సోమవారమే దీపావళి పండగ : పూరీ ముక్తి మండప పండితుల క్లారిటీ
Diwali Festival 2025 : ఈ ఏడాది దీపావళి పండుగ తేదీపై రాష్ట్రవ్యాప్తంగా జనంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. పంచాంగాలు వేర్వేరు తేదీలను సూచించడంతో, దీపావళి ఎప్పుడు జరుపుకోవాలో స్పష్టత లేకుండా పోయింది. అయితే, పూరీ శ్రీక్షేత్ర ముక్తిమండప పండిత సభ బుధవారం ఈ సందేహాలపై క్లారిటీ ఇచ్చింది.
అక్టోబర్ 20నే దీపావళి
పండిత సభ అధ్యక్షుడు పండిత ఆదిత్య హృదయ మిశ్ర పూరీలో జరిగిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించింది. అక్టోబర్ 20 (సోమవారం)న దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. అదేరోజు మధ్యాహ్నం 3:23 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. అందువల్ల పండుగ కార్యక్రమాలు సోమవారమే నిర్వహించాలన్నారు.

సోమవారం నాడే పిండ ప్రదానాలు
పితృదేవతలకు పిండ ప్రదానాలు, దివిటీలు, దీపారాధన లాంటి సంప్రదాయ కార్యక్రమాలు కూడా సోమవారంనే చేపట్టాలని సూచించారు. మంగళవారం (21) అమావాస్య తిథి కేవలం 14 నిమిషాలపాటు మాత్రమే ఉండటంతో, దివిటీలు వెలిగించడం వల్ల ప్రయోజనం ఉండదని పండితులు అభిప్రాయపడ్డారు.
ఈ నిర్ణయం తీసుకునే సమావేశంలో పలువురు ప్రముఖ పండితులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని 11 పంచాంగాలు వేర్వేరు తేదీలను సూచించగా, కొందరు 20న, మరికొందరు 21న జరుపుకోవాలని సూచించారు. దాంతో ముక్తిమండప పండిత సభ October 20తేదీన Diwali పండుగ జరుపుకోవాలని తుది నిర్ణయం తీసుకుంది.