Navya Haridas Vs Priyanka: ఎవరీ నవ్య ? ప్రియాంకకు చెక్ పెడుతుందా ?

Latest Posts Top Stories

కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు రాహుల్ గాంధీ ఆ తర్వాత రిజైన్ చేశారు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా గెలవడంతో… వయనాడ్ సీటు వదులుకున్నారు. ఇప్పుడు ఈ ప్లేసులో తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టారు… ఫస్ట్ టైమ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు ప్రియాంక.

ఇందిరాగాంధీ తర్వాత అంత చరిష్మా ఉన్న నేత ప్రియాంక… నానమ్మ లాగే ఉంటుందని అంటుంటారు. కాంగ్రెస్ లీడర్లయితే ప్రియాంక గాంధీ ఒక్కసారి తమ నియోజకవర్గంలో అడుగుపెడితే తమ గెలుపు ఖాయమని నమ్ముతారు. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రియాంక కాంగ్రెస్ ప్రచార సభల్లో పాల్గొన్నారు. అయితే వయనాడ్ లో ప్రియాంక కు అపోజిట్ గా నవ్య హరిదాస్ అనే యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ని బరిలోకి దింపింది బీజేపీ. కార్పోరేటర్ గా ఉన్న ఈ మెకానికల్ ఇంజినీర్ నవ్య … ప్రియాంకను ఎలా ఢీకొట్టబోతోంది…వయనాడ్ లో చంటిగాడు లోకల్ అన్నట్టుగా… బీజేపీ తెస్తున్న లోకల్ ఫీలింగ్ ప్రియాంకను ఓడిస్తుందా… నవంబర్ 13న జరిగే ఉప ఎన్నిక ఎలా ఉండబోతోంది… ఈ టాప్ స్టోరీలో తెలుసుకుందాం. మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక

ప్రియాంక గాంధీ మొదటి సారి డైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నారు… గతంలో కాంగ్రెస్ తరపున ఉత్తరప్రదేశ్ లో గెలుపు బాధ్యతలు ఎత్తుకున్నారు. మొదట్లో అమేథి, రాయ్ బరేలీలో అమ్మ సోనియాగాంధీ, అన్న రాహుల్ గాంధీని గెలిపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ మొత్తాన్ని తన భుజం మీదకు ఎత్తుకున్నారు. కానీ అక్కడ గత రెండు సార్లుగా బీజేపీ ధాటికి కాంగ్రెస్ నిలబడలేకపోతోంది. ఈసారి ఎన్నికలకు గట్టి పోటీ ఇచ్చినా… యోగీ ఆదిత్యనాథ్ పవర్ ముందు కాంగ్రెస్ నిలబడ లేకపోయింది. అందుకే మొదటి సారిగా వాయనాడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ప్రియాంక.

ఎవరీ నవ్య ? బీజేపీ ఎందుకు దించింది ?

వయనాడ్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రియాంకకు గట్టి పోటీని పెట్టింది బీజేపీ. ఈ సీటుకు కుష్బూ పేరు కూడా పరిశీలనలో వచ్చింది. దాదాపు ఆమెకే ఇస్తారని అనుకున్నారు. కానీ ఈసారి లోకల్ కి ప్రియారిటీ ఇచ్చింది బీజేపీ. కేరళకే చెందిన నవ్య హరిదాస్ కి ఛాన్స్ ఇచ్చింది. 39 యేళ్ళ ఈ బీజేపీ నాయకురాలు కోజికోడ్ కార్పొరేషన్ కౌన్సిలర్. రెండు సార్లు కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. బీజేపీ తరపున కోజికోడ్ పార్లమెంటరీ పార్టీ నేత కూడా ఉన్నారు… 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజీకోడ్ సౌత్ నియోజకవర్గం నుంచి NDA అభ్యర్థిగా నిలబడ్డారు నవ్య హరిదాస్. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. నవ్య హరిదాస్… 2007లో కాలికట్ యూనివర్సిటీలోని KMCT ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ లో బీటెక్ చేసింది.

