* ఉద్యమాల్లో హీరో…రాజకీయాల్లో జీరో
* కాంగ్రెస్ కి అండగా నిలవడంపై విమర్శలు
* డర్టీ పాలిటిక్స్ వద్దంటున్న అభిమానులు
* ప్రశ్నించే శక్తిగానే ఉండాలని రిక్వెస్ట్
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మానవ హక్కుల నేతగా, తరువాత రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలను, వర్గాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలోని ఒంటెత్తు రాజకీయాలను, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడాన్ని బహిరంగంగా తప్పుపట్టారు. కేసీఆర్ పాలనపై విమర్శల కారణంగా కోదండరామ్ పై కక్ష పెంచుకొని, అర్థరాత్రి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్టులు కూడా జరిపించారు. అప్పట్లో ప్రతి ఉద్యమకారుడు కూడా బాధపడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి తెలంగాణ జన సమితి (టీజేఎస్) పార్టీని స్థాపించినా, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల చీలికను నివారించేందుకు పోటీకి దిగలేదు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవ సూచకంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆయన పేరును సిఫార్సు చేసింది. అయితే, గతంలోనే నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఈ నియామకంపై హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చినా, తుది విచారణలో టెక్నికాలిటీస్ ఆధారంగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ పదవులను రద్దు చేసింది. తుది తీర్పు సెప్టెంబర్ 17న వెలువడనుంది.
కోదండరామ్ తప్పు చేశారా ?
ఈ పరిణామంపై విమర్శలు, సమర్థనలు రెండూ వ్యక్తమవుతున్నాయి. విమర్శకులు కోదండరాం అధికార వ్యామోహంతో రేవంత్ పక్కన చేరారని ఆరోపిస్తుంటే, మద్దతుదారులు మాత్రం ఉద్యమ సంధానకర్తగా ఆయనకు రేవంత్ ఇచ్చిన గౌరవాన్ని గుర్తుచేస్తున్నారు. రాజకీయంగా అడుగులు తప్పు కావచ్చు, కానీ వ్యక్తిగతంగా కోదండరాం అవినీతిపరుడు కాదని, కుసంస్కారి కాదని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, జేఏసీ కన్వీనర్‌గా కోదండరాం స్థానం తెలంగాణ సమాజంలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. వర్తమాన రాజకీయాలకు ఆయన పనికిరాకపోయినా ‘ప్రశ్నించే శక్తి’గా కోదండరామ్ మళ్ళీ తన పంథాను కొనసాగించాలని మద్దతుదారులు కోరుతున్నారు. ఎమ్మెల్సీ పదవి ఉండటం లేదా కోల్పోవడం ఆయన వ్యక్తిత్వానికి పెద్ద విషయం కాదని, తెలంగాణ సమాజం మాత్రం ఆయన తనలాగే ఉండాలని కోరుకుంటోంది. రేవంత్ పక్షాన చేరడం వల్లే కోదండరామ్, నిరుద్యోగుల సమస్యలు లేవనెత్తడం లేదని అంటున్నారు. ఈ విమర్శల నుంచి బయటపడాలంటే మళ్ళీ ప్రశ్నించే గొంతుకగా ఉండాలని తెలంగాణ ఉద్యమకారులు కోరుకుంటున్నారు.
Read also : ఆపరేషన్ సిందూర్ విజయోత్సవం : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్
Read also : Vivo V60 Launched in India: Premium Mid-Range Smartphone