* పాఠాలకు ఫుల్ స్టాప్ పెట్టిన కార్పొరేట్ స్కూళ్లు
* చదివేది సిటీలో… పరీక్ష రాసేది సత్తుపల్లిలో
* విద్యా వ్యవస్థ పరువు తీస్తున్న కాలేజీలు
* ర్యాంకుల కోసం పీల్చిపిప్పి చేస్తున్న కార్పొరేట్లు
కార్పొరేట్ స్కూల్ అని చెప్పుకునే కొన్ని యాజమాన్యాలు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో గత కొన్ని నెలలుగా టీచర్లను కొత్త అడ్మిషన్ల కోసం రోడ్ల వెంట తిప్పుతూ మాయమాటలతో విద్యార్థులను బుట్టలో వేసుకుంటున్నాయి. కొందరు తల్లి దండ్రులు కూడా వాళ్ళ మాయలో పడుతున్నారు. ఆ కార్పొరేట్ స్కూళ్ళల్లో పనిచేసే టీచర్లకు, ఏడాదికి ఇంతమంది విద్యార్థులను అడ్మిట్ చేయించాలని టార్గెట్స్ పెడుతున్నారు. అడ్మిషన్లు తెస్తేనే వాళ్లకి ఉద్యోగం అనే కండిషన్ పెట్టి కనీసం పండుగ రోజు అని కూడా చూడకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆ టీచర్లు ఆవేదన చెందుతున్నారు. కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాల ఒత్తిడి భరించలేక కొందరు రిజైన్ చేసి బయటకు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో క్లాసులు చెబుతామని ఢంకా బజాయిస్తున్న కార్పొరేట్ స్కూళ్ళు, టీచర్లను పాఠాలు చెప్పడం ఆపించి, పిల్లల్ని క్లాసులో వదిలేసి అడ్మిషన్ల కోసం రోడ్ల వెంబడి తిప్పాల్సిన అవసరమేంటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
టెస్టుల పేరుతో విద్యార్థులకు అవమానం
అడ్మిషన్ల కోసం ఇళ్లకు వస్తున్న కార్పొరేట్ స్కూల్స్ యాజమానులు… టెస్ట్ లో ర్యాంకు వస్తే ఫీజు తగ్గిస్తామని మాయమాటలు చెప్పి వారిని స్కూల్ కి తీసుకెళ్తున్నారు. అడ్మిషన్ టెస్ట్ పేరుతో ఆపై తరగతిలో ప్రశ్నలు ఇచ్చి మార్కులు తక్కువగా చూపించి, ఆ విద్యార్థికి ఇప్పటి వరకు చదువుతున్న స్కూల్లో ఏమీ చెప్పట్లేదు. అని వారి తల్లిదండ్రుల ముందు స్టూడెంట్స్ ని బదనాం చేస్తున్నాయి కొన్ని కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలు. సత్తుపల్లిలో కనీసం ప్రభుత్వ గుర్తింపు కూడా లేని ఒక కార్పొరేట్ స్కూల్, ఐదో తరగతి విద్యార్థులకు సెవెన్త్ ప్రశ్నలు ఇచ్చి బదనాం చేశారని ఆ పరీక్ష రాసిన విద్యార్థులు వాపోయారు.
చదువులు సిటీలో… ఎగ్జామ్స్ సత్తుపల్లిలో..
కొన్ని కార్పొరేట్ స్కూల్స్ తామే గొప్ప అని ప్రచారం చేసుకునేందుకు ఇటీవల విజయవాడ, గుడివాడ లాంటి ప్రాంతాల్లో బాగా చదివే విద్యార్థులను తీసుకొచ్చి సత్తుపల్లిలో తమ స్కూల్ తరఫున ఫీజు కట్టించి పదో తరగతి పరీక్షలు రాయించారు. తమ ర్యాంకుల వేట కోసం సిటీల నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాయించడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాంతం కాని చోట ఎగ్జామ్స్ రాయడానికి వచ్చిన విద్యార్థులు, మానసికంగా తీవ్ర ఒత్తిడి ఇబ్బందులు పడ్డారు. ఒకటి, ఒకటి, రెండు, రెండు, మూడు, మూడు అన్ని ర్యాంకులూ మావే అంటూ గొప్పలు చెప్పుకునే కార్పొరేట్ విద్యాసంస్థలు ఇలాంటి అక్రమాలకు పాల్పడి విద్యా వ్యవస్థ పరువు తీస్తున్నాయి కోట్ల రూపాయలు సంపాదించడమే లక్ష్యంగా విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూళ్ళపై చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Read this also : హనుమాన్ ఆదర్శంగా వ్యక్తిత్వ నిర్మాణం ! ఏప్రిల్ 12 హనుమద్విజయోత్సవం
Read this also : డ్యూటీ ఫస్ట్ … ఫ్యామిలీ నెక్ట్స్… పవన్ కల్యాణ్ కు జనం నీరాజనాలు