* సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
* పక్కా వ్యూహమా ? స్ట్రాటజిక్ మిస్టేకా ?
* పక్కా వ్యూహంతో బీజేపీని ఇరికిస్తున్నారా ?
* కేంద్రంపై నెట్టడానికే సీబీఐకి అప్పగించారా ?
సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణకు ఆదేశించారు. ఇది పక్కా వ్యూహమా? లేక స్ట్రాటజిక్ మిస్టేకా? అని తెలంగాణలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో జరిగిన మారథాన్ చర్చ తర్వాత రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల స్కాం జరిగిందని, కేసీఆర్ నేరుగా బాధ్యులని ఆ రిపోర్టు చెబుతోంది. ఇప్పుడు సీబీఐకి ఇవ్వడంతో, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గుప్పిట్లో పడుతుందని కొందరు అంటున్నారు.
రాజకీయాల్లో వ్యూహాలు చాలా ముఖ్యం. ప్రత్యర్థుల్ని కట్టడి చేయడానికి చేతికి వచ్చిన ఆయుధాలను పక్క పార్టీలకు ఇవ్వరు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి. సీబీఐ సహా కేంద్ర ఏజెన్సీలు బీజేపీ చేతిలో ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ విమర్శిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సీబీఐ, ఈడీలపై తరుచుగా విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు రేవంత్ ఇలాంటి తీవ్రమైన కేసును సీబీఐకి ఇవ్వడం వెనుక, బీఆర్ఎస్‌ను బీజేపీకి ఎరగా వేసే ప్లానా అని అనుమానాలు వస్తున్నాయి.
ఈ నిర్ణయం రేవంత్ క్యాబినెట్ సహచరులకు కూడా షాక్ ఇచ్చిందట. శనివారం జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఈ విషయం చర్చకు రాలేదని, అసెంబ్లీలో సడెన్‌గా ప్రకటించారని తెలుస్తోంది. మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సీబీఐ విచారణను తెలంగాణను ఎండబెట్టే కుట్రగా అభివర్ణించారు. ఇది రాజకీయ డూప్లిసిటీ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో డిజైన్ లోపాలు, నిర్మాణ లోపాలు ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) రిపోర్టు కూడా చెబుతోంది.
రేవంత్ నిర్ణయం వెనుక రెండు ప్రయోజనాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారు. మొదటిది, కేసీఆర్ ని జైలుకు పంపాలన్న టార్గెట్‌ను సాధించడం. కానీ నేరుగా చర్యలు తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు అని ముద్ర పడుతుంది. సీబీఐ ద్వారా చేస్తే, ఆ ఛార్జ్ తమ మీద పడదు. రెండోది, ఒకవేళ బీజేపీ చర్యలు తీసుకోకపోతే, బీఆర్ఎస్-బీజేపీ కుమ్మక్కు అని ఆరోపించి, రెండు పార్టీలను ఒకే గాటన కట్టి రాజకీయ లాభం పొందవచ్చు. ఇది రేవంత్ రెడ్డి బహుముఖ వ్యూహమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అదనంగా, ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్న రుణాలపై 49,835 కోట్లు చెల్లించిందని, ఇందులో వడ్డీ 29,956 కోట్లు, అసలు 19,879 కోట్లు అని సీఎం రేవంత్ అసెంబ్లీలో చెప్పారు. ఈ ప్రాజెక్టు వ్యయం మొదట 87,449 కోట్లు అని చెప్పి, తర్వాత 1.27 లక్షల కోట్లు అయిందని సీఏజీ రిపోర్టు చెబుతోంది. ఇందులో భారీగా అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సీబీఐకి లేఖ రాసేసి, ఒకటి రెండు రోజుల్లో పంపిస్తామని రేవంత్ చెప్పారు.
మొత్తంగా, ఈ విచారణ ప్రారంభమైతే చాలా అంశాలు బయటపడతాయి. ఇది రేవంత్ మాస్టర్ స్ట్రోకా లేక మిస్టేకా అనేది తొందర్లోనే తెలుస్తోంది.
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/