బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్యతో 498A కేసు ఎంత దారుణంగా దుర్వినియోగం అవుతుందో మరోసారి బయటపడింది. ఈ సెక్షన్ ఓ రకంగా మహిళల రక్షణకు, భవిష్యత్తు భరోసాకు మంచిదే . అయినా.. కొందరు మహిళలకు ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేయడంతో… చాలా మంది కాపురాల్లో చిచ్చు పెట్టింది. భర్త, అత్తమామలు, ఆడబిడ్డలు… ఆ ఇంట్లో పాలు తాగే పసిపిల్లల దాకా కేసులు పెట్టి జైలుకీడ్చిన సందర్భాలు అనేకం. ఇప్పుడు అతుల్ ఆత్మహత్యతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా స్పందించింది.
అతుల్ దుస్థితి మరొకరికి రావొద్దు !
బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్ తన భార్య, అత్త మామలు, బావ మరుదల వేధింపులు తట్టుకోలేక 24 పేజీల సూసైడ్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశవ్యాప్తంగా అందర్నీ కన్నీళ్ళు పెట్టిస్తోంది. 498A కేసును అతుల్ భార్య నిఖిత సింఘానియా ఎంత దారుణంగా దుర్వినియోగం చేసిందో ఆ లెటర్ ద్వారా అర్థమవుతోంది. అతుల్ రాసిన 24 పేజీల సూసైడ్ నోట్… ఆత్మహత్యకు ముందు తీసుకున్న గంటన్నర సెల్ఫీ వీడియో చూస్తే… అతుల్ ఎంత నరకయాతన అనుభవించాడో తెలుస్తోంది.
కొడుకుని కలవాలంటే 30లక్షలు
అతుల్ సుభాష్ పై భార్య నిఖిత అతనితో విడిపోయిన 8 నెలల తర్వాత 498A కేసు పెట్టింది. 3 కోట్ల రూపాయలు భరణం కావాలని కోరింది. తన కన్న కొడుకుని కలవడానికి రూ.30 లక్షలు డిమాండ్ చేసింది. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటున్న అతుల్ పై ఉత్తరప్రదేశ్ లో రకరకాల కేసులు పెట్టారు అత్తింటి కుటుంబ సభ్యులు. అతుల్ బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు 40 సార్లు ప్రయాణించాల్సి వచ్చింది. విడాకుల కేసుతో పాటు పూటకో కేసు పెట్టారు. ఇంకా దారుణం ఏంటంటే … ఆమె తండ్రి జబ్బు పడి చనిపోతే… అందుకు కారణం అతుల్ అని కేసు పెట్టింది. సెటిల్ మెంట్ కోసం కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు అతుల్ సూసైడ్ నోట్ లో తెలిపాడు.
చట్టాలు మహిళలకు చుట్టాలా ?
హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించకుండా తన కొడుకుపై కేసు మీద కేసులు పెడుతూ పోలీసులు కూడా నరకం చూపించారని అతుల్ తల్లి తీవ్ర ఆవేదన చెందింది. దేశంలో చట్టాలన్నీ మహిళలకు అనుకూలంగా ఉన్నాయి. వాటిపై అతుల్ పోరాడి ఓడిపోయాడు… డబ్బులిస్తే అనుకూలంగా తీర్పిస్తామని చెప్పిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ జడ్జిపైనా తాము న్యాయపోరాటం చేస్తామని సోదరుడు వికాస్ తెలిపాడు.
సుప్రీంని కదిలించిన అతుల్ కేసు
బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు సుప్రీంకోర్టును కూడా కదిలించింది. సూసైడ్ నోట్ రాసిన అంశాలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఆశ్చర్యపోయారు. కొందరు మహిళలు చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో అంటూ తెలంగాణకు చెందిన ఓ కేసులో వ్యాఖ్యానించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 498A చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు మహిళలు భర్త, అతని కుటుంబాన్ని వేధించేందుకు ఈ కేసు వాడుకుంటున్నారని తెలిపింది. వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోడానికి మహిళలు 498Aను వాడుకోవడం ఓ ట్రెండ్ లా మారిందని కోర్టు పేర్కొంది. రేణుకాచౌదరి లాంటి మహిళా ఎంపీలు కూడా ఈ చట్టం దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు.
కుక్కకీ భరణం ఇవ్వాల్సిందే !
498A కేసుల విషయంలో కోర్టుల తీర్పులు కూడా కొన్ని సందర్భాల్లో వివాదంగా మారుతున్నాయి. ముంబైలో ఓ వ్యాపారవేత్త తన భార్యతో విడిపోయాడు. ఈ కేసులో ఆమెకు నెలకు 50 వేల రూపాయలు భరణం ఇవ్వాలని బాంబే మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. అంతవరకూ ఓకే… కానీ ఆమె పెంచుకునే కుక్కకు కూడా 70 వేలు భరణం ఇవ్వాలని తీర్పు చెప్పడం 2023 జులైలో వివాదస్పదమైంది.
భరణంపై సుప్రీంకోర్టు గైడ్ లైన్స్
1. భర్త, భార్య కుటుంబాల సామాజిక, ఆర్థిక స్థితిగతులు
2. విడాకులు కోరుతున్న భార్య, భర్త విద్యార్హత, ఉద్యోగం పరిస్థితులు
3. భార్య, ఆమెపై ఆధారపడిన పిల్లల అవసరాలు
4. విడాకులు కోరిన భార్యాభర్తల వ్యక్తిగత ఆదాయం, వ్యక్తిగత ఆస్తులు
5. అత్తింట్లో భార్య గడిపిన జీవితం తాలూకూ స్థితిగతులు
6. కుటుంబ సంరక్షణ కోసం భార్య ఉద్యోగాన్ని వదిలేసిందా..?
7. ఉద్యోగం చేసే స్థితిలో లేని భార్యకు విడాకుల సమయంలో న్యాయ పోరాటానికి తగిన మొత్తాన్ని భరించడం
8. భర్త ఆర్థిక పరిస్థితి, అతని ఆదాయం, అప్పులు, మెయింటెనెన్స్ బాధ్యతలు
అతుల్ ఆత్మహత్యకు కారణమైన అతని భార్య, ఆమె బంధువులపై కేసులు పెట్టారు పోలీసులు. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నాననీ… తనకు న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి కూడా అతుల్ లెటర్ రాశాడు. సోషల్ మీడియాలో అతుల్ సూసైడ్ నోట్, వీడియో వైరల్ కావడంతో అతనికి నెటిజన్లు భారీగా మద్దతిస్తున్నారు.