పహల్గాంలో ఆపరేషన్ మహాదేవ్ తో ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చినట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరును తీవ్రంగా విమర్శించారు. “ఉగ్రవాదులను హతమార్చడానికి తేదీలు, వారాలు చూడాలా? విపక్షాలు ఈ ఆపరేషన్‌ను ఎందుకు నిన్నే చేపట్టారని ప్రశ్నిస్తున్నాయి. దేశ భద్రత విషయంలో సైన్యం నిర్ణయాలను అనవసరంగా విమర్శిస్తున్నారు,” అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. “సైన్యంపై నమ్మకం ఉంటేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. దేశం సురక్షితంగా ఉన్నప్పుడే టెక్నాలజీ, నాలెడ్జ్ రంగాల్లో అభివృద్ధి సాధ్యం. కానీ, కాంగ్రెస్ ఎప్పుడూ నిరాశావాద ధోరణిలో ఉంటుంది,” అని ఆయన విమర్శించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను తిరిగి స్వాధీనం చేసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ గతంలో కాంగ్రెస్ పాలనలోనే పీవోకే పాకిస్థాన్ కబ్జాలోకి వెళ్లిన సంగతి గుర్తు లేదా అని మోడీ ప్రశ్నించారు. “1971లో పీవోకేను తిరిగి పొందే అవకాశం వచ్చినా, కాంగ్రెస్ దానిని వేస్ట్ చేసింది. అప్పట్లో మన సైన్యం పాక్ భూభాగంలో వేల కిలోమీటర్లు ముందుకెళ్లింది. ముందుచూపుతో వ్యవహరించి ఉంటే, పీవోకే ఇప్పటికే మన సొంతం అయ్యేది,” అని మోడీ అన్నారు. అలాగే 1974లో కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించడం వల్ల తమిళ జాలర్లు ఇబ్బందులు పడుతున్నారని మోడీ తెలిపారు. “కాంగ్రెస్ హయాంలో జాతీయ భద్రతపై ఎలాంటి దీర్ఘకాలిక దృష్టి లేదు. యూపీఏ పాలనలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా, పాకిస్థాన్‌కు ఇచ్చిన ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ హోదాను తొలగించలేదు. కానీ, మేం పహల్గాం దాడుల తర్వాత ఆ హోదా రద్దు చేశాం, సరిహద్దులను మూసివేశాం, వీసాలను రద్దు చేశాం,” అని ప్రధాని తెలిపారు. “నెహ్రూ కాలంలో సింధు జలాల ఒప్పందం వల్ల ‘నదులు మనవి, జలాలు పాక్‌వి’ అన్నట్లు జరిగింది. ఈ ఒప్పందం లేకపోయి ఉంటే, భారత భూభాగం సస్యశ్యామలంగా ఉండేది,” అని మోడీ వ్యాఖ్యానించారు. భారత్ యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం. ఆత్మనిర్భర్ భారత్‌తో మన యువత సత్తా చాటుతోంది,” అని ప్రధాని మోడీ తన స్పీచ్ లో తెలిపారు.