చెరకుసాగు చేయండి.. లాభాలు పొందండి.

చెరకుసాగు చేయండి.. లాభాలు పొందండి.

తెలుగు రాష్ట్రాల్లో పండించే వాణిజ్య పంటలలో చెరుకు ముఖ్యమైనది. సాధారణంగా చెరకు మొక్కకి తగిన వర్షపాతం లేకపోతే, మొక్కకి అదనపు నీటిపారుదల అవసరం అవుతుంది. పంట బాల్యదశలో ఆరు రోజులకి ఒకసారి, పక్వదశలో అనగా (నవంబరు నుండి చెరకు నరికే వరకు) మూడు వారాలకోకసారి నీరు పెట్టాలి. ఈ నీరు తగినంత లేకపోతే చెరకు ప్రమాదానికి గురయ్యే అవకాశం లేకపోలేదు. నీటిపారుదల సౌకర్యం గల భూములు, చెరుకు సాగుకు మిక్కిలి అనువైనవి. గడ్డి జాతికి చెందిన తియ్యని కాండం గల మొక్క చెరకు. వాణిజ్యపరంగా విస్తృతంగా సాగు చేయబడుతున్న చెరకు, పొడవైన మరియు మందమైన కాండాలు, తీపి రసం కలిగి ఉంటాయి.

ఆహార పదార్ధాలు: పంచదార, బెల్లం అచ్చులు మరియు ఖండ చెక్కర వంటివి చెరకు పంట ద్వారా తయారవుతాయి. ఈ చెరుకు రసాన్ని త్రాగుతారు

వైద్య పరంగా: చెరకు ఆకు బూడిదను ఔషధపరంగా ఉపయోగించడంతో పాటుగా.. పాము కాటు, గొంతు నొప్పి, గాయాలుకు చెరకును ఉపయోగిస్తారు.

ఇతర ఉత్పత్తులు: ఈ చెరుకు కాండం ద్వారా ఉత్పత్తి చేయబడే మైనాన్ని కాగితం, ఎలక్ట్రిక్స్‌ కొరకు ఇన్సులేషన్‌, ఫర్నిచర్‌ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఇంధన ఉత్పత్తిలో మరియు శక్తిని ఉత్పత్తి చేసే బయోమాస్‌ గా కూడా చెరకును ఉపయోగిస్తారు.

చెరకు ఎత్తు: సాధారణంగా రెండు లేదా మూడు. మీటర్లు ఎత్తుకు చెరుకు మొక్క పెరుగుతుంది.

చెరకుసాగు నీటి పారుదల: చెరకు మొక్కకి తగిన వర్షపాతం లేకపోతే, మొక్కకి అదనపు నీటిపారుదల అవసరం అవుతుంది. పంట బాల్యదశలో ఆరు రోజులకి ఒకసారి, పక్వదశలో అనగా నవంబరు నుండి చెరకు నరికే వరకు మూడు వారాలకోకసారి నీరు పెట్టాలి. బిందు సేద్య పద్దతిని ఉపయోగించడం వలన పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకొవచ్చు. జంట పాళ్ళ పద్దతిలో చెరకు సాగు చేసినప్పుడు ఖర్చును తగ్గించుకోవచ్చు.

నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరకు నాటిన 3వ రోజు ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెరకు పిలకలు నాటినప్పుడు వచ్చే చెత్తను కప్పటం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడంతో బాటు కలుపు, పీక పురుగుల ఉధృతి తగ్గించవచ్చు.

వర్షాధారంగా చెరకును సాగుచేసినపుడు, చెరకు తోటకు బాల్యదశలో మొదటి తడిపెట్టిన 30 రోజులకు రెండవ తడిని పెట్టడం మంచిది. వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి.

ఎప్పుడు మందులు చల్లాలి: సాగు నీటిలో లవణాల సాంద్రత అధికంగా ఉన్నపుడు 2 మిల్లీలీటర్ల మోస్లు మరియు సోడియం కార్బోనేట్‌ అవశేషం లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. చెరకు పంటకు సుమారు 1900 నుండి 2700 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది.

ఏ దశలో నీరు పెట్టాలి: బాల్యదశ లేదా పిలకలు పెట్టె దశ అని పంట మొదటి నాలుగు నెలలను అంటారు. అత్యంత కీలకమైన పిలకలు పెట్టె దశ తేమ సున్నిత దశ. ఈ దశలో పంటకు ఆరు రోజులకొకసారి నీరు పెట్టాలి. సాంప్రదాయ పద్ధతిలో బోదెలు-కాలువల పద్ధతిలో నీరు పెట్టవచ్చును. పరిమిత నీటి వనరులను పొదుపుగా బిందు సేద్యం పద్ధతి ఉపయోగించడం వలన వాడుకోవచ్చు. బిందు సేద్యం పద్ధతికయ్యే ఖర్చును 50% వరకు జంట చాళ్ళ పద్ధతిలో చెరకు సాగు చేసినపుడు తగ్గించుకోవచ్చు.

