KTR Arrest : రేపో.. మాపో జైలుకు కేటీఆర్ : ఫార్ములా కేసులో సెలబ్రిటీలకు నోటీసులు !

Latest Posts Top Stories

మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జైలుకు వెళతారా ? ఇన్నాళ్ళూ టైమ్ కోసం వెయిట్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అన్నంత పనీ చేస్తుందా ? అంటే అవును అనిపిస్తోంది. Formula-E కేసులో కేటీఆర్ మీద ఉచ్చు బిగుస్తోంది. మంత్రి చెప్పాడంటూ రూ.55 కోట్లను అప్పనంగా విదేశీ సంస్థకు కట్టబెట్టింది మున్సిపల్ శాఖ. ఈ వ్యవహారంలో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఇప్పటికే గవర్నర్ ను అనుమతి కోరింది ప్రభుత్వం. ఈ వ్యవహారంలో కొందరు అధికారులు కూడా జైలుకెళ్ళే అవకాశాలున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట్లోనే Formula-E కేసులో 55 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. అప్పట్లోనే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ పవర్ లోకి రాగానే పవర్ చూపించారన్న అపవాదు వస్తుందనీ… అప్పుడే అంత దూకుడుగా వెళ్ళడం కరెక్ట్ కాదని అనుకున్నారేమో కేటీఆర్ పై యాక్షన్ తీసుకోలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మతో (Governor Jishnudev Sarma) సమావేశమై కేటీఆర్ కేసుపై పర్మిషన్ అడిగారు. ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతిస్తే రేపో, మాపో కేటీఆర్ స్టేట్ మెంట్ తీసుకోవడం…. ఆ తర్వాత అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

గవర్నర్ అనుమతి ఎందుకు ?

జనరల్ గా అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎమ్మెల్యేల్ని విచారించాలంటే దర్యాప్తు సంస్థలు స్పీకర్ ను అప్రోచ్ అవుతాయి. లేకపోతే సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. సెషన్స్ లేనప్పుడు ఇతర సమయాల్లో ఎమ్మెల్యేలను ఎంక్వైరీ చేయాలంటే గవర్నర్ లేదా స్పీకర్ పర్మిషన్ అక్కర్లేదు. అయినాసరే న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించేందుకు రేవంత్ సర్కార్ గవర్నర్ అనుమతి కోరినట్టు అర్థమవుతుంది. ఏసీబీ (ACB) అధికారుల ద్వారా ఇప్పటికే రిక్వెస్ట్ గవర్నర్ దగ్గరకు చేరింది. గవర్నర్ ఓకే చెబితే కేటీఆర్ కు నోటీసులిచ్చి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. ముందుగా కేటీఆర్ నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నాక… ఆ తర్వాత ఏం చేయాలన్నది దర్యాప్తు అధికారులు నిర్ణయిస్తారు.

ఏంటీ Formula-E కేసు ?

ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరింది అని ఓ సామెత ఉంది. తెలంగాణలో పేదలకు మౌలిక వసతులు కల్పించలేకున్నా… హైదరాబాద్ కు బ్రాండింగ్ పెరుగుతుందంటూ Formula-E రేసు నిర్వహణకు కోట్ల రూపాయలు తగలేసింది గత BRS ప్రభుత్వం. జనరల్ గా మన కోరికలను అధికారంలో ఉన్నప్పుడు తీర్చుకోవాలని కొందరు ప్రజాప్రతినిధులు అనుకుంటారు. కొందరు అప్పుడే విదేశీలకు టూర్లకు వెళ్తుంటారు. Formula-E రేసు కూడా ఇలాంటిది అనుకోవాలి. లేకపోతే అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రాక్ లేకుండా… జనం తిరిగే రోడ్లకు రిపేర్లు చేసి ఇక్కడే Formula-E పోటీలు అంటూ జనాన్ని మభ్యపెట్టారు అప్పటి పాలకులు, అధికారులు. 2023లో మొదటిసారి ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది BRS గవర్నమెంట్. తర్వాత 2024లో మరోసారి కండక్ట్ చేయడానికి విదేశీ సంస్థలతో రూ.100 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ముందస్తుగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రూ.55 కోట్లను రేసు నిర్వహణలో నోడల్ ఏజెన్సీగా ఉన్న మున్సిపల్ శాఖ ఇచ్చిపారేసింది. జనం సొమ్మును అప్పనంగా సమర్పించింది.

కేటీఆర్ నోటిమాటతో రూ.55 కోట్లు ?