నవ్య పేరును బీజేపీ ప్రకటించగానే… ఇంకా ఆలస్యం ఎందుకు అనుకుందేమో… ప్రియాంకపై ఎటాక్ మొదలుపెట్టింది నవ్య. గాంధీ కుటుంబానికి వాయనాడ్ సెకండ్ ఆప్షన్ మాత్రమే… స్థానిక ప్రజలు ఇక అలాంటోళ్ళని నమ్మరు… ప్రియాంకు బుద్ధి చెప్పడం గ్యారంటీ అంటోంది నవ్య. స్థానికంగా తమ సమన్యలు సరిష్కరించే వాళ్ళకే ఓట్లు వేయాలని కోరుతోంది… అసలు వాయనాడ్ గొంతును పార్లమెంటులో రాహుల్ గాంధీ ఎప్పుడు వినిపించాడని ప్రశ్నిస్తోంది. అంతేకాదు… వాయనాడ్ కి ఏమేమి కావాలో అప్పుడే చిట్టా చదివేస్తోంది… మొత్తానికి చంటిగాడు లోకల్ అన్నట్టుగా… చంటిది లోకల్ అని నవ్య హరిదాస్ కొత్త రాగం అందుకుంది.

ప్రియాంక వాయనాడ్ లో గెలవకపోతే కాంగ్రెస్ పరువు పోతుంది… అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే … పకడ్బందీ ప్రచార వ్యూహంతో వెళ్తున్నారు… ఇక్కడ కాంగ్రెస్ కి ఇంకో ఇబ్బంది ఏంటంటే… ఇండియా కూటమిలో ఉన్న సీపీఐ కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది… ఆ పార్టీ సీనియర్ నేత సత్యన్ ని పోటీకి పెడుతుండటం కాంగ్రెస్ కి ఇబ్బందికరంగా మారింది. ఇండియా కూటమి ఓట్లు చీలితే… బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కి అడ్వాంటేజ్ అవుతోందని కాంగ్రెస్ భయపడుతోంది. అందుకే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ లీడర్లు సీపీఐని బతిమలాడుకుంటున్నారు…
ఉత్తరాదిలో రాయ్ బరేలీ ఉన్నట్టు… దక్షిణాదిలో వాయనాడ్ ను గాంధీ కుటుంబానికి కంచుకోటగా మార్చుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది…

ప్రియాంక గెలుపు అంత ఈజీ కాదు

రాహుల్ గాంధీ వల్లే వయనాడ్ కి బై ఎలక్షన్స్ వచ్చాయి… 6 నెలలుగా ఇక్కడ ఎంపీ లేరు… ఇదే విషయాన్ని సీపీఐతో పాటుుు బీజేపీ కూడా ప్రచారాస్త్రంగా చేసుకోబోతోన్నాయి… ఈ ఉప ఎన్నికల్లో ప్రియాంక గెలుపు కూడా అంత ఈజీ కాదనిపిస్తోంది… 2019తో పోలిస్తే 2024లో రాహుల్ గాంధీకి గెలుపు మెజారిటీ తగ్గింది… 2019లో రాహుల్ 4 లక్షల 19 వేల తేడాతో గెలిస్తే.. 2024లో 3 లక్షల 64 వేల మెజార్టీ సాధించారు. ఒకవేళ ప్రియాంక గెలిచినా… మెజార్టీ మళ్ళీ తగ్గిపోయే ఛాన్సుంది…సీపీఐ నుంచి పోటీ చేస్తున్న సత్యన్ మొకేరీ కూడా ఇక్కడ బలమైన నాయకుడు… కోజికోడ్ లోని నాదపురం నుంచి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు… విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగిన చరిత్ర ఉంది… 2024లో బీజేపీకి 13శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి… ఈ శాతాన్ని మరింత పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది… యంగ్ డైనమిక్ లీడర్ గా పేరున్న నవ్య హరిదాస్ తో తమ ఇమేజ్ పెరుగుతుందని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

(విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )

Tagged