ధర్మస్థలలో ఏ జరిగింది ? అంతు చిక్కని మిస్టరీ

Devotional Latest Posts Top Stories Trending Now

గత కొన్ని రోజులుగా… మీడియాలో, సోషల్ మీడియాలో ధర్మస్థల గురించి వార్త వైరల్ అవుతోంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్న ధర్మస్థల పుణ్యక్షేత్రం, ఇక్కడ శివుడు మంజునాథ స్వామిగా దర్శనమిచ్చిన పవిత్ర స్థలం. ఏటా లక్షల మంది భక్తులు సందర్శించే ఈ ఆలయం. ఇప్పుడు దారుణమైన హత్యలు, అత్యాచారాల కేంద్రంగా మారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. గత 20 ఏళ్లలో వందల మంది బాలికలు, టీనేజర్లపై అత్యాచారాలు, హత్యలు జరిగినట్టు ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడి కంప్లయింట్ తో వెలుగులోకి వచ్చాయి. ఈ ఘోరం దేశవ్యాప్తంగా షాక్‌కు గురిచేస్తోంది.


జూలై 3 న ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు… లాయర్ తో కలిసి ధర్మస్థల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. 1995 నుంచి 2014 వరకు ధర్మస్థల ఆలయంలో శానిటేషన్ వర్కర్ గా పనిచేసిన ఈ వ్యక్తి, నేత్రావతి నది దగ్గర్లోని ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తుండేవాడు. తన 20 ఏళ్ల సేవలో, వందల సంఖ్యలో డెడ్ బాడీలను ఆలయ సూపర్వైజర్ల ఆదేశాలతో ధర్మస్థల అటవీ ప్రాంతంలో పాతిపెట్టానని షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఈ డెడ్ బాడీల్లో ఎక్కువగా టీనేజ్ బాలికలు, చిన్నారులే ఉన్నారని, వాళ్ళపై అత్యాచారాలు, యాసిడ్ దాడులు జరిగినట్టు గుర్తులు కనిపించాయని చెప్పాడు. కొన్ని శవాలపై లోదుస్తులు కూడా లేవని, కొన్నింటిని గుర్తింపు సాధ్యం కాకుండా పెట్రోల్‌తో కాల్చినట్టు తెలిపాడు. 2010లో ఒక స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న బాలిక డెడ్ బాడీ 20 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి, గొంతు కోసిన పురుషుల శవాలు కూడా పాతిపెట్టినట్టు ఆ కార్మికుడు వివరించాడు. సూపర్వైజర్లు తనను బెదిరించి, “పాతిపెట్టమన్న శవాల గురించి ఎవరితో చెప్పినా, నిన్ను, నీ కుటుంబాన్ని ముక్కలు చేస్తాం” అని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. 2014లో తన కుటుంబ సభ్యురాలిపై సూపర్వైజర్‌కు సన్నిహితుడు వేధింపులకు పాల్పడటంతో, భయపడి కుటుంబంతో సహా ఇతర రాష్ట్రాలకు పారిపోయానని చెప్పాడు. అయితే, అపరాధ భావం తట్టుకోలేక నిజం బయటపెట్టడానికి తిరిగి వచ్చానని, తాను చెప్పింది నిజమని నిరూపించే … బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్ టెస్టులకు సిద్ధమని, పాతిపెట్టిన ప్రాంతాలు కూడా తనకు గుర్తున్నాయని అంటున్నాడు… ఒక బాధితురాలి పుర్రె ఫొటోను కూడా పోలీసులకు సమర్పించాడు.

