న్యూఢిల్లీ: ఇంగ్లాండ్ తో జరిగిన హెడింగ్ టెస్ట్‌లో టీమిండియా బాగానే ఆడినట్టు కనిపించింది, ఆధిపత్యం చూపించింది… కానీ అనూహ్యంగా ఓడిపోవడం నిజంగా జీర్ణించుకోలేని విషయం. కొత్త కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సేన ఓటమికి పేస్ బౌలర్లే కారణమని విమర్శలు వస్తున్నాయి. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వచ్చిన శార్దూల్ ఠాకూర్ తన ఎంపికను సమర్థించుకోలేకపోయాడు. బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు, బౌలింగ్‌లో రెండు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఎనిమిదేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ కూడా నిరాశపరిచాడు. దీంతో జులై 2 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరిగే రెండో టెస్ట్‌కి టీమ్ కూర్పు మేనేజ్‌మెంట్‌కి పెద్ద సవాల్‌గా మారింది. బుమ్రాకి పనిభారంతో విశ్రాంతి ఇస్తే, బౌలింగ్ ఇంకా బలహీనమయ్యే ప్రమాదం ఉంది. భారత బౌలర్లలో క్రమశిక్షణ, నిలకడ లోపించాయని కొందరు మాజీ క్రికెటర్లు ఆరోపిస్తున్నారు. బుమ్రా తీవ్రంగా కష్టపడినా, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ చెత్త బంతులతో ఇంగ్లండ్‌కి పుంజుకునే అవకాశం ఇచ్చారు. రెండో టెస్ట్‌లో శార్దూల్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ని తీసుకోవాలని బలంగా వాదిస్తున్నారు. కరుణ్ నాయర్‌ని పక్కన పెడితే, నితీశ్ కుమార్‌కి అవకాశం దక్కొచ్చు.
అతడే ఎందుకు?
ఎన్నో ఏళ్లుగా జట్టులో కీలకంగా ఉన్న రోహిత్, కోహ్లీ, అశ్విన్ లేకుండా భారత్ ఫస్ట్ టైమ్ బరిలోకి దిగింది. బ్యాటింగ్ విభాగం ఓకే అనిపించినా, అశ్విన్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. జడేజా కూడా పెద్దగా రాణించలేకపోయాడు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేయాలంటే మ్యాజిక్ చేయగల స్పిన్నర్ కావాలి. అనుభవం, వికెట్లు తీసే నైపుణ్యం ఉన్న కుల్దీప్ యాదవ్‌తోనే అది సాధ్యమని మాజీలు చెబుతున్నారు. అవసరమైతే అతడి కోసం ఓ పేసర్‌ని త్యాగం చేయాలని సూచిస్తున్నారు. ఒకవేళ బుమ్రాకి విశ్రాంతి ఇస్తే, అర్ష్‌దీప్‌ని తీసుకోవచ్చని అంటున్నారు.
సుదర్శన్‌కి గాయమా?
మొదటి టెస్ట్‌లో ఓడిన భారత జట్టుకి మరో బ్యాడ్ న్యూస్. హెడింగ్‌లీలో అరంగేట్రం చేసిన బ్యాటర్ సాయి సుదర్శన్‌కి గాయమైనట్టు తెలుస్తోంది. ఫీల్డింగ్ చేస్తుండగా అతడి భుజానికి దెబ్బ తగిలిందట. దీంతో రెండో టెస్ట్‌కి అతడు ఫిట్‌గా ఉండకపోవచ్చు. ఇంగ్లండ్‌లోనే రిజర్వ్‌గా ఉన్న పేసర్ హర్షిత్ రాణాని మేనేజ్‌మెంట్ విడుదల చేసింది. రెండో టెస్ట్‌కి అతడు జట్టుతో ఉండడని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
బుమ్రాపై మరో ఆలోచన లేదు!
ఫస్ట్ టెస్ట్ ఓటమితో భారత టీమ్ ప్లాన్స్ లో మార్పులు ఉంటాయని అనుకున్నారు. బుమ్రా మూడు కంటే ఎక్కువ టెస్టులు ఆడతాడని టాక్ వచ్చింది. కానీ అలాంటిదేమీ లేదని కోచ్ గౌతమ్ గంభీర్ విలేకరుల సమావేశంలో చెప్పాడు. “మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పూ లేదు. బుమ్రాపై పనిభారం పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం. అతడు జట్టులో ఉంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. బుమ్రా మూడు మ్యాచ్‌లు ఆడతాడని ముందే నిర్ణయించాం” అని గంభీర్ అన్నాడు. బుమ్రా లేనప్పుడు మిగతా బౌలర్లు ఆ బాధ్యత తీసుకుంటారని చెప్పాడు. “ప్రతి టెస్ట్‌కి బౌలర్లపై తీర్పులు ఇస్తూ పోతే, వాళ్లు ఎలా మెరుగవుతారు?” అని ఎదురు ప్రశ్నించాడు. రెండు ఇన్నింగ్స్‌లో శతకాలు బాదిన రిషబ్ పంత్‌ని ప్రత్యేకంగా పొగడటానికి గంభీర్ ఆసక్తి చూపలేదు. “మరో ముగ్గురు కూడా సెంచరీలు చేశారు. జట్టు ఓడినప్పుడు దేనికీ విలువ ఉండదు” అని అన్నాడు. మొత్తానికి సెకండ్ టెస్ట్ మ్యాచ్ కల్లా టీమిండియా జట్టులో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.
Also read: కవిత రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్టు ఉందా ?
Also read: ‘వార్ 2’ కౌంట్ డౌన్ స్టార్ట్ : ఎన్టీఆర్
Also read: ఫైటర్ గా రష్మిక మందన్నా