ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన శౌర్యం, ప్రతాపంతో 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలితాలను చూస్తున్నామని ఆయన అన్నారు. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చకు సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్‌తో సహా విపక్షాల తీరును మోడీ విమర్శించారు. “ఆపరేషన్ సిందూర్‌ను ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో మాట్లాడాను. పాకిస్థాన్ భారీ దాడికి సిద్ధమవుతోందని ఆయన హెచ్చరించారు. దానికి మేం బుల్లెట్‌కు బుల్లెట్‌తో సమాధానం ఇస్తామని, పాక్‌కు భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పాను. ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకోబోమని వాన్స్‌కు చెప్పాం. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులు ఆపాలని వేడుకున్న తర్వాతే ఆపరేషన్‌ను నిలిపివేశాం,” అని మోడీ తెలిపారు. పాకిస్థాన్‌కు కేవలం మూడు దేశాలు మాత్రమే మద్దతు ఇచ్చాయని, 193 ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్‌ను సమర్థించాయని ఆయన తెలిపారు. “పహల్గాం దాడులు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే జరిగాయి. ఉగ్రవాదులను మట్టిలో కలిపామని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. పాక్ ఎయిర్ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాయి. అణుబాంబు బెదిరింపులు చెల్లవని పాక్‌ను హెచ్చరించాం,” అని మోడీ అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ, “ఆపరేషన్ సిందూర్‌ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోంది. స్వార్థ రాజకీయాల కోసం సైన్యం పరాక్రమాలను తక్కువ చేస్తోంది. కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలతో సైనికుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. పాకిస్థాన్‌ను వెనకేసుకొచ్చే కాంగ్రెస్ తీరు దౌర్భాగ్యకరం. పైలట్ అభినందన్ పాక్‌కు చిక్కినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే చేశారు. అయినా, మేం అభినందన్‌ను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చాం,” అని మోడీ గుర్తు చేశారు.
“భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. భారత ప్రజల భావనలతో కలిసి ముందుకు సాగుతున్నా. ఆపరేషన్ సిందూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచిన దేశ ప్రజలకు రుణపడి ఉన్నా,” అని ఆయన అన్నారు. పాకిస్థాన్ మళ్లీ దుశ్చర్యలకు పాల్పడితే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని, ఉగ్రవాదులను ఏరివేస్తామని మోడీ హెచ్చరించారు.