సిట్ ఏర్పాటు, ఆలయ నిర్వాహకుల స్పందన

ఈ ఫిర్యాదుతో షాకైన పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక ప్రభుత్వం, సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం …. డీజీపీ ప్రణబ్ మోహంతీ ఆధ్వర్యంలో 20 మంది అధికారులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. ధర్మస్థల ఆలయ నిర్వాహకులు, విచారణకు పూర్తి సహకారం అందిస్తాం, నిజాలు బయటకు రావాలని కోరుకుంటున్నామని చెబుతున్నారు. ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు కొన్ని శతాబ్దాలుగా హెగ్దే కుటుంబం చూస్తోంది. ప్రస్తుతం వీరేంద్ర హెగ్దే, పద్మవిభూషణ్ గ్రహీత, రాజ్యసభ ఎంపీ, 1968 నుంచి 21వ ధర్మాధికారిగా కొనసాగుతున్నారు.

గతంలోనూ వివాదాలు

ధర్మస్థలలో ఇలాంటి దారుణాలు కొత్త కాదు. 2012లో సౌజన్య (17) అనే యువతి అనుమానాస్పదంగా మరణించింది. ఫోరెన్సిక్ నివేదికలో ఆమెపై అత్యాచారం జరిగినట్టు తేలింది. ఆలయ నిర్వాహకులకు సంబంధించిన వ్యక్తులే ఈ ఘటనకు కారణమని సౌజన్య కుటుంబం ఆరోపించింది. ‘జస్టిస్ ఫర్ సౌజన్య’ పేరుతో హక్కుల కార్యకర్తలు ఆందోళనలు చేశారు. 1987లో పద్మలత (17) హత్య, 2003లో అనన్య భబ్ అనే మెడికల్ స్టూడెంట్ మిస్సింగ్ ఘటనలు కూడా సంచలనం రేపాయి. 2012 సౌజన్య కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పటికీ, నిజమైన నిందితులు ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ధర్మస్థలలో 2000-2014 మధ్య కనీసం 15 అనుమానాస్పద మరణాలు నమోదైనట్టు చెబుతున్నారు. వీటిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. ఈ కేసుల్లో ఎక్కువ భాగం ‘ఆత్మహత్య’ లేదా ‘ప్రమాదం’గా ముగించేశారని ఆరోపణలు ఉన్నాయి. కార్మికుడి ఫిర్యాదు తర్వాత స్థానిక హక్కుల సంస్థలు ధర్మస్థలలో స్వతంత్ర ఫోరెన్సిక్ బృందంతో తవ్వకాలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. నేత్రావతి నది దగ్లర్లోని అటవీ ప్రాంతంలో శవాలను కనుగొనే అవకాశం ఉందని నమ్ముతున్నాయి. ఈ ఫిర్యాదు తర్వాత బాధిత కుటుంబాలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నాయి. కొందరు తమ కుమార్తెలు, బంధువులు మిస్సింగ్ అయిన ఘటనలను ఈ కేసుతో ముడిపెడుతున్నారు.

బాధితుల ఆవేదన, సమాజ ఆందోళన

కార్మికుడి ఫిర్యాదు తర్వాత, తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారు పోలీస్ స్టేషన్లకు వెళ్తున్నారు. స్థానిక హక్కుల సంస్థలు, మహిళా సంఘాలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పూర్తి విచారణ డిమాండ్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో #JusticeForDharmasthala హ్యాష్‌ట్యాగ్‌తో ఈ ఘటన వైరల్ అవుతోంది. స్థానిక రాజకీయ పార్టీలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ దారుణం గురించి నిజాలు బయటకు రావాలంటే, పారదర్శకమైన విచారణ కీలకం. సిట్ బృందం నేత్రావతి నది, అటవీ ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహించి, కార్మికుడు చెప్పిన ప్రాంతాలను పరిశీలించాలి. బాధిత కుటుంబాలకు న్యాయం అందించడానికి, నిందితులను కఠినంగా శిక్షించడం అవసరం. అలాగే, ఆలయ నిర్వహణలో జవాబుదారీతనం పెంచే చర్యలు తీసుకోవాలి. సిట్ విచారణ ద్వారా నిజాలు బయటకు రావాలి, బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా, ఆలయాల్లో భద్రత, పారదర్శకతను పెంచాలి.

 

Tagged

Leave a Reply