ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాలో ఒకప్పుడు రెచ్చిపోయి… బూతులతో పోస్టులు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నారు. కన్నూ మిన్నూ గానలేదు అన్నట్టుగా… టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వాళ్ళ భార్యలు, పిల్లల్ని కూడా వదల్లేదు… నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం… చేతికి ఏది తోస్తే అది సోషల్ మీడియాలో (Social media ) రాసేయడమే. జుగుప్సాకరంగా… చెత్త రాతలు రాసిన వాళ్ళు ఏదో పొడిచారని వైసీపీ అధినేత జగన్ (YCP Jagan) వీరతాళ్ళు వేయకపోయినా… స్వామి భక్తిని చాటుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అడ్డంగా దొరికిపోయారు. అటు జగనన్న కూడా ముఖం చాటేశాడని అంటున్నారు.
ఏపీలో సోషల్ మీడియా పోస్టులపై కేసుల కలకలం నడుస్తోంది. వైసీపీకి చెందిన చోటా మోటా కార్యకర్తల నుంచి లీడర్లు, నటి శ్రీరెడ్డి, డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, నటుడు పోసాని కృష్ణ మురళి (Sri Reddy, RGV, Posani) లాంటి వాళ్ళపై ప్రతీ రోజూ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదవుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులు, ప్రస్తుత హోంమంత్రి అనిత, షర్మిల, వైఎస్ సునీతా రెడ్డిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వైసీపీ లీడర్ వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media) విభాగం కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డిపైనా కేసు ఫైల్ అయింది.
కాళ్ళా వేళ్ళా పడుతున్న నటి శ్రీరెడ్డి (Cases booked on Sri Reddy)
నటి శ్రీరెడ్డి (Sri Reddy) అయితే చెన్నైలో ఉంటూ రోజూ బండబూతులు తిడుతూ ఏదో ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసేది. లీడర్లే కాదు… పత్రికలు, ఛానెళ్ళ అధిపతులను కూడా వదల్లేదు. వైసీపీ హయాంలో హద్దూ అదుపూ లేకుండా వ్యవహరించింది. అప్పట్లో ఈ నీచమైన పోస్టులపై టీడీపీ, జనసేన నేతలు కేసులు పెట్టినా పోలీసులూ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోషల్ మీడియా సైకోలపై సీరియస్ గా ఉండటంతో జైలుకెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందుకే నటి శ్రీరెడ్డి ఇప్పుడు కాళ్ళా వేళ్ళా పడుతోంది. వారం రోజులుగా అందర్నీ పేరు పేరునా క్షమాపణలు కోరుతూ వీడియోలు పెడుతోంది. అప్పట్లో బండ బూతులు తిట్టిన లోకేష్ ను… అన్నా… నన్ను క్షమించు అంటూ ప్రాధేయ పడుతోంది. నన్నూ, నా కుటుంబాన్ని ఈ కేసుల బారి నుంచి రక్షించండి అంటూ వేడుకుంటోంది. కానీ శ్రీరెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. హోంమంత్రి అనిత మీద పెట్టిన పోస్టులపైనే ఈ కేసులు నమోదయ్యాయి. ఆమె నెక్ట్స్ వీక్ లో జైలుకు వెళ్ళక తప్పేలా లేదు.
రాంగోపాల్ వర్మకీ నోటీసులు (Notices to RGV)
వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశపడ్డ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు కూడా షాక్ తగులుతోంది. టీడీపీని దిగజారుస్తూ రెండు, మూడు సినిమాలు తీసిన RGV… సోషల్ మీడియాలోనూ రెచ్చిపోయారు. ఎన్నికల ముందు రిలీజ్ అయిన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం చంద్రబాబు, లోకేశ్, పవన్ వ్యక్తిత్వాలను కించపరుస్తూ X లో పోస్టులు పెట్టినందుకు RGVపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కి వచ్చిన RGV ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
పోసాని తక్కువోడు కాదు (Cases on Posani )
వైసీపీ హయాంలో FDC ఛైర్మన్ గా పనిచేసిన నటుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) మీద కేసులు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా ఇంకా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే ఏపీలో పోసాని మీద 22 చోట్ల పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 5 కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. పోసానికి కూడా నోటీసులు జారీ చేసేందుకు ఏపీ పోలీసులు సిద్ధమవుతున్నారు.
680 మందికి నోటీసులు ?
అసభ్యకరంగా పోస్టులు పెట్టిన 680 వైసీపీ నేతలకు(YCP Leaders) నోటీసులు వెళ్ళాయి. 147 మంది మీద కేసులు నమోదు చేశారు ఏపీ పోలీసులు. మరో 50 మందిని అరెస్ట్ కూడా చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే కోర్టుకెళ్ళి రిలీఫ్ పొందాలని అనుకున్న వైసీపీకి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. అసభ్యకర పోస్టులు పెట్టినవాళ్ళపై కేసులు పెడితే తప్పేంటి…. మేం పోలీసుల చర్యలను అడ్డుకోలేమని ఏపీ హైకోర్టు చెప్పేసింది. పైగా జడ్జీలను కూడా వదల్లేదుగా అంటూ న్యాయమూర్తులు కామెంట్ చేశారు.
జగన్ హయాంలో టీడీపీ నేతలపైనా కేసులు
సోషల్ మీడియాలో కేసుల విషయంలో వైసీపీ కూడా తక్కువేమీ తినలేదు. అప్పట్లో టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులపైనా కేసులు పెట్టింది జగన్ ప్రభుత్వం. 2020లో విశాఖలో LG పాలిమర్స్ అగ్నిప్రమాదం విషయంలో ప్రభుత్వ స్పందన తప్పుబడుతూ ఫేస్ బుక్ లో వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసినందుకు టీడీపీ సానుభూతిపరురాలు రంగనాయకమ్మపై కేసు పెట్టారు. కరోనా టైమ్ లో, జగన్ ఫోటో మార్ఫింగ్ చేశారనీ… ఇలా టీడీపీ నేతలపైనా అప్పట్లో కేసులు నమోదయ్యాయి.
మితి మీరిన విష సంస్కృతి
ఏపీలో సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల విష సంస్కృతి మితి మీరిపోతోంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే… ఆ పార్టీ తరపున వకల్తా పుచ్చుకొని అసభ్య పోస్టులు పెట్టడం కామన్ గా మారింది పేటీఎం బ్యాచ్ (Paytm Batch)కి. రాజకీయ నేతలను టార్గెట్ చేయడానికి బదులు వాళ్ళ భార్యలు, పిల్లలను కామెంట్ చేయడం ద్వారా లీడర్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని తప్పుడు ఆలోచనలో వెళ్తున్నారు. నిజంగా ఇలాంటి విష సంస్కృతిని ఏపీ నుంచి వెళ్ళగొట్టాల్సిందే. నీచంగా పోస్టులు పెట్టేవాళ్ళు ఏ పార్టీ అయినా… జనం తరిమి తరిమి కొట్టాలి. అలాంటి వాళ్ళకి రాజకీయాల్లో, ప్రజా జీవితంలో స్థానం లేకుండా చేయాలని మేథావులు కోరుతున్నారు.