పిల్లలకు దగ్గు సిరప్ సేఫ్‌నా? తల్లిదండ్రులకు హెచ్చరిక !
For English Version : Cough Syrup Safe for Kids?| IndiaWorld.in
పిల్లల దగ్గు సిరప్ వాడకంపై Warning ?
మనలో చాలా మంది తల్లిదండ్రులు, చిన్నారికి దగ్గు వస్తే వెంటనే దగ్గు సిరప్ తాగిస్తారు. కానీ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (DGHS) ఓ హెచ్చరిక జారీ చేసింది. డాక్టర్ల మాటల్లో చెప్పాలంటే, పిల్లల్లో వచ్చే ఎక్కువ శాతం దగ్గు వ్యాధులు వాటంతట అవే తగ్గిపోతాయి. మందులు అవసరం ఉండకపోవచ్చు. అందుకే ప్రత్యేకంగా రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు–జలుబుకు మందులు అస్సలు వాడొద్దని స్పష్టం చేశారు. ఐదేళ్ళ లోపు పిల్లలకు కూడా వీలైనంత వరకు తగ్గించమని సూచిస్తున్నారు.

మందులకు బదులు ఏమి చేయాలి?
వైద్య నిపుణుల ప్రకారం, దగ్గు తగ్గడానికి ముందుగా వంటింటి చిట్కాలు పాటించాలి.
- పిల్లలకు తగినంత నీరు తాగించాలి
- విశ్రాంతి ఎక్కువగా ఇవ్వాలి
- ఆవిరి పీల్చడం, గోరువెచ్చని ద్రావకాలు ఇవ్వడం లాంటి సహాయక చర్యలు చేయాలి
ఈ చర్యలతో ఎక్కువ సందర్భాల్లో దగ్గు క్రమంగా తగ్గిపోతుంది. మందులు అవసరమైతే మాత్రం, డాక్టర్ల పర్యవేక్షణలో ఒక్క మందు మాత్రమే, సరైన మోతాదులో వాడాలి.
నాణ్యతలేని మందులతో డేంజర్
మన దేశంలో దాదాపు 5 వేలకు పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. కానీ, వాటిలో కొన్ని ఖర్చు తగ్గించుకోవడానికి నాణ్యత లేని మందులు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పిల్లల దగ్గు మందులు ఇలా నాణ్యత లేకుండా తయారు చేస్తున్న సందర్భాలు బయటపడ్డాయి.
డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ (Drugs Control Authority) తన పని సరిగా చేయకపోవడం వల్లే, ఇలాంటి మందులు మార్కెట్లోకి వస్తున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. 2023లో, 71 ఫార్మా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందుకారణం, నాణ్యత లేని దగ్గు మందులు తయారు చేసి, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి అక్కడ చిన్నారుల మరణాలకు కారణం అవడమే.
గతంలో జరిగిన విషాదాలు
2019లో జమ్మూలో 2 నెలల నుంచి 6 ఏళ్ల మధ్య వయసున్న 11 మంది పిల్లలు దగ్గు సిరప్ వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలు మనకు చాలా పెద్ద పాఠం చెబుతున్నాయి. చిన్నారులకు మందులు ఇవ్వడంలో చిన్న పొరపాటు కూడా ప్రాణాపాయానికి దారితీస్తుంది.
కోల్డ్ రిఫ్ సిరప్ పై నిషేధం – తెలంగాణ డీసీఏ హెచ్చరిక
లేటెస్ట్ గా Telangana Drugs Control Administration (DCA) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. కోల్డ్ రిఫ్ (Coldrif Syrup) అనే దగ్గు సిరప్‌లో డైఇథిలీన్ గ్లైకాల్ (DEG) కల్తీ ఉన్నట్లు తేలింది. అందుకే మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కొంతమంది చిన్నారులు మరణించారని సమాచారం.
ఈ సిరప్‌ను తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రీ సన్ ఫార్మా తయారు చేసిందని గుర్తించారు.
అత్యంత ప్రమాదకరమైన బ్యాచ్ వివరాలు
డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ప్రకారం –
- కోల్డ్ రిఫ్ సిరప్ బ్యాచ్ నంబర్: SR-13
- తయారీ తేదీ: మే 2025
- గడువు తేదీ: ఏప్రిల్ 2027
ఈ బ్యాచ్ వాడటం అత్యంత ప్రమాదకరం. ఎవరి దగ్గర ఉన్నా వెంటనే ఉపయోగించడం ఆపి, డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సమాచారం ఇవ్వాలి.

ప్రజలకు సూచనలు
- తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి
- పిల్లలకు దగ్గు వస్తే, వెంటనే సిరప్ ఇవ్వకుండా డాక్టర్‌ను సంప్రదించాలి
- ఇంటి దగ్గర ఆవిరి, గోరువెచ్చని నీళ్లు, విశ్రాంతి లాంటి పద్ధతులు ముందుగా ప్రయత్నించాలి
- మార్కెట్‌లో లభించే మందులు తప్పనిసరిగా డాక్టర్ సూచనతోనే వాడాలి
- నాణ్యత లేని మందులను గుర్తించి, టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కి సమాచారం ఇవ్వాలి
- Website : TELANGANA, ANDHRA PRADESH
తల్లిదండ్రులకు విజ్ఞప్తి
చిన్నారుల ఆరోగ్యంపై చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదం కావచ్చు. దగ్గు సిరప్ అనే చిన్న మందు కూడా ప్రాణాంతకమవుతుందని తాజా సంఘటనలు చెబుతున్నాయి. అందుకే –
👉 ఎప్పుడూ డాక్టర్ సూచన లేకుండా మందులు ఇవ్వవద్దు
👉 రెండేళ్లలోపు పిల్లలకు దగ్గు మందులు అస్సలు ఇవ్వొద్దు
👉 మందుల నాణ్యతపై డౌట్స్ ఉంటే వెంటనే ఫిర్యాదు చేయండి
మనమందరం అప్రమత్తంగా ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా కాపాడవచ్చు.



