హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కోవాలనుకున్న మధ్యతరగతి జనం ఆశలు నెరవేరడం లేదు. ఏటేటా ఇళ్ళ స్థలాలు, అపార్ట్ మెంట్స్ ధరలు పెరిగిపోతున్నాయి. తక్కువలో తక్కువ 50 లక్షల రూపాయలు పెట్టినా అపార్ట్ మెంట్ దొరకడం లేదని వాపోతున్నారు. అద్దెల రేట్లు కూడా విపరీతంగా ఉంటున్నాయి. నెలకు 15 నుంచి 25 వేల దాకా రెంట్ భరించే బదులు… అదేదో సొంతిల్లు కొనుక్కొని EMI కట్టుకోవడం బెటర్ కదా అని ఆలోచిస్తున్నారు. మరి నిజంగా హైదరాబాద్ లో రూ.50 లక్షల లోపు ధరల్లో ఇళ్ళు దొరుకుతున్నాయా ? ఏ ఏరియాలో ఉన్నాయి ? చూద్దాం…
రూ.50 లక్షల్లో ఇళ్ళు ఉన్నాయా ?
హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాల్లో తప్ప… శివారు ప్రాంతాల్లో రూ.50 లక్షల్లో ఇళ్ళు దొరుకుతున్నట్టు రియల్ ఎస్టేట్ ఓనర్స్ చెబుతున్నారు. LB నగర్ ఏరియాకి దగ్గరగా ఉండే…. ఇబ్రహీంపట్నం, నాగార్జున సాగర్ రోడ్, హయత్ నగర్, పోచారం తో పాటు ఇటు ఘట్ కేసర్, కీసర, షామీర్ పేట్ ఏరియాలో బడ్జెట్ హోమ్స్ అందుబాటులో ఉన్నట్టు చెబుతున్నారు. ఔటర్ కి లోపల ఉండే ఏరియాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా ఇలాంటి బడ్జెట్ ఇళ్ళు దొరుకుతున్నట్టు సమాచారం. గేటెడ్ కమ్యూనిటీల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయి. పార్కులు, ప్లే ఏరియాలు, వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఉంటాయి. దాంతో ఆరోగ్యం కాపాడుకోడానికి అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల మన బడ్జెట్ లో ఉంటే ఫస్ట్ ప్రియారిటీ Gated community ఇళ్ళకు ఇస్తేనే బెటర్.
కొనే ముందు చూసుకోండి !
ఇల్లు మళ్ళీ మళ్ళీ కొనలేం… మన జీవితాంతం కష్టపడితే దక్కే కలల సౌధం అది. అందుకే ఇళ్ళు, అపార్ట్ మెంట్స్ కొనేముందు ఒకటికి రెండు సార్లు అన్ని పర్మిషన్లు ఉన్నాయా లేదో చెక్ చేసుకోవాలి. GHMC, HMDA, DTCP లాంటి ప్రభుత్వం సంస్థల నుంచి నిర్మాణ అనుమతులు ఉన్నాయా లేదా చూడాలి. అంతే కాదు… RERA దగ్గర రిజిస్ట్రేషన్ అయిన ప్రాజెక్టులను మాత్రమే కొనాలి. లేకపోతే దెబ్బయిపోతారు. ఇప్పుడు హైడ్రా భయం కూడా వెంటాడుతోంది. చెరువుల FTL, బఫర్ జోన్ పరిధిలో లేని ఇళ్ళకు, ఏరియాకు ప్రాధాన్యత ఇవ్వండి.
బ్రోచర్ల మాయలో పడొద్దు
అందమైన బ్రోచర్ల మాయలో పడొద్దు. ప్రీలాంచ్ ల ఉచ్చులో చిక్కుకోవద్దు. మీరు ఇల్లు లేదా అపార్ట్ మెంట్ కొనే ముందు ఆ రియల్టరు, బిల్డర్ల చరిత్ర తెలుసుకోండి. ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలో ఉంటే తక్కువ రేట్లకు ఇస్తామని చెబుతారు. కానీ అసలు ఆ ప్రాజెక్టును పూర్తి చేసే ఆర్థిక స్థోమత ఆ బిల్డర్ కు ఉందా… లేదా చూసుకోవాలి. మధ్యలో వదిలేసి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు ఘోరంగా నష్టపోయేది మీరే.
ఇది కూడా చదవండి : Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !
కనీస వసతులు ఒకేనా?
ఇల్లు అందంగా ఉంటే సరిపోదు… దానికి మంచినీరు, విద్యుత్, రాకపోకలకు వీలుగా మంచి రోడ్డు లాంటి కనీస వసతులు కూడా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోండి. అలా అన్ని సౌకర్యాలు ఉన్న చోట ఇల్లు కొనుక్కుంటేనే బెటర్. ఎప్పుడో వస్తాయని ఇప్పుడు కొనుక్కోవడం అనవసరం. డబ్బులు రొటేషన్ కాకపోగా… వాటికి EMIలు కట్టుకోవాలి. మనం ఆ ఇంట్లో ఉన్నా… అద్దెకు ఇచ్చినా… కనీస వసతులు, నీటి సౌకర్యం లేకపోతే ఉపయోగం లేదు.
హాస్పిటల్స్, స్కూళ్ళు ఉన్నాయా ?
బడ్జెట్ హోమ్స్ కదా… అని ఎగిరి గంతేసి కొనే ముందు… ఇంకో విషయం కూడా గమనించాలి. అసలు ఆ ఇంటి నుంచి బయటి ప్రపంచానికి ( రోడ్లు, మార్కెట్ వసతి ఉన్న ఏరియాలకు ) ఎంత దూరంలో ఉంటుందో చూసుకోండి. పిల్లలకు స్కూళ్ళు, మీరు ఆఫీసులకు వెళ్ళడానికి సౌకర్యాలు, హాస్పిటల్స్ ఉన్నాయా లేదా అన్నది కూడా చెక్ చేసుకోవాలి.
ఇల్లు జీవితంలో ఒక్కసారి మాత్రమే కొనే పరిస్థితి మిడిల్ క్లాస్ జనానిది. అందుకే జాగ్రత్తగా ఆచి తూచి కొనుక్కోవాలి. అన్నీ పరిశీలించకుండా కొంటే ఆర్థికంగా నష్టపోతే మళ్ళీ కోలుకోవడం కూడా కష్టం అవుతుంది. బీ కేర్ ఫుల్.