మీనాక్షి పెత్తనంపై కాంగ్రెస్ లో గుర్రు !

Latest Posts Top Stories

* ప్రభుత్వ వ్యవహారాల్లో పార్టీ ఇంఛార్జ్ కి పనేంటి ?
* మంత్రులు, అధికారులతో సమీక్షలపై విమర్శలు
* నేరుగా వినతిపత్రాలు ఎలా స్వీకరిస్తారు ?
* మీనాక్షి తీరుపై సొంత పార్టీలోనూ అసంతృప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆమె పెత్తనం పెరిగిపోవడంతో విపక్షాల నుంచే కాదు… స్వపక్షంలోనూ ఆందోళన మొదలైంది. ఏఐసీసీ వ్యవహారాల తెలంగాణ ఇంఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో నేరుగా పాల్గొనడం, అధికారులు, ప్రజాసంఘాలతో జరిగే చర్చల్లోనూ భాగస్వామి అవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెక్ పెట్టడానికే రాహుల్ గాంధీ కోటరీకి చెందిన మీనాక్షీ నటరాజన్ ను ఇంఛార్జ్ గా దింపినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. రేవంత్ వ్యవహార శైలి రాహుల్ కి నచ్చడం లేదనీ, అందుకే ఢిల్లీలో అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత మీనాక్షీ నటరాజన్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ గా బాధ్యతలు చేపట్టాక… కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు, కార్యకర్తలతో ఆమె సమావేశాలు జరిపారు. పార్టీని గాడిలో పెట్టడానికి అనుసరించాల్సిన వ్యూహం, ఎంపీ ఎన్నికల్లో తక్కువ సీట్లు గెలుచుకోవడంపైనా సమీక్షలు నిర్వహించారు. ఇంత వరకూ ఓకే. పార్టీకి సంబంధించి ఎలాంటి సమీక్షలు జరిపినా, ఆదేశాలు ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నేరుగా ప్రభుత్వ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

యూనివర్సిటీ భూములపై సమీక్ష

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములపై గత కొన్ని రోజులుగా తెలంగాణలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. ఈ భూమి మాదేనంటూ ప్రభుత్వం అడవిని క్లియర్ చేసేందుకు ప్రయత్నించింది. హెచ్ సీయూ విద్యార్థుల పోరాటాలు, అరెస్టులు, విపక్షాలు, ప్రజాసంఘాలు, సినీ నటుల నుంచి భారీగా నిరసన వ్యక్తమైంది. చివరకు సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలతో ఆ పనులకు బ్రేకులు పడ్డాయి. ఈ విషయంలో నిజా నిజాలు ఎలా ఉన్నా… రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం జనంలో అభాసుపాలైంది. దాంతో భూ వివాదం పరిష్కారం పేరుతో నటరాజన్ రంగంలోకి దిగారు. 3 రోజుల క్రితం హైదరాబాద్ కు వచ్చిన ఆమె… మంత్రులతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు, హక్కుల సంఘాల నేతలతో భేటీ అయ్యారు. కొన్ని జూమ్ మీటింగ్స్ నిర్వహించారు. ప్రభుత్వ వ్యవహారాల్లో మీనాక్షి జోక్యం చేసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీతో పాటు సొంత పార్టీలో సీనియర్ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి.

ఏ హోదాలో ఈ మీటింగ్స్ ?

మీనాక్షీ నటరాజన్ ఏ హోదాలో సెక్రటరియేట్ లో మంత్రుల కమిటీతో మీటింగ్ పెట్టారు ? ఏ హోదాతో ఆమె సెంట్రల్ వర్సిటీ విద్యార్థులతో సమావేశాల అయ్యారు అని ప్రశ్నలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఇప్పటిదాకా ఎలాంటి చర్చలు ప్రారంభించలేదు. కానీ అంతకంటే ముందే మీనాక్షీ నటరాజన్ రంగంలోకి దిగి సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ భూముల వివాదాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకుంది. ఇప్పుడు మీనాక్షీ నటరాజన్ వ్యవహారంతో ఆ పార్టీ మరింత మైలేజ్ పొందడానికి ప్లాన్ చేస్తోంది. ఆమె గాంధీ భవన్ కి పరిమితమై ఎలాంటి చర్చలు జరిపినా ఫర్వాలేదు గానీ ఏకంగా సెక్రటరియేట్ లోనే మీటింగ్స్ పెట్టడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

షాడో సీఎం అని విమర్శలు

మీనాక్షీ నటరాజన్ తెలంగాణలో షాడో సీఎం తరహాలో వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. సీఎం రేవంత్ కి చెక్ పెట్టడానికి ఆమెను దించారన్న వార్తలకు ఇప్పుడు బలం చేకూరినట్టయింది. అయితే కంచ గచ్చిబౌలి భూముల వివాదంలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు… రేవంత్, మంత్రులపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. విద్యార్థులకు, కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కూడా ఫిర్యాదులు ఏఐసీసీకి అందినట్టు తెలుస్తోంది. అందుకే పార్టీకి చెడ్డపేరు రాకుండా మీనాక్షి రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. కానీ ఆమె ప్రభుత్వ వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకోవడం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందన్న భయం కాంగ్రెస్ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.

Visit our E-paper : https://epaper.sharpnews.in/view/11/main-edition

Tagged