TS High Court: ఇంచార్జి సీజే గా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు

TS: హైకోర్టు తాత్కాలిక ఇంచార్జి CJగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు
తెలంగాణ హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. సీజేగా పనిచేసిన జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన నేపథ్యంలో.. హైకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావుకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇందుకు సంబంధించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ హైకోర్టు ఇంచార్జి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. ఆయన తండ్రి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, ఇండియన్ లా కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు.
జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించారు. 1989లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. LLB మూడో సంవత్సరంలో అత్యధిక మార్కులు రావడంతో CVS ఆచార్యులు గోల్డ్ మెడల్ రామచంద్రరావు అందుకున్నారు. 1989, సెప్టెంబర్ నెలలో అడ్వకేట్‌గా తన పేరును నమోదు చేసుకున్నారు. 1991లో యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి LLM పట్టా సాధించారు. ఇక ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2012లో నియమితులైన జస్టిస్ రామచంద్రరావు 2013 డిసెంబరు 4 నుంచి జడ్జిగా కొనసాగుతున్నారు.
ఐఆర్డీఏ, ఎస్బీహెచ్, డీసీసీబీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, సెబీ తదితర సంస్థలకు అడ్వకేట్‌గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కూడా సేవలు అందించారు.