పెళ్లికి ముందు ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దు! యువతకు Supreme Court క్లాస్

SupremeCourt

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ( Supreme Court ), మన సమాజాన్ని, ముఖ్యంగా యువతను ఉద్దేశించి ఒక తీవ్రమైన కామెంట్ చేసింది. ఇది కేవలం కోర్టు మాటగా కాదు, మన సంప్రదాయాలు వెళ్తున్న దారిపై ఒక ఆందోళనగా చూడాలి. “పెళ్లికి ముందు శారీరక సంబంధాల్లోకి ఎందుకు వెళ్తున్నారో మాకు అర్థం కావడం లేదు. బహుశా మావి పాతకాలపు ఆలోచనలేమో!” అంటూ జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. ఇంతకీ ఈ మాటల వెనుక ఉన్న ఆవేదన ఏంటి? సహజీవనం పేరుతో జరుగుతున్న మోసాల కథేంటి? ఆధునికతకు, సంప్రదాయానికి మధ్య మన పెళ్ళిళ్ళ వ్యవస్థ భవిష్యత్తు ఏమిటి? అన్నది చూద్దాం.

“పెళ్లికి ముందు ఎవర్నీ గుడ్డిగా నమ్మొద్దు, ఆచితూచి అడుగులేయాలి!” ఇది నేను చెబుతున్న మాట కాదు, సాక్షాత్తూ సుప్రీంకోర్టు యువతకు ఇచ్చిన హెచ్చరిక. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరై, ఆ తర్వాత కనిపించకుండా పోతున్న మోసాలు ఇప్పుడు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఈ ధోరణి మన సంప్రదాయాలను ఎలా దెబ్బతీస్తోందో, చట్టం దృష్టిలో ఇలాంటి బంధాలు ఎంత క్రిటికల్ ప్రాబ్లెమ్ గా మారుతున్నాయో ఈరోజు వివరంగా చూద్దాం. అసలు సుప్రీంకోర్టు ఇలా కామెంట్ చేయడానికి కారణమైన కేసు ఏంటి? మన సంప్రదాయాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి మోసాల బారిన పడకుండా యూత్ …. ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాలన్నీ మనందరికీ, మన కుటుంబాలకూ సంబంధించినవి. అందుకే, ఈ విశ్లేషణను చివరి వరకు తప్పక చదవండి.

అసలు ఏం జరిగింది? Supreme Court ఎందుకు రియాక్ట్ అయింది ?


సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణమైన ఆ కేసు వివరాలు వింటే, మోడర్న్ రిలేషన్స్ ఎంత డేంజర్ గా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. ఉన్నత చదువులు చదువుకున్న 30 ఏళ్ల మహిళ, 2022లో ఒక ప్రముఖ మ్యాట్రిమోనియల్ సైట్‌లో ఒక వ్యక్తిని కలిసింది. అతను దుబాయ్‌లో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, మంచి కుటుంబం అని తన ప్రొఫైల్‌లో గొప్పగా రాసుకున్నాడు. ఆన్‌లైన్‌లో మొదలైన వీళ్ళ మాటలు, వాట్సాప్ చాట్‌లు, వీడియో కాల్స్‌గా మారాయి. అతని మాట తీరు, భవిష్యత్తుపై అతను ఇచ్చిన భరోసా ఆమెను పూర్తిగా నమ్మేలా చేశాయి. “నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, త్వరలోనే మనం ఒకటి కాబోతున్నాం” లాంటి మాయమాటలతో ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు. “ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా” అనే నమ్మకంతో, వాళ్ళిద్దరూ ఢిల్లీలో శారీరకంగా దగ్గరయ్యారు. ఆ తర్వాత అతను ఆమెను దుబాయ్‌కు కూడా పిలిపించుకున్నాడు. అక్కడ కూడా వాళ్ళ సహజీవనం కొనసాగింది. కానీ, ఆమెకు తెలియకుండా వారి ఏకాంత క్షణాలను అతను వీడియో తీయడం మొదలుపెట్టాడు. ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరిగింది. కొన్నాళ్లకే అతని నిజ స్వరూపం బయటపడింది. డబ్బుల కోసం వేధించడం, చిన్న విషయాలకే గొడవపడటం, మానసికంగా హింసించడం చేశాడు. ఆమె ఎదిరించి మాట్లాడటంతో, ఆ సీక్రెట్ వీడియోలను బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

ఆమె జీవితం తలకిందులవుతున్న టైమ్ లోనే …. అతనికి సంబంధించిన ఒక షాకింగ్ నిజం బయటపడింది. అతనికి అప్పటికే పెళ్లయింది. ఆ నిజాన్ని దాచిపెట్టి, ఆమెను మోసం చేశాడు. ఇది చాలదన్నట్టు, 2024 జనవరిలో, పంజాబ్‌కు చెందిన మరో యువతిని రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. దీంతో, తాను దారుణంగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు, పెళ్లి పేరుతో నమ్మించి అత్యాచారం చేశాడని (IPC సెక్షన్ 376), మోసం చేశాడని (IPC సెక్షన్ 420) పోలీసులకు కంప్లయింట్ చేసింది.

Supreme Court on Live in Relationship
Live in Relationship

ఈ కేసులో అరెస్ట్ అయిన అతను, బెయిల్ కోసం మొదట సెషన్స్ కోర్టును, తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. రెండు చోట్లా అతని పిటిషన్ రిజెక్ట్ అయింది. “నిందితుడికి అప్పటికే పెళ్లైన విషయం దాచిపెట్టి, మళ్ళీ పెళ్లి చేసుకోవడం చూస్తుంటే, అతను పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీ మొదటి నుంచీ ఒక అబద్ధమని తేలింది” అని హైకోర్టు తేల్చి చెప్పింది. దాంతో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణలోనే, జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఆమెకు పెళ్లి మీద అంత క్లారిటీ ఉన్నప్పుడు, పెళ్లికి ముందే దుబాయ్‌కు వెళ్ళకుండా ఉండాల్సింది. మ్యారేజీకి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులే. బంధం ఎంత బలపడినా, పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి వెళ్లడం ఏంటో అర్థం కావట్లేదు.” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది కేవలం ఆ ఒక్కరిపై చేసిన కామెంట్ కాదు, సమాజంలో ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయన్న ఆందోళనతో చేసిన కామెంట్ అది..

భారతీయ సంప్రదాయాలు ఎటు పోతున్నాయి? ఈ మోడర్న్ కల్చర్ ఎంత డేంజర్ ?

సుప్రీంకోర్టు (Supreme Court) మాటలు మనల్ని సూటిగా ఒక ప్రశ్న దగ్గర నిలబెడతాయి: “మన సంప్రదాయాలు ఏమైపోతున్నాయి?” ఒకప్పుడు మన దగ్గర పెళ్లి అంటే రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాల బంధం. అబ్బాయి, అమ్మాయి గుణగణాలు, వారి కుటుంబం గురించి… సంస్కృతి… ఇలా అటు ఏడు తరాలు… ఇటు 7 తరాలు… అన్నీ చూశాకే పెళ్లికి ఒప్పుకునేవారు. ఈ ప్రక్రియలో, వ్యక్తుల మధ్య బంధం కంటే ముందు, వారి కుటుంబాల మధ్య నమ్మకం ఏర్పడేది. ఆ నమ్మకమే వారి దాంపత్యానికి గట్టి పునాదిగా ఉండేది.
కానీ, ఇప్పుడు కాలం మారింది. టెక్నాలజీ పెరిగాక సంబంధాల స్వరూపమే మారిపోయింది. మ్యాట్రిమోనియల్ సైట్లు, డేటింగ్ యాప్‌ల్లో పరిచయాలు పెంచుకుంటున్నారు. ఒకప్పుడు పెద్దలు చూసిన సంబంధాలు, ఇప్పుడు వ్యక్తిగత ఇష్టాయిష్టాలపై నడుస్తున్నాయి. నిజానికి, ఇందులో తప్పేమీ లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమే. కానీ, ఆ స్వేచ్ఛను సరిగ్గా వాడుకోకపోవడమే అసలు సమస్య. ఆన్‌లైన్‌లో కనిపించే ప్రొఫైల్ వెనుక ఉన్న అసలు మనిషి ఎవరో తెలుసుకోకుండా, మాటలు నమ్మేసి, జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. సుప్రీంకోర్టు అన్నట్టు, “మేము పాతకాలం వాళ్ళమే కావొచ్చు, కానీ పెళ్లికి ముందు గుడ్డిగా నమ్మకూడదు!” అనే మాటలో లోతైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పుడు సహజీవనం (Live-in Relationship) అనే పదం సర్వసాధారణమైపోయింది. చట్టం కూడా ఇలాంటి బంధాలను గుర్తించింది. అయితే, దీన్ని అడ్డం పెట్టుకుని, “పెళ్లి చేసుకుంటాను” అనే ఒకే ఒక్క హామీతో శారీరకంగా దగ్గరై, తర్వాత ముఖం చాటేసే మగాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఇది స్వేచ్ఛ కాదు, మోసం అని క్లియర్ గా అర్థమవుతోంది. ఇందులో ఎక్కువగా నష్టపోతోంది మహిళలే.

సంప్రదాయాలను గుడ్డిగా పాటించమని నేను చెప్పడం లేదు. కాలంతో పాటు మనం మారాలి. కానీ, మన సంప్రదాయాల్లోని మంచిని, జాగ్రత్తను వదిలేయకూడదు. ఒకరి గురించి పూర్తిగా తెలుసుకోకుండా, వారి ఆలోచనా విధానం అర్థం చేసుకోకుండా, కేవలం ఆకర్షణతో శారీరకంగా ఒకటైపోవడం ఎంత ప్రమాదమో…సుప్రీంకోర్టుకి వచ్చిన కేసే ఒక ఉదాహరణ. సంప్రదాయం బాధ్యత, ఓర్పును నేర్పుతుంది. ఆధునికత స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపికను నేర్పుతుంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్నప్పుడే ఆరోగ్యకరమైన బంధాలు సాధ్యమవుతాయి.

చట్టం ఏం చెబుతోంది? సహజీవనం, అత్యాచారానికి మధ్య గీత ఎక్కడ?

ఈ వివాదంలో చట్టపరమైన కోణం కూడా చాలా ముఖ్యమైంది. “పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా కలవడం” అత్యాచారం అవుతుందా? కాదా? అనేది చాలా సున్నితమైన ప్రశ్న. మన చట్టం (IPC సెక్షన్ 375) ప్రకారం, ఒక మహిళ అనుమతి లేకుండా లేదా భయపెట్టి లేదా మోసపూరిత హామీ ఇచ్చి పొందిన అనుమతితో శారీరక సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం అవుతుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆ హామీ మొదటి నుంచీ మోసపూరితమైనదే అని నిరూపించగలిగితే, అది రేప్ కేసుగా మారుతుంది. అయితే, సహజీవనం చేసి విడిపోయిన ప్రతి కేసునూ అత్యాచారంగా చూడలేమని కూడా సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. ఇద్దరు మేజర్లు, ఇష్టపూర్వకంగా కలిసి ఉండి, ఆ తర్వాత విడిపోతే దాన్ని క్రిమినల్ కేసుగా గుర్తించలేమని చెప్పింది. రిలేషన్ సాఫీగా ఉన్నంత కాలం సంతోషంగా ఉండి, గొడవలు రాగానే రేప్ కేసు పెట్టడం అనేది కూడా చట్టాన్ని మిస్ యూజ్ చేయడమే అవుతుందని కూడా వ్యాఖ్యానించింది.

ఈ తీర్పులు మనకు ఏం చెబుతున్నాయి? చట్టం చాలా సన్నని గీత మీద నడుస్తోందని అర్థమవుతోంది. బంధం మొదలైనప్పుడు ఇద్దరి ఉద్దేశాలు ఏంటి? పెళ్లి హామీ నిజమైనదా లేక మోసపూరితమైనదా? అనే అంశంపైనే కేసు నిలబడుతుంది. అందుకే, కేవలం చట్టం కాపాడుతుందని నమ్మడం కంటే, అసలు అలాంటి పరిస్థితుల్లో చిక్కుకోకుండా జాగ్రత్తపడటమే తెలివైన పని.

యువతకు Supreme Court హితవు – మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

మరి, ఈ మోసాల బారిన పడకుండా ఉండాలంటే యువత, ముఖ్యంగా మహిళలు ఏం చేయాలి? సుప్రీంకోర్టు కామెంట్స్ స్ఫూర్తిగా తీసుకుని, కొన్ని సూచనలను పాటిస్తే చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.

