* తినడానికి తిండిలేని స్థితిలో కాంతారావు ఫ్యామిలీ
* అవార్డు కింద విజయ్ దేవరకొండకు రూ.10 లక్షలు
* వేడుకలు చూడ్డానికి కత్తి కుటుంబానికి వెయ్యి రూ. గిఫ్ట్
* చలించిన రైటర్ యండమూరి, రూ.1లక్ష అందజేత
పోయినోళ్ళందరూ మంచోళ్ళు… అని చెప్పుకుంటారు. కానీ వాళ్ళు బతికున్న కాలంలో ఏనాడూ ఆదుకున్న వాళ్ళు ఉండరు. ప్రభుత్వాలు కూడా తమ పేరు కోసం, జనంలో మెహర్భానీ కోసం… ఆ పెద్దల పేరుతో అవార్డులు ప్రదానం చేస్తున్నాయి.
ఇది ప్రఖ్యాత నటుడు కత్తి కాంతారావు గురించిన స్టోరీ. నిజంగా ఇది స్టోరీ కాదు… జీవన వ్యధ. అలనాటి తెలుగు చలనచిత్ర సీమకు ఎన్టీఆర్, ఎన్నార్ రెండు కళ్ళయితే కత్తి కాంతారావు వాళ్ళిద్దరితో పోటీ పడి నటించిన మూడో కన్ను అనుకోవాలి. జానపద చిత్రాల్లో నటించి కత్తి వీరుడిగా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కత్తి కాంతారావు స్వగ్రామం తెలంగాణలోని కోదాడ. రజాకార్ల ఉద్యమం టైమ్ లో కోదాడ నుంచి చెన్నైకి మకాం మార్చారు. ఆయనకు నలుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. వీళ్ళల్లో ఒకరిద్దు మంచిగానే సెటిల్ అయినా… మిగతా వాళ్ళ పరిస్థితి కనీసం ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పేదరికంలో ఉన్నారు.
కత్తి కాంతారావు పేరుతో అవార్డు
తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరున టాలీవుడ్ కి అవార్డులు ప్రకటించింది… అందులో తెలంగాణకు చెందిన కత్తి కాంతారావు పేరున లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డును ఇస్తోంది. మొదటి అవార్డును మహబూబ్ నగర్ కు చెందిన సినీ నటుడు విజయ్ దేవరకొండకు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 14న జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో విజయ్ అవార్డుతో పాటు రూ.10 లక్షల క్యాష్ కూడా అందుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ అసలు కత్తి కాంతారావు కుటుంబం ఎలా ఉంది ? వాళ్ళకి జీవనోపాధి దొరుకుతుందా ? అని ప్రభుత్వాలు ఏనాడూ ఆలోచించలేదు.
అద్దె కట్టలేని స్థితిలో కాంతారావు కొడుకు
తెలంగాణ ప్రభుత్వం కత్తి కాంతారావు పేరుతో అవార్డు ప్రకటించి, విజేతకు 10 లక్షల రూపాయల బహుమతి ఇచ్చింది. ఈ అవార్డుల ఫంక్షన్ కు హాజరయ్యేందుకు కాంతారావు నాలుగో కొడుక్కి ప్రభుత్వం దయతలచి…. చాలా పెద్ద అమౌంట్ అది కూడా రూ.1000 పంపింది. కానీ నిజానికి తెలంగాణ బిడ్డ కత్తి కాంతారావు కుటుంబం ఇంటికి అద్దెలు కట్టుకోలేని దారిద్ర్యంలో ఉందంటే ఎంత బాధాకరమైన విషయమో అర్థం చేసుకోవచ్చు. కాంతారావు కొడుకు రాజా నెల నెలా రెంట్ చెల్లించడానికి డబ్బుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఈ సంగతి తెలిసిన ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్, తనకు రఘుపతి వెంకయ్య అవార్డు కింద వచ్చిన మొత్తంలో ఓ లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళి కాంతారావు కొడుకు రాజాకు ఇచ్చారు. జనరల్ గా యండమూరి సేవా కార్యక్రమాలకు డబ్బులు దానం చేస్తుంటారు. ముఖ్యంగా తనకు వచ్చిన అవార్డుల్లో డబ్బులు ఏవీ కూడా తాను తీసుకోరు. అన్నీ ఫౌండేషన్లకే ఖర్చు చేస్తుంటారు.
బతికుండగా సాయం చేయలేదు
తెలంగాణ బిడ్డ అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు… నటుడు కత్తి కాంతారావు బతికుండగా ఏనాడూ సాయం చేయలేదు. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించిన కేసీఆర్ ని కూడా ప్రభుత్వం తరపున ఇల్లు మంజూరు చేయాలి అడిగి అడిగీ కాంతారావు కుటుంబం అలసి పోయింది. కాంతారావు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారు. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ మాత్రం, చాలా సినిమాల్లో వేషాలు ఇప్పించారు. ఇక ఎన్టీఆర్, ఏఎన్నార్ ఎన్నడూ సాయం చేయలేదని అంటుంటారు. అయితే సౌతిండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ మాత్రం నెలకు రూ.8 వేలు ఇచ్చేవారు. అలనాటి హీరోల నుంచి ఈతరం నటుల దాకా అంతా ప్రేక్షకులు చమటోడ్చి టిక్కెట్ల రూపంలో చెల్లించిన డబ్బులతో రాజ వైభోగాలు అనుభవిస్తున్నారు. కానీ కనీసం తోటి నటులు, వారి కుటుంబాలను ఆదుకోవాలన్న సోయి మాత్రం ఉండటం లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జోక్యం కల్పించుకొని కత్తి కాంతారావు కుటుంబానికి ప్రభుత్వం తరపున ఇల్లు కేటాయించడంతో పాటు వారిని ఆర్థికంగా కూడా ఆదుకోవాలి. అలాగే సినిమాల్లో నటించినందుకు కోట్ల రూపాయలు తీసుకునే హీరో విజయ్ దేవరకొండ కూడా తనకు కాంతారావు అవార్డు కింద వచ్చిన రూ.10 లక్షలతో పాటు మరికొంత సొమ్మును వారి కుటుంబానికి ఇవ్వాలని సోషల్ మీడియాలో జనం డిమాండ్ చేస్తున్నారు. రైటర్ యండమూరిని ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు.
Also read: 93 ఏళ్ల వయసులో భార్యకు తాత గోల్డ్ గిఫ్ట్
Also read: నాగార్జున రూటు మార్చాడు: విలన్ రోల్స్‌తో సరికొత్త అవతారం!
Also read: జనసేనలో అసంతృప్తి జ్వాలలు!
Also read: https://in.bookmyshow.com/person/kanta-rao/IEIN003621