం ఉన్నా ‘మంగళగౌరీ’ వ్రతవాయినం తీసుకున్న కారణంగా భర్త పూర్ణాష్కుడవు తాడు. కాబట్టిన శ్రావణ మంగళ గౌరీ వ్రతా చరణ వలన స్త్రీలకు వైధవ్యం రాదని, పుణ్య స్త్రీలుగానే ఉంటారని పురాణ ప్రతీతి.

మంగళ గౌరీని ఉత్తరేణి దళాలతోనూ, గరికతోనూ అర్చించడం తప్పనిసరి. మహానివేదనలో పూర్ణపు కుడుములు, పులగం, బియ్యంతో చేసిన పరమానాన్ని నివేదించాలి. వ్రతం నాటి సాయంత్రం ముత్తైదువలను పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి.ఈ వ్రతంలో ప్రత్యేకంగా పేర్కొన దగింది తోరపూజ. పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని, దానికి తొమ్మిది ముళ్లు వేస్తారు. ఆ దారానికి మధ్యమధ్యలో దవనాన్ని కడ్తారు. ఈ తోరాలను గౌరీ దేవి ముందు పెట్టి పూజచేసి ఒక తోరాన్ని పూజచేసిన వారు కట్టుకుంటారు. రెండవ తోరాన్ని ముత్తైదువకు ఇస్తారు. మూడో తోరాన్ని గౌరీదేవికే సమర్పిస్తారు. ఈ విధంగా చేసే వ్రతాల ద్వారా సర్వ వాంచాఫలసిద్ధి కలుగుతుంది.

తోర పూజ పూజా విధానం

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

ఈ వ్రతంలో ఆకులు, వక్కలు ఐదేసిచొప్పున ఉంచి ఐదు జ్యోతులతో గౌరీదేవికి మంగళహారతి ఇస్తారు. తరువాత వాటిని సెనగలతో కలిపి తల్లికిగాని, బ్రాహ్మణ ముత్తైదువకు గాని వాయనంగా ఇస్తారు. ఇది చాలా మంచి శుభకరమైన వ్రతం.మంగళగౌరీ కటాక్షం వల్లే కుజుడు మంగళ వారానికి అధిపతి అయ్యడు. ఆడవారి ఐదోతనాన్ని రక్షించే ఈ మంగళ గౌరీ వ్రతాన్ని అయిదేళ్లు చేసి ఉద్యాపన చేస్తారు.

మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ తదుపరి సంవత్సరం నుండి వ్రతాన్ని కొన సాగించాలి. చివరగా ఉద్యాపన చేసి వ్రతాన్ని ముగించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: