ఉత్తరాదిన ఒక్కో రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకుంటూ వస్తున్న బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏకి దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే ఏడాదిలో జరగబోయే తమిళనాడు ఎన్నికలతో పాటు ఏపీ, తెలంగాణలో, కర్ణాటకలో పట్టు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా అందుకోసం కొత్త ప్లాన్ తె రెడీ అవుతున్నారు.
తమిళనాడులో ఈసారి అధికారం దక్కించుకోడానికి అన్నా డీఎంకేతో జతకట్టింది బీజేపీ. అందుకోసం ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలైని రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పించింది. కానీ అన్నామలై పవర్ ఏంటో బీజేపీ అధిష్టానానికి బాగా తెలుసు. ఆయన్ని జాతీయ రాజకీయాల్లోకి తీసుకుంటూనే, దక్షిణాది రాష్ట్రాల్లో కీ రోల్ పోషించేలా తీర్చి దిద్దాలని ప్రయత్నిస్తోంది. అందుకే అన్నామలైను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపాలన్న ప్లాన్ లో ఉంది.
ఏపీ నుంచే ఎందుకు ?
ఏపీ కేంద్రంగానే దక్షిణాదిపై పట్టుకు బీజేపీ ఫోకస్ చేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అందువల్ల అన్నామలైను అక్కడి నుంచి రాజ్యసభకు పంపి, అవసరమైతే కేంద్రమంత్రి పదవి కూడా ఇవ్వాలని మోడీ, షా ఆలోచిస్తున్నట్టు సమాచారం. నిజానికి ఏపీలో బీజేపీకి ఉన్న బలం తక్కువే. టీడీపీ, జనసేనతో కలసి మాత్రమే పనిచేస్తోంది తప్ప, సొంతంగా ఎదిగే పరిస్థితి లేదు. అందుకే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో బలం పెంచుకోడానికి ఆలోచన చేస్తోంది. ఏపీ నుంచి ఇప్పటికే ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపింది. ఇప్పుడు విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మరో సీటుకు అన్నామలైనే సరైన అభ్యర్థి అని బీజేపీ భావిస్తోంది.
అన్నామలై… పవన్ కలిస్తే…
అన్నామలై, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఫైర్ బ్రాండ్స్. సనాతన ధర్మాన్ని జనంలోకి తీసుకెళ్ళడంలో ఇద్దరూ కీలకం. అగ్రెసివ్ గా దూసుకెళ్ళే సామర్థ్యం ఉంది. బీజేపీకి కావల్సింది కూడా అదే. ఉత్తరాదిలో హిందూయిజం, సనాతన ధర్మం ఆ పార్టీకి బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు దక్షిణాదిలో కూడా ఈ నినాదం ఎత్తుకోవాలని బీజేపీ భావిస్తోంది. అసలు పవన్ కల్యాణ్ ని సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడించింది కూడా బీజేపీ అధిష్టానమే అంటారు. సనాతన ధర్మాన్ని కోవిడ్ తో పోల్చి ఓవరాక్షన్ చేసిన ఉదయ నిధికి గట్టిగా కౌంటర్ ఇచ్చిన వాళ్ళల్లో… ఫస్ట్ అన్నామలై తర్వాత పవన్ కల్యాణే. అందుకే ఈ ఇద్దర్నీ జత చేసి, రేపు తమిళనాడు ఎన్నికల్లో ప్రచారానికి పంపి, చక్రం తిప్పాలన్నది ఢిల్లీ బీజేపీ పెద్దల ఆలోచన. గతంలో సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు మంచి దూకుడు మీద ఉన్న బండి సంజయ్ ని రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి బీజేపీ అధిష్టానం తొలగించింది. అలాగే ఇప్పుడు తమిళనాడులోనూ ఫైర్ బ్రాండ్ అయిన అన్నామలైను, ఏఐడీఎంకే కోసం త్యాగం చేయడంపై విమర్శలు వచ్చాయి. కానీ బీజేపీ మాత్రం తమిళనాడు విషయంలో కొంత డిఫరెంట్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అన్నామలైను రాజ్యసభకు పంపి, కేంద్ర మంత్రిని చేసి, ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించాలని చూస్తోంది. అన్నా డీఎంకేతో పొత్తుతో బీజేపీకి ఆ రాష్ట్రంలో గెలుపుపై కొత్త ఆశలు కలుగుతున్నాయి. అటు నటుడు విజయ్ ఒంటరి కావడం, ఈ మూడు పార్టీలను డీఎంకే ఫేస్ చేయాల్సి రావడంతో తమిళనాడులో విజయం ఎవరి వైపు ఉంటుందన్నది చూడాలి.
విజయ్ సాయికి రీ ఎంట్రీ లేదా ?
విజయ్ సాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేశాక… ఆయన స్థానం అసెంబ్లీలో పూర్తి మెజార్టీ ఉన్న కూటమికే దక్కుతుంది. ఈ ఎన్నికకు ఈసీ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కూటమి నుంచి ఈ సీటును బీజేపీకే ఇస్తున్నారు. సాయిరెడ్డి రిజైన్ చేసినప్పుడే బీజేపీ, మిగతా రెండు కూటమి పార్టీలకు ఆ విషయం చెప్పేసింది. ఆ తర్వాత బీజేపీ నుంచి కొందరు లీడర్లు ఈ స్థానం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ వాళ్ళెవరికీ వర్కవుట్ అయినట్టు లేదు. మొన్నటి దాకా ఆ ఎంపీ సీటను తిరిగి సాయిరెడ్డికే బీజేపీ కేటాయిస్తుందని ప్రచారం కూడా జరిగింది. కానీ సాయిరెడ్డికే ఇవ్వాలని బీజేపీ కూడా అనుకున్నట్టు కనిపించడం లేదు. పైగా సాయి రెడ్డి కూడా మళ్ళీ పోటీలో ఉండాలని అనుకోవట్లేదని తెలుస్తోంది. అందుకే ఆ సీటును అన్నామలైకు ఇవ్వాలని బీజేపీ దాదాపు డిసైడ్ చేసిందని అంటున్నారు. అన్నామలై ఏపీ నుంచి ఎంపీగా ఉంటే, బీజేపీకి ఎంతో ఉపయోగం అంటున్నారు. ఏపీతో పాటు తమిళనాడుకి కూడా ఈ సీటు ఉపయోగపడుతుందని ఢిల్లీ కాషాయం పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై వచ్చేవారం క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.