Hyderabad Internet, Cable TVs Bundh | అడ్డగోలుగా వైర్లు కట్ – ఆలోచించరా ?
హైదరాబాద్ లో ఎప్పుడు ఏ ఏరియాలో చూసినా ఇంటర్నెట్ ప్రాబ్లెమ్స్ తో జనం ఇబ్బందులు పడుతున్నారు. దేశమంతా టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. డిజిటల్ యుగం నడుస్తోంది… కానీ హైదరాబాద్ లో మాత్రం
రూల్స్… రెగ్యులేషన్స్… అంటూ అడ్డగోలుగా ఇంటర్నెట్ కేబుల్ వైర్లు కత్తిరిస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది.
హైదరాబాద్ లో ఏ స్ట్రీట్ చూసినా… రోడ్లపైనే కేబుళ్ల గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. దాదాపు మూడు వారాలైంది ఈ ప్రాబ్లెమ్ మొదలై….ఇప్పటికీ చాలా ఏరియాల్లో ఇంటర్నెట్ రావడం లేదు.. ఈ 2025 లో ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంట్ అన్నది ప్రభుత్వానికి అర్థం కాదా… లేదంటే జనం అంటే నిర్లక్ష్యమా….ఈ ప్రాబ్లెమ్ ఎందుకు తలెత్తింది… జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు..

హైదరాబాద్ లో ఇంటర్నెట్, కేబుల్ వైర్ల కటింగ్ సమస్యకు మూల కారణం…ఆగస్టు 17న రామంతాపూర్ గోఖలే నగర్ లో జరిగిన ప్రమాదం…. నిజంగా ఆ సంఘటన దురదృష్టకరం… ఆరోజు కృష్ణాష్టమి సందర్భంగా….ఓ ఊరేగింపు జరిగింది… అందులో రథానికి కరెంట్ తీగలు తగిలి….మొత్తం ఆరుగురు చనిపోయారు….వీటికి ఇంటర్నెట్, కేబుల్ వైర్లే కారణం… ఏ స్ట్రీట్ లో చూసిన వేలాడే తీగలే కనిపిస్తున్నాయి అని సహజంగా జనం నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. కోర్టులో కేసు కూడా వేశారు. జరిగిన సంఘటన దురదృష్టకరం… అలాగే… హైదరాబాద్ లో కేబుల్స్ వేలాడుతున్నదీ నిజమే. కానీ ఈ నిర్లక్ష్యానికి కారణం … కేవలం ప్రభుత్వ పెద్దలే…
అప్పటి BRS, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. హైదరాబాద్ రోజు రోజుకీ డెవలప్ అవుతోంది… ఫాస్టెస్ట్ సిటీగా ఎదుగుతున్న ఈ మహానగరంలో… అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలని… నానో కేబుల్స్ వేస్తే…
ఇలాంటి సమస్యలు రావని అప్పుడెప్పుడో… BRS ప్రభుత్వ హయాంలో డిసైడ్ చేశారు… అదే టైమ్ లో ఇంటింటికీ చౌకగా ఇంటర్నెట్ అనే ప్రపోజల్ కూడా నడిచింది… కానీ ఏమైందో ఏమో… అది ఇప్పటికీ వర్కువుట్ కాలేదు.

