అమ్మాయిల పెళ్ళి వయస్సు మారుతోంది

అమ్మాయిల పెళ్ళి వయస్సు మారుతోంది

మన దేశంలో అమ్మాయిల పెళ్ళి వయస్సు మారబోతోంది. ఇప్పటిదాకా అమ్మాయిల పెళ్ళి వయస్సు 18 ఏళ్ళు ఉండగా… దాన్ని 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. దాంతో ఇకపై అమ్మాయిలు, అబ్బాయిల పెళ్ళి వయస్సు (21యేళ్ళు ) సమానం కాబోతోంది.

బాల్యవివాహాల నిరోధక చట్టం 2006 చట్టానికి సవరణలు చేసింది కేంద్రం. 2020 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమ్మాయి పెళ్లి వయసును 21యేళ్ళకు పెంచుతామని చెప్పారు. దాంతో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టబోతోంది.

ప్రస్తుతం దేశంలో అమ్మాయిల పెళ్ళి వయస్సు 18 ఏళ్లు, అబ్బాయిలకి 21 ఏళ్లుగా ఉంది. అమ్మాయిల పెళ్ళి వయస్సు తక్కువగా ఉండటంతో చిన్నవయస్సులోనే గర్భం దాల్చడంతో ఇబ్బందులు పడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందుకే అమ్మాయిల కనీస పెళ్ళి వయస్సును కూడా పురుషులతో సమానంగా 21ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై 2020 జూన్‌లో నీతి ఆయోగ్‌ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. జయ జైట్లీ ఆధ్వర్యంలోని ఈ టాస్క్ ఫోర్స్ లో ప్రభుత్వ నిపుణులు డాక్టర్‌ వీకే పాల్‌, ఆరోగ్య, స్త్రీ, శిశు సంక్షేమశాఖ, న్యాయ మంత్రిత్వ శాఖల సీనియర్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ దేశమంతటా అభిప్రాయ సేకరణ చేపట్టింది. వీటి ప్రకారం అమ్మాయిలు గర్భం దాల్చే సమయానికి కనీస వయస్సు 21 ఏళ్ళు ఉండాలని సూచించింది. 21 ఏళ్ల లోపే పెళ్లిళ్లు జరిగితే సామాజికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా వాళ్ళపై ప్రభావం చూపిస్తున్నాయని తెలిపింది. దాంతో కేంద్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వయస్సును పెంచాలని నిర్ణయించింది.

అయితే ఇప్పటికే 18యేళ్ళ లోపు బాల్యవివాహాలు అనేకం గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దాంతో చాలామంది ఆడపిల్లలు 18యేళ్ళు రాకముందే గర్భం దాలుస్తున్నారు. ఇప్పుడు వివాహ వయస్సు పెంపు అమలు చేయడం అనేది అధికారులకు సవాల్ గా మారే అవకాశముంది. అయితే అమ్మాయిల వివాహ వయస్సు పెంచడాన్ని మాత్రం అందరూ స్వాగతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *