ప్రముఖ సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ తాజాగా రాసిన ఓ సినిమా పాట సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రానికి సంబంధించిన ఈ పాటలోని సాహిత్యంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సనాతన ధర్మం, తెలుగు భాష, సంప్రదాయాల గురించి వేదికలపై మాట్లాడే అనంత శ్రీరామ్.. సినిమాల్లో మాత్రం అసభ్యకరమైన, వెకిలి భావజాలాన్ని ప్రోత్సహించే పదాలు వాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా కొన్ని పాటల విషయంలో ఆయనపై ఇలాంటి విమర్శలు వచ్చాయని గుర్తుచేస్తున్న నెటిజన్లు.. తాజాగా విడుదలైన ఈ పాటతో మరోసారి వివాదంలోకి వచ్చారని అంటున్నారు. ఈ పాటను రాయడానికి దాదాపు 50 రోజుల పాటు కష్టపడ్డానని అనంత శ్రీరామ్ చెప్పిన నేపథ్యంలో, “ఇంత సమయం తీసుకుని రాసింది ఇదేనా?” అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
పాటలోని కొన్ని లైన్లు కుటుంబ వ్యవస్థను, భార్యాభర్తల బంధాన్ని తక్కువ చేసి చూపించేలా ఉన్నాయని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇంటి జీవితం కంటే బయట జీవితం ఆకర్షణీయమనే భావన కలిగించేలా సాహిత్యం ఉందని, ఇది సమాజానికి సరైన సందేశం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అలాగే పాటలో ఉపయోగించిన భాష, మాండలికం కూడా ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది ఏ ప్రాంతీయ భాషో అర్థం కావడం లేదని, కృత్రిమంగా సృష్టించిన పదజాలంలా అనిపిస్తోందని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
ఈ పాటను దర్శకుడు, నిర్మాత ఎలా ఆమోదించారన్న ప్రశ్న కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమా సెన్సార్ వ్యవస్థపై కూడా కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సమాజంపై ప్రభావం చూపే పాటల విషయంలో మరింత బాధ్యత అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు, కొన్ని హిందుత్వ భావజాల గ్రూపులు కూడా అనంత శ్రీరామ్ వైఖరిపై విమర్శలు చేస్తున్నాయి. ఒకవైపు సంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడుతూనే.. మరోవైపు సినిమాల్లో భిన్నమైన సందేశాలు ఇవ్వడం సరైంది కాదని పేర్కొంటున్నాయి. అయితే ఈ వివాదంపై అనంత శ్రీరామ్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ చర్చ మరింత వేడెక్కుతోంది.