Boeing 737 max incident : అమెరికాలో డెన్వర్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 MAX 8 విమానం గగనంలో ప్రయాణిస్తున్న సమయంలో అతి ఎత్తులో దాని ముందు గాజు (విండ్ షీల్డ్) పగిలిపోయింది. ఈ ఘటనలో పైలట్ గాయపడ్డాడు. వెంటనే విమానం అత్యవసరంగా సాల్ట్ లేక్ సిటీ ఎయిర్‌పోర్ట్‌కి దిగి, ప్రయాణికులను మరో విమానంలో పంపించారు.
ఈ విమానంలో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. విమానం 36,000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. పైలట్లు వెంటనే 26,000 అడుగులకు దిగిపోయి, అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులు తర్వాత బోయింగ్ 737 MAX 9 విమానంలో లాస్ ఏంజెల్స్‌కి చేరుకున్నారు. అయితే, ఆ ప్రయాణం 6 గంటల ఆలస్యంగా జరిగింది.
Window ఎందుకు పగిలింది?
విమానాల్లో విండ్ షీల్డ్ పగిలే ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఈ ఘటనలో గాజు పగిలిన విధానం, పైలట్ గాయపడటం వింతగా ఉంది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో గాజుపై కాలిన మచ్చలు కనిపించాయి. పైలట్ చేతికి గాయమైంది. ఇది సాధారణంగా జరిగే గాజు పగుళ్లలా కాకుండా, బయటి నుంచి ఏదో వస్తువు తాకినట్లు అనిపిస్తోంది.
విమానం సాల్ట్ లేక్ సిటీకి దక్షిణంగా 322 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ సమస్య కనిపించింది. పైలట్లు వెంటనే నిర్ణయం తీసుకుని, విమానాన్ని దిగించారు.
ఎయిర్‌లైన్ అధికారులు గాజు పగిలిన కారణం ఇంకా వెల్లడించలేదు. కానీ ఏవియేషన్ నిపుణులు “Space Debris” లేదా చిన్న గ్రహశకలం తాకి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే గాజుపై ఉన్న మచ్చలు, పగుళ్లు చాలా అసాధారణంగా ఉన్నాయి.

పైలట్ కి గాయాలు, ప్రయాణికుల భద్రత
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకారం, ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. పైలట్‌కు చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి. సిబ్బంది అత్యవసర పరిస్థితిని చాలా చాకచక్యంగా నిర్వహించారు. ప్రయాణికులు కూడా సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.
మరో ఘటన: చికాగో ఎయిర్‌పోర్ట్‌లో 2 విమానాలు ఢీ
యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మరో విమానం చికాగో ఓ’హేర్ ఎయిర్‌పోర్ట్‌లో గేట్‌కి వెళ్తున్న సమయంలో, అక్కడ నిలిపి ఉన్న మరో యునైటెడ్ విమానాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. 113 మంది ప్రయాణికులు ఆలస్యంగా విమానం నుంచి దిగారు.
ఈ రెండు ఘటనలు విమాన భద్రతపై కొత్తగా చర్చలు మొదలయ్యేలా చేశాయి. ముఖ్యంగా బోయింగ్ 737 MAX 8 వంటి మోడల్స్‌పై మరింత జాగ్రత్త అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.