శ్రావణ శుక్రవారం పూజా విధానం

శ్రావణ శుక్రవారం పూజా విధానం

శ్రావణ శుక్రవారం పూజా విధానం

శ్రావణమాసం మాసం అందరికీ ఆమోదయోగ్యమైన మాసం శ్రావణ మాసం. పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున అమ్మవారిని “వరలక్ష్మి” రూపంలో కొలుచుకుంటాము. మహిళలకు ఏదైనా అవాంతరం ఎదురవుతుందని అనుకుంటే తరువాత మాసంలోని ఇతర శుక్రవారాలలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చునని శాస్త్రాలు చెబుతున్నాయి. మన దేశంలో హిందువులేవారందరూ కులాలకు అతీతంగా, ఎలాంటి ఆడంబరమూ లేకుండా ఈ వరలక్ష్మి పూజను చేసుకోవచ్చు. అయితే హిందువులు అనే వారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారు తప్పక ప్రసన్నులవుతారని మన పూర్వీకుల నమ్మకం. అయితే అదే నమ్మకాన్ని మనము పాటిస్తున్నాం.ఇంతకీ ఈ వ్రతం ఎలా చేయాలో మీకు తెలుసా.. మేం చెప్పిన విధంగా ఫాలో అవ్వండి చాలు.. దేవీ మీ ప్రసన్నం అవుతుంది!

శ్రావణ వరలక్ష్మీ వ్రతం: పూజా విధానం

హిందువులంతా భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. పుణ్యస్త్రీలు అంతా ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు పెద్దగా అవసరం లేదు. అయితే మన వాళ్లు తలార స్నానం చేసి భక్తితో శుభ్రమైన వస్త్రం కట్టుకొంటే చాలు. ఈ వరలక్ష్మి పూజకు కావాల్సింది అమితమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. ఈ వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దీనితో పాటుగా సకల శుభాలు కలుగుతాయి. అయితే హిందు దేశంలో స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. శ్రావణ మాసంలో కొత్తగా పెళ్లైన వారు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా పట్టిస్తారు. ఈ వరలక్ష్మీ దేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. సందల్లో ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్టమైన అర్థం కూడా ఉంది.

వరలక్ష్మి పూజకు కావాల్సిన సామాగ్రి:  పసుపు, కుంకుమ, గంధం, విడిపూలు, పూలమాలలు, తమలపాకులు, 30వక్కలు, ఖర్జూరాలు, అగరవత్తులు, కర్పూరం, చిల్లర పైసలు, తెల్లని వస్ర్తం, రవికల గుడ్డ, మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు, అమ్మవారి ఫోటో,కలశం,కొబ్బరి కాయలు, తెల్ల దారం లేదా నోము దారం, లేదా పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు, బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

పూజా విధానం:

వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన లక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. ‘శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే’ శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలతో పాపాలు తొలిగి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది.

వరలక్ష్మీ వ్రత విధానం

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో లేదా రూపును తయారుచేసి అమర్చు కోవాలి. పూజాసామగ్రి, తోరాలు, అక్షతలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకుని ఉంచాలి. చేతనేనా వారు 9 రకాల పిండివంటలు చేసుకోవచ్చును

తోరం తయారు చేసుకోవడం: తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాయాలి. ఆ దారానికి 5 లేక 9 పూలు కట్టి ముడులు వేయాలి. అంటే 5 లేక 9 పోగుల దారాన్ని ఉపయోగించి, 5 లేక 9 పువ్వులతో ఐదు లేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలను తయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. మన హిందూ ఆచారంలో తొలుతగా గణపతి పూజ ప్రారంభించిన తరువాతే మిగతా పూజలు ఏదైనా స్టార్ట్ చేస్తాం.

తొలుతగా గణపతి పూజ: అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే .. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ అని స్తుతిస్తూ గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.

ఓం సుముఖాయ నమః,

ఓం ఏకదంతాయ నమః,

ఓం కపిలాయ నమః,

ఓం గజకర్ణికాయ నమః,

ఓంలంబోదరాయ నమః,

ఓం వికటాయ నమః,

ఓం విఘ్నరాజాయ నమః,

ఓం గణాధిపాయ నమః,

ఓంధూమకేతవే నమః,

ఓం వక్రతుండాయ నమః,

ఓం గణాధ్యక్షాయ నమః,

ఓం ఫాలచంద్రాయ నమః,

ఓం గజాననాయ నమః,

ఓం శూర్పకర్ణాయ నమః,

ఓం హేరంబాయ నమః,

ఓం స్కందపూర్వజాయనమః,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః

నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి,

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.

మన శక్తి కొలది స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,

భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ నీటిని నివేదనచేసి చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహా గుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి).

ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి.. నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

వరలక్ష్మీ కథ ప్రారంభం

పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. ఓ మునులారా!  స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి  చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి. అని కథ ప్రారంభించారు.

ఆనాటి కథను అనుసరించి పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి. ఇంద్రాది దిక్పాలకులు స్తుతి  స్తోత్రములతో పరమశివుడ్నికీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి ఓ నాథా!, ప్రాణీశ్వరా.. స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.  అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని పార్వతీ దేవీకి పరమేశ్వరుడు చెప్పసాగాడు.  అప్పుడు ఆ పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు  చేశారు? ఈ వ్రతాన్ని ఎవరు చేయాలి.. ఎవరో చేయకూడదో..ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.

అప్పడు ఆ శివుడు పార్వతీ దేవీకీ కథ చెప్ప సాగారు.. ఓ కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో “ చారుమతి”  అనే ఒక  బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతః కాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహ కృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం

ఆది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి.. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి మాయమైపోయంది. చారుమతి సంతోషించి. “హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ జననీ, ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది’’ అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

కలలోనుంచి మేల్కోని చారుమతి.. అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజేయగా.. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని ప్రొత్సహించారు. దానికి కావాల్సిన వసతి ఏర్పాట్లు చేశారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున ఆ ఊరులోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి  తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో పూజ చేయడం మొదలు పెట్టారు.

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది.

ఇంటికి వచ్చిన మహిళలంతా  అమ్మవారిని షోడశోపచారాలతో  పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా.. చారుమతి గృహంతో పాటు, ఆ ఊరిలోని ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ తరగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా మార్గ మధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో  తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ఊరారా చెప్పి వ్రత కథా విధాన్ని చెప్పసాగారు. మరియు ఆమెను ప్రశంసించారు.

ఇక నుంచి వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో.. సిరిసంపదలు కలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా…శివుడు  పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ  వ్రత విధానాన్ని సవి వివరంగా మీకు వివరించాను.

ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆర్యోగం సిద్ధిస్తుందని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. కథ విన్న వారంతా అక్షితలు వేసుకోవచ్చు. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. చేతనైతే జాకెట్ ముక్క తో పాటు పండు తాంబూలం ఇచ్చి అందరికీ కాళ్లకు దండాలు పెడతారు. వారి ఆశ్వీర వచనాల్నీ స్వీకరిస్తారు పుణ్య స్త్రీలు, అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని పూజలో కూర్చు వారు తినేయాలి. రాత్రి ఉపవాసం ఉండాలి. కింద్రనే పడుకోవాలి. ఆ రోజు మాత్రమే దాంపత్య జీవితానికి దూరంగా ఉంటే మంచిదని ముత్తైదువుల సూచన మాత్రమే..  ఏ హిందూ స్త్రీ అయినా భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని  చేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు   కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం  తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి.

సర్వమంగళం.. సర్వేజనాసుఖినోభవతు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: