కాలుష్య నియంత్రణ నిబంధనల ఉల్లంఘనతో అధికారుల చర్య
Big Boss Kannada: కన్నడ బిగ్‌బాస్ సీజన్ 12 షూటింగ్‌కు గట్టి షాక్ తగిలింది. బిడదిలోని ‘జాలీవుడ్ స్టూడియో’లో నిర్వహిస్తున్న ఈ రియాలిటీ షో హౌస్‌ను మంగళవారం రెవెన్యూ, కాలుష్య నియంత్రణ అధికారులు పోలీసుల సహకారంతో తాళాలు వేశారు. ఈ చర్యతో షో మధ్యలోనే నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వ్యర్థాలు రోడ్ల మీదకు
కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (KSPCB) ఇటీవల నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో, జాలీవుడ్ స్టూడియో నుంచి రోజూ దాదాపు 2.5 లక్షల లీటర్ల శుద్ధి చేయని నీరు బయటకు విడుదలవుతోందని గుర్తించారు. అలాగే, ప్లాస్టిక్ గ్లాసులు, వంటింటి వ్యర్థాలు రోడ్ల పక్కన పారబోస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో KSPCB జోలీవుడ్ స్టూడియో నిర్వహణ సంస్థ అయిన Vels Studios & Entertainment Pvt Ltd కు నోటీసులు జారీ చేసింది.
నిర్వాహకులు నోటీసులకు స్పందించకపోవడంతో, తహసీల్దారు తేజస్విని ఆధ్వర్యంలో అధికారులు హౌస్‌కు తాళం వేశారు. విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని BESCOM అధికారులకు సూచించారని పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే తెలిపారు.

అర్థంతరంగా నిలిచిన బిగ్ బాస్ షో
ఈ షోను ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ప్రారంభమైన సీజన్ 12 రెండో వారంలోనే నిలిచిపోయింది. గత 12 యేళ్ళుగా Bigg Boss Kannada ఎప్పుడూ మధ్యలో నిలిచిన పరిస్థితి లేదు. మొదటిసారి సీజన్‌ను అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.
KSPCB ప్రకారం, స్టూడియో ఆవరణలో 250 KLD సామర్థ్యం గల STP (Sewage Treatment Plant) ఉన్నప్పటికీ, అది పనిచేయడం లేదని, మురుగు నీరు శుద్ధి లేకుండా బయటకు వెళ్తోందని గుర్తించారు. అలాగే, డీజిల్ జనరేటర్లు, మిగతా వ్యర్థాల నిర్వహణలో కూడా నిబంధనలు పాటించలేదని అధికారులు తెలిపారు.
ఈ పరిణామంతో బిగ్‌బాస్ కన్నడ సీజన్ 12 భవితవ్యం అనిశ్చితంగా మారింది.



