హిందూ ధర్మంలో కలశాన్ని దైవ స్వరూపంగా ఆరాధిస్తారు. దీని వెనుక పౌరాణిక నేపథ్యం ఉంది. శ్రీమహావిష్ణువు నాభి నుంచి కమలం… అంటే పద్మం పుట్టింది. అందులో సృష్టి కారకుడైన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. ఆయన ఈ జనావళిని సృష్టించాడు. కలశంలోని నీరు…. సృష్టి ఆవిర్భవించటానికి కారణమైన జలానికి ప్రతీక. అది అందరికీ జీవశక్తి ప్రదాత. కలశం మీద ఉంచిన మామిడాకులు… నారికేళం ఈ సృష్టికి ప్రతీకలు. కలశం చుట్టూ కట్టిన దారం ఈ సృష్టి మొత్తాన్ని కలిపి ఉంచే ప్రేమకు సూచనగా చెబుతారు…. అందుకే కలశాన్ని శుభప్రదంగా భావించి, ఏ దైవ కార్యక్రమంలో అయినా… స్థాపన చేసి ఆరాధిస్తారు. ఆ కలశంలోకి సమస్త నదుల జలాల్నీ ఆహ్వానిస్తారు. సర్వ వేద విజ్ఞానాన్నీ, సకల దేవతల ఆశీస్సుల్నీ అందులోకి ఆవాహన చేస్తారు. అలా చేశాక కలశంలోని జలాన్ని అభిషేకంతో సహా అన్ని రకాల పూజాది కార్యక్రమాలకు వాడతారు.
దేవతలు, రాక్షసులు క్షీరసాగరాన్ని మథించినప్పుడు.. అందులోంచి ధన్వంతరి స్వామి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. ఆ కలశంలోని అమృతం జరా మరణ భయం లేకుండా చేస్తుంది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ భార్యలైన సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవితో కలశంలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లక్ష్మీదేవి పద్మంలో కొలువై ఉంటే… ఆమెకు చెరో వైపున రెండు ఏనుగులు తమ తొండాలతో కలశ జలాన్ని అభిషేకిస్తున్న దృశ్యం అనేక చిత్రాల్లో కనిపిస్తుంది.