* కుటుంబ కలహాలు, అవినీతి ఆరోపణలు
* మసకబారుతున్న గులాబీ పార్టీ ప్రతిష్ట
రాష్ట్రంలో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పతనం మొదలైందా? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఆరోపణలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావును లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోవడంతో కేసీఆర్ తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన కేసీఆర్‌ను టీఆర్ఎస్ శ్రేణులు జాతిపితగా పిలుచుకున్నాయి. తెలంగాణను అభివృద్ధి చేస్తానని, కాపలా కుక్కగా ఉంటానని ఆయన హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు కవిత ఒక్కో అవినీతి చిట్టాను విప్పుతుండటంతో, పరోక్షంగా అవన్నీ కేసీఆర్ మీదకు వెళ్తున్నాయి. వీళ్లంతా అవినీతి చేస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారన్న కాంగ్రెస్ లీడర్లు విమర్శిస్తున్నారు. అసలు తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ తర్వాత ఆ పేరు లేకుండా బీఆర్ఎస్‌గా మారిపోయింది. ఇప్పుడు ఒక్కో అవినీతి బయటపడుతుండటంతో పార్టీ ఇమేజ్‌తో పాటు కేసీఆర్ ఇమేజ్ కూడా డ్యామేజీ అవుతోంది.
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీ, ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో బలంగా ఉద్భవించి, దాదాపు ఒక దశాబ్దంపాటు అధికారంలో కొనసాగిన ఈ పార్టీ, ఇప్పుడు ఓటమి, నాయకుల బయటకు వెళ్లడం, కీలక నాయకుల దూరం వంటి సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. వీటికితోడు కుటుంబ కలహాలు, క్యాడర్‌లో అనుమానాలు, ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
ఉద్యమం నుంచి అధికారం వరకు…
టీఆర్‌ఎస్ 2001లో కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ఏర్పడింది. తెలంగాణ ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన ఈ పార్టీ, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ వ్యూహాత్మక నాయకత్వం, హరీశ్‌రావు, కేటీఆర్, కవిత వంటి కుటుంబ సభ్యుల బలమైన మద్దతు, రాష్ట్ర ప్రజల ఆదరణతో బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా బలమైన శక్తిగా మార్చాయి. 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలతో పార్టీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. ఈ విజయాల వెనుక కొన్ని సమస్యలు మొదలయ్యాయి. అధికారంలో ఉండగా, బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరగడం, ఆరోపణలు, కొన్ని విధానాలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజల అసంతృప్తి, ప్రతిపక్షాల బలోపేతం క్రమంగా బీఆర్‌ఎస్ బలాన్ని సన్నగిల్లేలా చేశాయి.
పేరు మార్పుతోనే టీఆర్ఎస్ కు ఇబ్బందులు
2022లో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి… మోడీని ఢీకొట్టాలి అనే ఆకాంక్షతో టీఆర్‌ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చారు. ఈ నిర్ణయం పార్టీ దృష్టిని తెలంగాణ రాజకీయాల నుంచి జాతీయ స్థాయికి మళ్లించింది. కానీ తెలంగాణ కోసం ఏర్పడిన పార్టీ, అది వదిలేసి జాతీయ దృష్టికి వెళ్ళడంపై విమర్శలు వచ్చాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఊహించని ఓటమి ఎదురైంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో గులాబీ పార్టీ రాజకీయ ఆధిపత్యం క్షీణించడం మొదలైంది.
పార్టీకి లీడర్లు గుడ్ బై.. కవిత ఆరోపణలు
2023 ఎన్నికల ఓటమి తర్వాత, బీఆర్‌ఎస్‌లో అస్థిరత మరింత పెరిగింది. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఇది పార్టీ బలాన్ని బాగా దెబ్బతీసింది. లేటెస్ట్ గా కేసీఆర్ కూతురు కవిత ఆధితప్యం కోసం పార్టీ విధానాలను తప్పు పట్టారు. చివరకు హరీశ్‌రావు, సంతోష్‌రావు టార్గెట్‌గా చేసిన ఆరోపణలు పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు వెళ్లాయి. కవిత, ఒకప్పుడు పార్టీలో ముఖ్యమైన నాయకురాలిగా ఉండేది. ఇప్పుడు ఆమె దూరం కావడం, ఒకవైపు కుటుంబంలోని అంతర్గత సమస్యలను సూచిస్తుండగా, మరోవైపు పార్టీలో నాయకత్వ సంక్షోభాన్ని స్పష్టం చేస్తోంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ భవిష్యత్తుపై ఆందోళనలను పెంచాయి. దీంతో క్యాడర్‌లో కూడా కలవరం మొదలైంది. లేటెస్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ ఆదేశాలు రావడంతో పార్టీలో మరిన్ని చీలికలు ఏర్పడుతున్నాయి. కవిత ఆరోపణలు హరీశ్ రావు, సంతోష్ రావును బజారుకు ఈడ్చాయి, ఇది పార్టీ ఐక్యతను మరింత దెబ్బతీస్తోంది. కవిత ఆరోపణల ఆధారంగా కాళేశ్వరంలో అవినీతి భారీగానే జరిగిందనే సంకేతాలు జనంలోకి వెళ్ళాయి.
Read also : బిగ్‌బాస్ 9 తెలుగు: డబుల్ హౌస్, డబుల్ డోస్‌తో మళ్లీ వచ్చేసింది!
Read also : సీబీఐకి ఇస్తే.. ఏమైతది?: బీఆర్ ఎస్ లో చర్చ