ఎరువుల యాజమాన్యం: ఆలస్యంగా నాట్లు వేస్తున్న రైతులు కాలువలు తయారు చేయడానికి ముందుగా తమకు లభ్యంగా ఉన్న పశువుల ఎరువు గానీ, కంపోస్టు గానీ, వెదజల్లి దున్నాలి. లోతుకాలువల పద్ధతి అవలంభించినప్పుడు ఈ సేంద్రియ ఎరువులను వారం రోజులు ముందుగా చల్లి మన్నుతో కలియబెట్టాలి. ఫిల్టరు మట్టి లభ్యమైన చోట్ల దానిని కూడా ఎకరానికి 10-12 టన్నులు వేయవచ్చు. సేంద్రియ ఎరువులు లేకుంటే పచ్చిరొట్ట ఎరువులైన జనుము లేక సీమజీలుగ విత్తనాలను తోటలో చల్లాలి. ఇలా చేయడానికి హెక్టారుకు 15 కిలోల జనుము విత్తనాలు లేక 10 కిలోల సీమ జీలుగు విత్తనాలు కావాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులు మొక్కలు పెరుగుదలను బట్టి సుమారు 60 రోజుల తర్వాత మొక్కలను మొదట వేసి మట్టితో కప్పాలి. మొదటి 60-70 రోజులలో అంతరపంటలుగా మినుము,పెసర వేసుకోవచ్చు.

అమ్మోనియం సల్ఫేట్, యూరియా, కాల్షియం, అమ్మోనియం నైట్రేట్ లేక అమ్మోనియం సల్ఫేట్ వంటి రసాయనిక ఎరువులలో ఏదైనా ఒక దానిని ప్రాంతాలను బట్టి వివిధ మోతాదులలో ఆయా మొక్క రకాన్ని బట్టి తోటలకు వేయాలి. నత్రజని ఎరువులను మొక్కల మొదళ్ళ వద్ద సుమారు 7 1/2 సెంటీమీటర్లలోతు గోతులలో వేసి మట్టితో కప్పాలి.

భాస్వరం, పొటాష్ ఎరువులు ఆయానేల స్వభావం, నేలలో ఆయా మూలకాల లభ్యతను బట్టి వేసుకోవాలి. హెక్టారుకు 1/2 కిలోగ్రాముల భాస్వరం అందించే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి కలపాలి చెరువుల కింద సాగుచేసే వర్షాధారపు చెరకు పంటకు హెక్టారుకు 120 కిలోల పొటాషియం రెండు దఫాలుగా ముచ్చెలు నాటినపుడు సగభాగం. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో మిగిలిన భాగం వేసుకుంటే ఎండాకాలంలోనే కాక వర్షాకాలం తర్వాత ఏర్పడే వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకుంటుంది. 81ఎ99, కోటి 201,85 ఎ 261, కో 7219 రకాలకు పొటాషియం చాలా అవసరం. నత్రజని, భాస్వరం, పొటాష్ గాక చెరకు మొక్కలకు కాల్షియం , మెగ్నీషియం, ఇనుము, మాంగనీస్, రాగి, జింక్, గంధకం, సిలికాన్ కూడా అవసరమవుతాయి.

ఏ ప్రదేశాల్లో ఎక్కువగా మందులు చల్లాలి: సున్నం అధికంగా ఉండే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో, చిత్తూరు, నిజామాబాద్ జిల్లాలో అక్కడ అక్కడ ఆకులలో పచ్చదనం తగ్గి అవి పాలిపోతాయి. ఈ పరిస్థితికి ఇనుములోపించడమే కారణం. దీనిని 2 శాతం ఫెర్రస్ సల్ఫేట్ కలిపిన నీరు మొక్కల మీద చల్లి నివారించవచ్చు. రెండు వారాల వ్యవధిలో రెండుసార్లు ఈ మందు చల్లితే ఈ పరిస్థితి అరికట్టవచ్చు. మాంగనీసు లోపిస్తే హెక్టారుకు 6.25 కిలోగ్రాముల మాంగనీస్ సల్ఫేట్ 1125 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేస్తే మాంగనీసు లోపం నివారించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *