Site icon Telugu Word

మార్వాడీ గో బ్యాక్ – ఎందుకీ వివాదం ?

* కొందరి మధ్య గొడవ మొత్తం మార్వాడీలకు
* తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారంటున్న స్థానికులు
* ఇష్యూని అడ్డం పెట్టుకొని లీడర్లుగా ఎదగాలని కొందరి ఆశ ?
* తాము తెలంగాణ వ్యతిరేకం కాదంటున్న మార్వాడీలు
* జాతీయ సమైక్యత పాటించాలంటున్న మేథావులు

(యువ తెలంగాణ, హైదరాబాద్ ): తెలంగాణలో ఇటీవల సోషల్ మీడియాలో ‘మార్వాడీ గో బ్యాక్’ అనే నినాదం వైరల్ అవుతోంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య గొడవ నుంచి పుట్టింది. కానీ
మొత్తం మార్వాడీ సమాజాన్ని టార్గెట్ చేసేలా మారింది. స్థానిక వ్యాపారులు మార్వాడీలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, ఎవరైనా దేశంలో ఎక్కడైనా వెళ్లి వ్యాపారం చేసుకునే హక్కు ఉంది.
అలాంటిది మార్వాడీలు, రాజస్థానీలను వెళ్లిపోమని చెప్పడం ఏంటి? ఈ వివాదం అసలు ఎందుకు చెలరేగింది.

ఈ వివాదం సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో జరిగిన ఒక చిన్న గొడవతో మొదలైంది. ఒక మార్వాడీ వ్యాపారి కారు పార్కింగ్ గురించి ఒక స్థానిక దళిత యువకుడితో గొడవ పడ్డాడు. ఆ గొడవలో యువకుడిని కొట్టడంతో వీడియో వైరల్ అయింది. దీంతో మార్వాడీలు స్థానికులను అవమానిస్తున్నారని, వారి వ్యాపారాలతో స్థానిక ఉపాధిని దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. సింగర్ గోరటి రమేష్ ఈ సంఘటనపై ‘మార్వాడీల దోపిడీ’ని వివరిస్తూ ఒక పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ పాట 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. గోరటి రమేష్ ప్రజానాట్య మండలిలో పని చేసేవాడు…దీంతో ప్రజాస్వామ్యవాదులు కొందరు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నవాళ్ళు అరెస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటన తర్వాత ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదం సోషల్ మీడియాలో విస్తరించింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో ఆగస్టు 18న స్థానిక వ్యాపారులు బంద్‌కు పిలుపునిచ్చారు.
మార్వాడీలు తక్కువ ధరలకు వస్తువులు అమ్మి స్థానిక బిజినెస్ ను దెబ్బ తీస్తున్నారనీ….వాళ్ళ షాపుల్లో తమ వాళ్లనే నియమించి స్థానికులకు ఉపాధి ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. హోల్‌సేల్ వ్యాపారులు స్థానికులకు ఎక్కువ రేటుకు వస్తువులు అమ్మి, తమ వాళ్లకు తక్కువ రేటుకు ఇస్తున్నారని, డూప్లికేట్ వస్తువులు అమ్ముతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. మార్వాడీలు ఇప్పుడు బంగారం, కిరాణా, స్వీట్ షాపులతోపాటు ఎలక్ట్రానిక్స్, మొబైల్ షాపులు, చెప్పుల షాపులు వరకు అన్ని వ్యాపారాల్లో దూరారని స్థానికులు మండిపడుతున్నారు.

మార్వాడీల వాదన ఏంటి ?

మార్వాడీలు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. వారు నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్నారు… స్థానిక తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు.
వారు అధికారం కోరుకోలేదు, ఎవరూ పాలిటిక్స్ లేరు. తెలంగాణను కూడా ఏనాడూ దోచుకోలేదు, వ్యాపారం చేసి సంపద సృష్టిస్తున్నారని అంటున్నారు. హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని, తమ వల్ల స్థానికులకు ఎలాంటి హాని లేదని వాదిస్తున్నారు. తెలంగాణ ప్రజలు దేశంలో ఇతర ప్రాంతాల్లో లక్షల్లో నివసిస్తూ వ్యాపారాలు చేస్తున్నారని,
అలాంటిది తమను మాత్రం ఎందుకు వెళ్లిపోమని అంటున్నారని ప్రశ్నిస్తున్నారు. గుజరాతీలు, పంజాబీలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతుకుతారని, తాము కూడా అలానే చేస్తున్నామని చెబుతున్నారు.

రాజకీయ రంగు

ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంటోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ‘మార్వాడీ గో బ్యాక్’ అనేది హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర అని, మార్వాడీలు గుజరాతీలు సనాతన ధర్మం ఫాలో అవుతారని అంటున్నారు. ‘రోహింగ్యా గో బ్యాక్’ అని చెప్పాలని, లేకపోతే హిందూ కుల వృత్తులను కాపాడే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, BRS, మజ్లిస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. గోషామహల్ MLA రాజా సింగ్ కూడా మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్వాడీలు మన దేశానికి చెందినవారని, వారిని వెళ్లగొట్టే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. CM రేవంత్ రెడ్డి అందరినీ రమ్మని, పెట్టుబడులకు భరోసా ఇస్తానని అంటున్నారు. BRS మాత్రం ఈ విషయంలో స్పందించలేదు, కానీ కొందరు దీని వెనుక BRS కుట్రలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. లెఫ్ట్ పార్టీల ప్రమేయం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి… సోషల్ మీడియాలో నెటిజన్లు రక రకాలుగా స్పందిస్తున్నారు…కొందరు మార్వాడీలు మాఫియా అని….స్థానికులను మోసం చేస్తున్నారని అంటున్నారు. మరికొందరు రోహింగ్యాలు సెక్యూరిటీ థ్రెట్ అని, మార్వాడీలు ఆర్థికంగా సహకరిస్తున్నారని చెబుతున్నారు. మార్వాడీలు హిందుత్వ ఎకోసిస్టమ్‌కు ఫండింగ్ ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రాజ్యాంగం ఏ చెబుతోంది ?

భారత రాజ్యాంగం (ఆర్టికల్ 19) ప్రకారం, ఎవరైనా దేశంలో ఎక్కడైనా నివసించి, వ్యాపారం చేసుకునే హక్కు ఉంది. మార్వాడీలు దశాబ్దాలుగా తెలంగాణలో ఉన్నారు, ముఖ్యంగా హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో ఉన్నారు.. మార్వాడీలతో పాటు రాజస్థానీలు, మహారాష్ట్రకు చెందిన మరాఠాలు కూడా బిజినెస్ చేస్తున్నారు…వీళ్ళంతా తమ సంస్కృతిని కాపాడుకుంటూ
స్థానిక జీవన విధానాన్ని గౌరవిస్తున్నారు. ఇలాంటి ఆందోళనలు గతంలో ఒడిశాలో జరిగాయి,
అక్కడ మార్వాడీలు ఒడియా నేర్చుకుని స్థానికులతో కలిసిపోయారు. పార్సీలు గుజరాత్‌లో స్థానిక భాష, దుస్తులు అవలంబించి కలిసిపోయారు..అలాగే తెలంగాణ సంస్కృతి కూడా అందరినీ అక్కున చేర్చుకునేది, భాష, ప్రాంతం, కులం పేరుతో ఏనాడూ అవమానించలేదు…మరోవైపు, రోహింగ్యాలు, బంగ్లాదేశీలు అక్రమ వలసలు హైదరాబాద్ లో ఫుల్లుగా ఉన్నాయి…వాళ్ళ వల్లే నేరాలు పెరిగాయని కూడా ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ISI ఏజెంట్ల అడ్డాగా మారిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికులు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నప్పుడు, మార్వాడీలను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నలు ఉన్నాయి. బీహార్, UP, ఒడిశా కూలీలు లేకుండా తెలంగాణలో పనులు జరగవని, అందరూ భారతీయులే అని గుర్తుచేస్తున్నారు.

సమైక్యత కావాలి..

‘మార్వాడీ గో బ్యాక్’ వివాదం కొందరి గొడవను మొత్తం సమాజానికి వర్తించేలా చేయడం తప్పు. రాజకీయ కుట్రలు కావచ్చు, కొందరు ఈ ఇష్యూని అడ్డం పెట్టుకొని ఎదగాలన్న ఆశ కూడా ఉండొచ్చు. అయితే స్థానికుల ఆందోళనలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మార్వాడీలు స్థానిక భాష నేర్చుకుని, స్థానికులకు ఉపాధి ఇవ్వడం ద్వారా సమైక్యంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. తెలంగాణ సంస్కృతి అన్ని నదులను కలుపుకునే సాగరం లాంటిది. ఏకంగా గో బ్యాక్ ఉద్యమాలు తెలంగాణకు నష్టం, అది మన కల్చర్ కాదు. అందరూ కలిసి బతకాలి, వివాదాలు చర్చలతో పరిష్కరించుకోవాలి.

Read also :  బెస్ట్ దోస తవా ఎంచుకోవడం ఎలా? – పూర్తి గైడ్

Read also : బెస్ట్ దోస తవా ఎంచుకోవడం ఎలా? – పూర్తి గైడ్

Exit mobile version