ఈనెల 10న ముక్కోటి ఏకాదశి
దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజు వైకుంఠ ఏకాదశి. శ్రీహరిని మేల్కొల్పడానికి… స్వామిని దర్శించుకోడానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి వెళ్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకొని పరవశించిపోతారు. ముక్కోటి దేవతలు విష్ణువు దర్శనానికి వస్తారు కాబట్టే… దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. అందుకే ఇటు భూలోకంలో మనుషులు కూడా ఉత్తర ద్వారం ద్వారా గుడిలోపలికి ప్రవేశించి శ్రీమహా విష్ణువును దర్శించి తరించిపోతారు.
ప్రతి మాసంలో ఏకాదశిని చాంద్రమానం ప్రకారం చేసుకుంటే… ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం నిర్వహించుకుంటాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించాక వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండగ ఒక్కోసారి మార్గ శిర మాసంలో, మరోసారి పుష్యమాసంలో వస్తుంది. మహా విష్ణువు ఈ రోజున ముందుగా దేవతలకు దర్శనం ఇచ్చి… ఆ తర్వాత ఉత్తర ద్వారం గుండా భూలోకానికి వచ్చి… మురాసురుడు అనే రాక్షసుడిని చంపాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల మంది దేవతలతో కలసి భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తారనీ… అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్టు అష్టాదశ పురణాలు చెబుతున్నాయి.
https://amzn.to/3DLXN80
ముక్కోటి ఏకాదశి నాడు ఏం చేయాలి ?
హిందువులంతా ఈరోజు తెల్లవారు జామునే నిద్ర లేవాలి. వీలున్న వాల్ళు నదీ స్నానానికి వెళ్ళాలి. లేదంటే ఇంట్లోనే స్నానం చేసి వైష్ణవ ఆలయంలోకి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శించుకోవాలి. ఆరోగ్యం బాగున్న వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేస్తే చాలా మంచిది. రోజంగా విష్ణువును పూజిస్తూ, ఆయన కథలు వినడం, విష్ణు నామాన్ని సంకీర్తనం చేయాలి. తెల్లారి ఉదయం విష్ణువుకి పూజ చేసి… అతిథికి భోజనం పెట్టి, ద్వాదశి పారణం (భోజనం) చేయాలి.
ముక్కోటి ఏకాదశి ఇవి మర్చిపోవద్దు
- పూజ గదిని శుభ్రం చేసుకుని పూలతో అలంకరించుకోవాలి. తర్వాత శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. వారి ఫొటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహ స్వామి ఇలా విష్ణు రూపాలకు సంబంధించిన ప్రతిమలను కూడా పూజించుకోవచ్చు.
- ఫొటో ఎదురుగా వెండి లేదా మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు ఒత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి.
- విష్ణుమూర్తికి ఇష్టమైన పూలతో పూజించాలి. అంటే తెల్లగన్నేరు, నందివర్దనం, తుమ్మి పూలు, జాజి పూలు వీటిల్లో వేటితో అయినా ఆ స్వామిని పూజించాలని పండితులు చెబుతున్నారు. పూలతో పూజ చేసేటప్పుడు “ఓం నమో నారాయణాయ”, “ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే ఈ రెండు మంత్రాల్లో ఏదైనా ఒక దాన్ని 21 సార్లు జపిస్తూ పూలతో పూజ చేయాలి.
- దీపం వెలిగించాక అగరబత్తీలను వెలిగించాలి.
- ఆ తర్వాత మనం తయారు చేసుకున్న తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి కర్పూర హారతి ఇవ్వాలి.
- ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేసినా, విన్నా సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం పొందుతారనీ, మోక్షానికి మార్గం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు.
🎯 తెలుగు వర్డ్ Telegram Link : CLICK HERE FOR TELEGRAM LINK