బెంగళూరు : ఇల్లీగల్ బెట్టింగ్ రాకెట్ పై చట్టం వచ్చిన వెంటనే బడా బాబులు చట్టానికి పట్టుబడుతున్నారు. పప్పీ అని పిలిచే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి వీరేంద్రను, సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్లో శనివారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇల్లీగల్ గా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర నుంచి రూ.12 కోట్ల క్యాష్, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, నాలుగు లగ్జరీ వెహికల్స్ స్వాధీనం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 500 నోట్ల రూపాయలు కట్టలు… కట్టలుగా బయటపడ్డాయి.
చట్టం అమల్లోకి రాగానే ఈడీ దాడులు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపిన తెల్లారే ఈ దాుడులు జరిగాయి. ఈ చట్టం కింద ఆన్లైన్ బెట్టింగ్, జూదం, నగదు ఆధారిత గేమింగ్‌ను నిషేధించారు. ఐదేళ్ల జైలు శిక్ష, భారీగా జరిమానాలను విధిస్తుంది. ఈ చట్టం ఆమోదం తర్వాత, ఈడీ దేశవ్యాప్తంగా కర్ణాటక, సిక్కిం, రాజస్థాన్, మహారాష్ట్ర, గోవాలో 31-32 ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో వీరేంద్ర నడిపిన అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ బయటపడింది.
స్వాధీనం చేసుకున్న ఆస్తులు
ఈడీ దాడుల్లో రూ. 12 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.1 కోటి విదేశీ కరెన్సీ (అమెరికన్ డాలర్లు, బ్రిటిష్ పౌండ్లు, యూఏఈ దిర్హమ్లు, యూరోలు) ఉన్నాయి. అలాగే, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు కూడా పట్టుబడ్డాయి. 4 లగ్జరీ వెహికల్స్ లో 3 ‘0003’ వీఐపీ నంబర్‌తో ఉన్నాయి. అంతర్జాతీయ క్యాసినోలైన ఎంజీఎం, బెల్లాజియో, మెట్రోపాలిటన్, మెరీనా, క్యాసినో జువెల్, తాజ్, హయత్, ది లీలా వంటి లగ్జరీ హోటళ్ల మెంబర్షిప్ కార్డులు పట్టుబడ్డాయి. అత్యధిక విలువైన క్రెడిట్, డెబిట్ కార్డులు కూడా లభించాయి. వీరేంద్ర గ్యాంగ్టాక్లో ఒక క్యాసినోను లీజుకు తీసుకుని నడపాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అక్రమ బెట్టింగ్ నెట్వర్క్
వీరేంద్ర కింగ్567, రాజా567, పప్పీస్003, రత్న గేమింగ్ లాంటి ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్లను నిర్వహించాడు. గోవాలో పప్పీస్ క్యాసినో గోల్డ్, ఓషన్ రివర్స్ క్యాసినో, పప్పీస్ క్యాసినో ప్రైడ్, ఓషన్ సెవెన్ క్యాసినో, బిగ్ డాడీ క్యాసినో వంటి క్యాసినోలపై ఈడీ దాడులు చేసింది. ఈ క్యాసినోల ద్వారా దుబాయ్‌తో సహా అంతర్జాతీయ స్థాయిలో నిధులను లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడి సోదరుడు కేసి తిప్పేస్వామి దుబాయ్ నుంచి డైమండ్ సాఫ్ట్‌టెక్, టీఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9టెక్నాలజీస్ వంటి సంస్థల ద్వారా కాల్ సెంటర్ సేవలు, గేమింగ్ కార్యకలాపాలను నిర్వహించాడు. వీరేంద్ర సోదరుడు కేసి నాగరాజ్, మేనల్లుడు పృథ్వి ఎన్ రాజ్‌లకు సంబంధించిన 17 బ్యాంకు ఖాతాలు, రెండు లాకర్లు సీజ్ చేశారు.
రాజకీయ నేపథ్యం, అన్నీ వివాదాలే
కర్నాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచాడు వీరేంద్ర. కన్నడ నటుడు దొడ్డన్నకు మేనల్లుడు. 2016లో ఆదాయపన్ను శాఖ దాడుల్లో అతని నివాసంలో రూ. 5.7 కోట్ల నగదు, 32 కిలోల బంగారం లభించాయి. గతంలో పబ్లిక్ న్యూసెన్స్, లంచం, ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులను ఎదుర్కొన్నాడు. వీరేంద్ర ఆస్తుల విలువ రూ. 134 కోట్లుగా 2023 ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నాడు. సోషల్ మీడియాలో అతడి విలాసవంతమైన జీవనశైలి, చిత్రదుర్గలో అతిపెద్ద కార్ల సేకరణ గురించి చర్చలు జరుగుతున్నాయి.
వీరేంద్రను సిక్కిం మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు, అక్కడ నుంచి అతడిని బెంగళూరుకు తరలించడానికి ట్రాన్సిట్ రిమాండ్ జారీ అయింది. ఈ కేసు, రాజకీయాలు, సంస్థాగత నేరాలు, నియంత్రణ లేని గేమింగ్ కార్యకలాపాల మధ్య లింకేజ్ ని హైలైట్ చేస్తుంది. కొత్త ఆన్లైన్ గేమింగ్ చట్టం అమల్లోకి రావడంతో, ఇంకా ఇలాంటి నెట్‌వర్క్‌లపై మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది.
Read also :
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/