మళ్ళీ ఎన్నికల్లోనూ మనమే గెలుస్తాం… అధికారంలోకి వస్తాం… అన్న ఊహల్లో తేలారు అప్పటి BRS అధినేతలు. అందుకే విజయవాడలో భారీ కాన్వాయ్ కి పెద్దసారు డబ్బులు తగలేస్తే… చిన్నసారు Formula-Eకి అడ్వాన్సులు ఇచ్చేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతో మున్సిపల్ శాఖ ముఖ్యశాఖ కార్యదర్శిగా ఉన్న అర్వింద్ కుమార్ కు నోటి మాటగా చెప్పారు. అంతే ఆగమేఘాల మీద వీర విధేయుడైన అర్వింద్ కుమార్ ప్రజల సొమ్ము 55 కోట్లను అప్పనంగా Formula-Eకి మధ్యవర్తిగా ఉన్న విదేశీ నోడల్ ఏజెన్సీకి సమర్పించారు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో కూటికీ గుడ్డకీ పనికిరాని Formula-E రేసులు మనకి అవసరమా అని వాటిని రద్దు చేసింది. అదే టైమ్ లో 55 కోట్ల రూపాయల సంగతి బయటకు రావడంతో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ కు మెమో ఇచ్చారు సీఎస్ శాంతి కుమారి. కేసును ఏసీబీకి అప్పజెప్పింది రేవంత్ ప్రభుత్వం.

పకడ్బందీగా ఏసీబీ కేసు

ఫార్ములా ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకున్న ఏసీబీ అధికారులు, రెగ్యులర్ ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఈ కేసుకు సంబంధించి అన్ని ఫిజికల్, టెక్నికల్ డాక్యుమెంట్లు, ఎవిడెన్సులు సంపాదించారు. కేసు పెట్టేది కేటీఆర్ మీద కావడంతో వీగిపోయే ఛాన్స్ లేకుండా పకడ్బందీగా ఫ్రేమ్ రెడీ చేశారు. అర్వింద్ కుమార్ కూడా తప్పు కేటీఆర్ మీదకు నెట్టేశారు. అప్పటి మంత్రి కేటీఆర్ నోటి మాటగా చెప్పగానే 55 కోట్లు మున్సిపల్ శాఖ నుంచి విదేశీ సంస్థకు చెల్లించినట్టు రాత పూర్వకంగా ఒప్పుకున్నారు. దాంతో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడానికి గవర్నర్ అనుమతి కోరారు ఏసీబీ అధికారులు.

స్టేట్ మెంట్ ఇచ్చాక కేటీఆర్ అరెస్ట్ ?

గవర్నర్ అనుమతి రాగానే ఏసీబీ అధికారులు కేటీఆర్ నుంచి ముందుగా స్టేట్ మెంట్ రికార్డు చేస్తారు. ఇది జరిగిన కొన్ని రోజుల టైమ్ లోనే ఆయన్ని అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. కేటీఆర్ కూడా ముందు నుంచీ తాను అరెస్ట్ అవడం ఖాయమని చెబుతూనే ఉన్నారు. ఈమధ్య సౌత్ కొరియా టూర్ లో మంత్రి పొంగులేటితో పాటు ఇతర మంత్రులు కూడా దీపావళికి బాంబులు పేలతాయని, పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతారని ప్రకటించారు. సో… ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదని తెలుస్తోంది.

సెలబ్రిటీలకీ నోటీసులు ?

అంతర్జాతీయ స్థాయిలో Formula-E రేసుకు పబ్లిసిటీ కల్పించేందుకు అప్పటి BRS ప్రభుత్వం కోట్ల రూపాయలు సెలబ్రిటీల ప్రమోషన్ కు ఖర్చుపెట్టింది. అందుకోసం సినిమా నటులు, క్రీడాకారులను పిలిచి భారీగా సంబరాలు నిర్వహించింది. ఆ వేడుకల్లో పాల్గొన్న సినీ నటులు, క్రీడాకారులకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రమోషన్ కింద ఎవరు ఎంత తీసుకున్నారో సెలబ్రిటీలను విచారించి స్టేట్ మెంట్స్ రికార్డు చేయాలని ఏసీబీ డిసైడ్ అయింది. విదేశీ కంపెనీలకు నిధులు అందించే విషయంలో ఎవరికైనా ముడుపులు అందాయా… డబ్బులు ఎలా చేతులు మారాయో కూడా ఏసీబీ ఎంక్వైరీ చేయనుంది. నెక్ట్స్ వీక్ లో మాత్రం తెలంగాణలో సంచలనాలు నమోదయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి.

Tagged