సరే… ఇప్పుడు ప్రాబ్లెమ్ చూద్దాం…
ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీలు), మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్ఓలు), అండ్ లోకల్ కేబుల్ ఆపరేటర్ల (ఎల్సీఓలు) వీళ్ళంతా కలసి కరెంట్ పోల్స్ కి తీగలు వేలాడదీస్తున్నారు. ఇందులో విద్యుత్ శాఖ వెర్షన్ ఏంటంటే, వరదలు, విద్యుత్ సరఫరా అంతరాయాలు, ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుల్ వైర్ల వల్ల… కార్మికులు, సామాన్య జనానికి ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే విద్యుత్ స్తంభాలపై అక్రమంగా వేసిన కేబుళ్లను తొలగిస్తున్నామని చెబుతోంది… అయితే, కేబుల్ వేసేటప్పుడు… ఈ విద్యుత్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు… అనుమతి ఉందా లేదా… అలా వేస్తే ప్రమాదం అని వాళ్ళకి తెలియదా…
గ్రేటర్ పరిధిలో 5 లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలున్నాయి. ఒక్కో స్తంభానికి కేబుల్ వేయడానికి ఏటా రూ.50 నుంచి రూ.100 వరకు ఫీజు వసూలు చేస్తోంది విద్యుత్ శాఖ. నిజానికి 15 మీటర్ల ఎత్తులో కేబుల్ అమర్చాలి. కానీ చాలా కేబుళ్లు కేవలం 6-7 అడుగుల ఎత్తులోనే వేలాడదీస్తున్నారు…ఈ కేబుళ్ల బరువు వల్ల ఈదురు గాలులు, వర్షాల సమయంలో చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడటంతో స్తంభాలు కూలుతున్నాయి. దాంతో విద్యుత్ శాఖ సిబ్బంది… ఇష్టమొచ్చినట్టు కేబుల్స్ కట్ చేస్తున్నారు… ఇప్పటివరకు సర్వీస్ ప్రొవైడర్లకు రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. కానీ మూడు వారాలుగా ఇంటర్నెట్ టీవీ సేవలు పునరుద్ధరించకపోవడంతో ఐటీ ఉద్యోగులు, ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అయ్యే స్టూడెంట్స్,
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. యూట్యూబ్, వాట్సాప్, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు దగ్గర నుంచి ఆన్లైన్ షాపింగ్ దాకా ప్రతి పనికీ ఇంటర్నెట్ కావాలి… వీళ్ళతో పాటు…. చిన్న షాపుల యజమానులు, వ్యాపారులు కూడా ఇందులో బాధితులు. ఆన్లైన్ పేమెంట్లు, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కస్టమర్ కమ్యూనికేషన్ కోసం ఇంటర్నెంట్ మీద ఆధారపడతారు. ఈ సేవలు మొత్తం నిలిచిపోయాయి. దాంతో బిజినెస్ లాస్ అవుతోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఐటీ అండ్ ఇతర ఉద్యోగులు ఆన్లైన్ మీటింగ్స్, ఫైల్ షేరింగ్, క్లౌడ్ సర్వీసులు లేకుండా పని చేయలేకపోతున్నారు.

అనాలోచిత చర్యలు:
సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం లేకుండా ఇష్టమొచ్చినట్టు వైర్లు కట్ చేయడం దారుణం. విద్యుత్ శాఖ అధికారులు ముందుగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీలు), మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్ఓలు),
లోకల్ కేబుల్ ఆపరేటర్లకు (ఎల్సీఓలు) సమాచారం ఇవ్వకుండా, ఫీజులు చెల్లించలేదన్న సాకుతో ఆప్టికల్ కేబుళ్లను అడ్డగోలుగా కట్ చేయడం దారుణం. ఇలాంటి అనాలోచిత చర్యలు విద్యుత్ స్తంభాలపై అక్రమ కేబుళ్లను తొలగించేందుకు తీసుకున్నవే అయినా, ముందస్తు హెచ్చరిక లేకపోవడం వల్ల సర్వీస్ ప్రొవైడర్లు పునరుద్ధరణ చర్యలు తీసుకోలేకపోతున్నారు. దాంతో లక్షల మంది వినియోగదారులకు ఇబ్బంది ఏర్పడింది
కట్ చేసిన కేబుళ్లను రోడ్లపై గుట్టలుగా వదిలేయడం వల్ల వాహనదారులు వైర్లలో చిక్కుకుని ప్రమాదాల బారిన పడుతున్నారు…ఇది మరో కొత్త సమస్యగా తయారైంది. సర్వీస్ ప్రొవైడర్లు జనం ఒత్తిడిని తట్టుకోలేక కాల్ సెంటర్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు,
ప్రభుత్వం: జనానికి మేలు చేయాలా లేదా ఇబ్బంది పెట్టాలా?
ప్రభుత్వం అంటే ప్రజలకు మేలు చేయాలి, కానీ ఇక్కడ నిబంధనలను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు సృష్టిస్తోంది. విద్యుత్ శాఖ చర్యలు… వరదలు, విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాల నివారణకు అవసరమే అయినా, అమలు తీరు అనాలోచితమైనది. ముందస్తు అనుమతులు ఇచ్చి, తర్వాత ఫీజులు చెల్లించలేదని కట్ చేయడం సరైందేనా? ఇది ప్రజలను శిక్షించడమే కదా? ప్రభుత్వం సమన్వయంతో పనిచేసి, ముందస్తు హెచ్చరికలు ఇచ్చి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుండేది… ఇప్పుడు ఈ అనాలోచిత చర్యలు లక్షలాది మంది ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి – ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాలి, ఇబ్బందులు సృష్టించడం కాదు.
పరిష్కారం కోసం డిమాండ్
వినియోగదారులు సేవలు త్వరగా పునరుద్ధరించాలని, ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలి, కానీ ప్రజల ఇబ్బందులు పరిగణలోకి తీసుకోవాలి.
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/