  • గుడ్డిగా నమ్మకండి: ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి చెప్పే ప్రతి మాటా నిజం కాకపోవచ్చు. వారి ప్రొఫైల్, ఉద్యోగం, కుటుంబ వివరాల గురించి వీలైనంతగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కామన్ ఫ్రెండ్స్ ద్వారా లేదా ఇతర మార్గాల్లో వారి నేపథ్యాన్ని క్రాస్-చెక్ చేసుకోండి.
  • హద్దులు ముఖ్యం: ప్రేమ, ఆకర్షణ సహజం. కానీ, పెళ్లికి ముందే శారీరక సంబంధాల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని కోర్టు పదే పదే చెబుతోంది. భావోద్వేగాల ప్రవాహంలో కొట్టుకుపోకుండా, వాస్తవంలో నిలబడండి. అలాంటి బంధాలు భవిష్యత్తులో బ్లాక్‌మెయిలింగ్‌కు, మానసిక వేదనకు దారితీయవచ్చని గుర్తుంచుకోండి.
  • కుటుంబ సభ్యులను కలపండి: మీరు ఇష్టపడిన వ్యక్తి గురించి మీ ఇంట్లోవాళ్లకు, నమ్మకమైన ఫ్రెండ్స్ కి చెప్పండి. ప్రేమలో ఉన్నప్పుడు మనకు అన్నీ అందంగానే కనిపిస్తాయి, కానీ బయటి వ్యక్తులుగా మీ శ్రేయోభిలాషులు కొన్ని విషయాలను మీ కంటే క్లియర్ గా గమనించగలరు. వాళ్ళ సజెషన్స్ మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడవచ్చు.
  • ఆర్థిక లావాదేవీలొద్దు: పెళ్లికి ముందే డబ్బులు అడగటం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడం లాంటి డేంజర్ బెల్స్ గా గుర్తించాలి. ప్రేమ ముసుగులో ఆర్థికంగా వాడుకునే వారు చాలామంది ఉంటారు. పెళ్లి అయ్యే వరకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడమే మంచిది.
  • ప్రొఫెషనల్ సహాయం తీసుకోండి: అవసరమైతే, పెళ్లికి ముందు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రీ-మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవడం చాలా బెటర్. ఇది భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ విలువలపై ఇద్దరికీ స్పష్టతనిస్తుంది. భవిష్యత్తులో వచ్చే ఎన్నో గొడవలను ఇది ముందే నివారించగలదు.
  • ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? మారుతున్న కాలంలో మన సంప్రదాయాలను కాపాడుకోవడం సాధ్యమేనా? ఆధునిక బంధాలలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లపై మీ ఆలోచనలను కింద కామెంట్స్‌లో తప్పకుండా పంచుకోండి. చివరగా ఒక్కమాట. సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్, యువతను కించపరచడానికో, వారి స్వేచ్ఛను ప్రశ్నించడానికో చేసినవిగానో భావించకూడదు. సమాజ శ్రేయస్సు కోరి, ఒక పెద్ద దిక్కుగా చెప్పిన సజెషన్ గా తీసుకోవాలి. టెక్నాలజీ మనకు ప్రపంచాన్ని దగ్గర చేసింది, కానీ అదే సమయంలో కొత్త రకాల చీటింగ్స్ కి కారణమవుతోంది. మోడర్న్ గా ఉండటం తప్పు కాదు, కానీ ఆ మోడర్న్ ముసుగులో మన విలువలను, మనల్ని మనం కోల్పోకూడదు. ఛాయిస్ అనేది మీ చేతుల్లోనే ఉంది. ఆచితూచి అడుగు వేయండి, గుడ్డి నమ్మకంతో జీవితాన్ని పణంగా పెట్టకండి. సంప్రదాయం అనేది సంకెళ్లు కాదు, అది మనల్ని కాపాడే కవచం అని గ్రహించిన నాడు, ఇలాంటి మోసాలకు ఆస్కారమే ఉండదు.

author avatar
Vishnu Kumar
Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms.
Vishnu Kumar  के बारे में
Vishnu Kumar Vishnu Kumar Medukonduru is a Senior journalist with over 26 years of experience across print, electronic, and digital media. Known for his sharp editorial instincts and deep understanding of public discourse, Vishnu has contributed to leading newsrooms in diverse roles—from field reporting and desk editing to content strategy and multimedia storytelling. His expertise spans a wide spectrum of topics including national affairs, international developments, health, finance, and educational content. Whether crafting breaking news or in-depth analysis, Vishnu brings clarity, credibility, and context to every piece he writes. A trusted voice in Indian journalism, he continues to shape narratives that inform, empower, and inspire readers across platforms. Read More
For Feedback - telanganaexams@gmail.com