* పార్టీకి పునర్ వైభవం కోసం ప్రయత్నాలు
* రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి దాకా బలోపేతం
* నియోజకవర్గాల వారీగా సమీక్షలు
* స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలే టార్గెట్‌గా పెట్టుకుని బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న దిశగా కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. ఆమె పార్టీని ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో జనంలోకి తీసుకెళ్ళాలని పార్టీ లీడర్లకు చెబుతున్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు లేదా ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కోవాలని ఆమె సూచిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్ అనుసరిస్తున్న తీరును మీనాక్షి ఉదాహరణగా చెబుతున్నారు.
గత కొన్ని రోజులుగా మీనాక్షీ నటరాజన్ నియోజకవర్గాల నాయకులతో మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పాలనీ, ప్రతి విషయం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలదే అంటున్నారు. ప్రతి బూత్ స్థాయిలో కమిటీలను రూపొందించి, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బలమైన నాయకత్వాన్ని తీసుకురావాలన్నది ఆమె ప్లాన్ గా కనిపిస్తోంది. పార్టీలో ఉన్న ప్రతి వర్గాన్ని కలుపుకుపోతూ అంతా కలిపి పనిచేయాలని మీనాక్షి స్పష్టంగా చెప్పారు.
రెండు దశల్లో పార్టీ పునర్నిర్మాణం..
తెలంగాణ తెచ్చింది తామే అని చెప్పుకునే కాంగ్రెస్ ను గత పదేళ్ళుగా జనం ఆదరించలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ ఐదేళ్ళలో పార్టీని పున:నిర్మించుకోవాలన్నది కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే ముందుగా నియోజకవర్గ స్థాయి నాయకులతో చర్చలు జరపుతున్నారు. కొత్త బూత్ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టారు. రెండో దశలో మండల, జిల్లా స్థాయిలో సమీక్షలు, యువతలో చైతన్యం, మహిళలు ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై దృష్టిపెట్టబోతున్నారు.
గ్రూపులు ఉండొద్దు
కాంగ్రెస్ అంటేనే గ్రూపుల రాజకీయం. మాట్లాడే స్వాతంత్ర్యం కూడా ఎక్కువే. అందుకే ఆ సంస్కృతిని దూరం పెట్టాలని మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. అటు పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఇదే కంప్లయింట్స్ ఎక్కువగా వస్తున్నాయి. వివిధ గ్రూపుల మధ్య సమన్వయం పెరగాలంటున్నారు కాంగ్రెస్ నాయకులు. మండలాల వారీగా నాయకుల అభిప్రాయాలను తీసుకుంటూ పార్టీ పునర్నిర్మాణ దిశగా చర్యలు చేపట్టాలని మీనాక్షిని కలుసుకున్న నేతలు చెబుతున్నారు. పార్టీకి వ్యూహాత్మకమైన మార్గదర్శనం కావాలనీ, రాష్ట్ర స్థాయిలో కమ్యూనికేషన్ వ్యవస్థ బలోపేతం చేయాలని కూడా చర్చలు జరిగాయి.
ప్రజల్లోకి కార్యక్రమాలు తీసుకెళ్లండి
పార్టీకి ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతుల వారీగా మద్దతు వచ్చేలా చూడాలని మీనాక్షికి కొందరు కార్యకర్తలు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు అర్హులకు దక్కేలా స్థానిక కాంగ్రెస్ నేతలు పనిచేయాలని మీనాక్షి స్పష్టంగా చెబుతున్నారు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనా కాలంలో అస్తవ్యస్థమైన కాంగ్రెస్ ను గాడిలో పెట్టాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి ఉన్న వైభవాన్ని తిరిగి తీసుకురావాలని ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉన్న కాంగ్రెస్ లో, గాంధేయవాది అయిన మీనాక్షి నటరాజన్ ప్రయత్నాలు ఎంతవరకూ సక్సెస్ అవుతాయన్నది చూడాలి. ముందు రాష్ట్రస్థాయిలో సీఎం, మంత్రుల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాలన్న అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. అది సెట్ చేస్తే, ఆ తరువాత జిల్లా, గ్రామస్థాయిలో గ్రూపులు లేకుండా చూడవచ్చని అంటున్నారు. మరి మంత్రుల్లో విభేదాలకు మీనాక్షి ఎంత వరకు ఫుల్ స్టాప్ పెడతారన్నది డౌటే.