ఓ వైపు హైడ్రా దూకుడుతో హైదరాబాద్ రియల్ బూమ్ పడిపోయిందని అందరూ అంటున్నారు. జాతీయ స్థాయిలో వస్తున్న రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ రిపోర్టులు కూడా అదే చెబుతున్నాయి. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఇళ్ళ అమ్మకాలు పడిపోయాయి. కానీ ఇప్పుడు సిటీ శివారుల్లో మరో చోట రియల్ బూమ్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఫ్యూచర్ సిటీ చుట్టు పక్కల గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలు కోసం బేర సారాలు సాగుతున్నాయి. ఏంటా భూములు… ఎక్కడ ఉన్నాయో చూద్దాం…
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ … ఈ ట్రైసిటీస్ కి తోడు… ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీ వస్తోంది. సిటీకి ఈస్ట్ సైడ్ లో తెలంగాణ ఫ్యూచర్ సిటీకి అడుగులు పడుతున్నాయి. దాదాపు 14 వేల ఎకరాల్లో ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, పర్యాటకం ఇలా నాలుగు జోన్లుగా విభజించి… ఒక్కోటి దాదాపు 3 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలన్నది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన.
రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు ఏరియాలో పర్యావరణానికి ప్రాధాన్యత ఇస్తూ పార్కులు, ఎకో టూరిజం హబ్, నివాస స్థలాలు లాంటివి ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఏకంగా 10 వే రోడ్లకు ప్లాన్ చేస్తున్నారు. ORR నుంచి ఫ్యూచర్ సిటీ మీదుగా RRR వరకూ 320 ఫీట్లతో 42 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్స్, అలాగే మెట్రోని ఫ్యూచర్ సిటీ దాకా పొడిగించాలని ప్లాన్స్ నడుస్తున్నాయి.
హైదరాబాద్ కి ఫ్యూచర్ సిటీ వస్తే … ప్రపంచ స్థాయి ప్రమాణాలు కనిపిస్తాయి. ఇప్పటికే గచ్చిబౌలి, నానక్ రామ్ గూడ లాంటి ఏరియాలకు వెళితే మనం అమెరికాలో ఉన్నామా అన్న డౌట్ వస్తోంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా తోడైతే హైదరాబాద్ కి ప్రపంచ నలుమూలల నుంచి మరిన్ని భారీ భారీ కంపెనీలు క్యూ కట్టే ఛాన్సుంది.
ఫ్యూచర్ సిటీ వైపు రియల్ బూమ్
ఇక ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలనుకుంటున్న యాచారం, కందుకూరు. మండలాల్లో భూములకు రెక్కలు వస్తున్నాయి. ఈ ఏరియాలో వ్యవసాయం బాగా నడుస్తుంది. భూగర్భ జలాలు కూడా ఫుల్లు. అందుకే ఈ ఏరియాలోని వ్యవసాయ భూములు కొని… ఫాంహౌస్ లు కట్టుకుంటే భవిష్యత్తులో ఫుల్లు డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాల్లోపు భూమిని కొనేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ ప్యూచర్ సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనేందుకు కొందరు ప్రజా ప్రతినిధులు, IAS, IPSలు, ఇతర ఉన్నతాధికారులు నజర్ పెట్టారు. తమ సన్నిహితులు, బంధువుల ద్వారా ఈ గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటున్నారు. వ్యవసాయం చేయడానికి వీలుగా… భూగర్భ జలాలు బాగా ఉన్న ఎర్రటి నేలలు కొనుక్కోవాలని భావిస్తున్నారు. కొంగర కలాన్ ORR నుంచి నిర్మించే ఫ్యూచర్ సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి కూడా వస్తోంది. ఫ్యూచర్ లో ఈ ఫ్యూచర్ సిటీ ఏరియా ఫుల్లుగా డెవలప్ అవుతుందన్న ఆలోచనతో వ్యవసాయ భూములు కొనుక్కోవాలని భావిస్తున్నారు.
అమాంతం పెరిగిన రేట్లు
కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్ పేట, ఆకుల మైలారం, బెగరికంచె, ముచ్చర్ల, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండలాల్లోని గ్రామాల్లో పొలాలకు ఫుల్లు డిమాండ్ ఉంది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగర కలాన్, మహేశ్వరం మండలాల్లోని రావిరాల, తుక్కగూడ గ్రామాల్లో పొలాలు, తోటలు ఎకరాకు 5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా పలుకుతున్నాయి. ప్యూచర్ సిటీకి దగ్గరల్లోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో భూములు ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు ధర ఉంటోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కంటే ముందు ప్రజాప్రతినిధులు, అధికారులే భూముల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. నేరుగా రైతులతో బేర సారాలకు దిగుతున్నట్టు తెలుస్తోంది.