కాఠ్‌మాండూ: నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మధ్య తాత్కాలిక ప్రధాని ఎంపికపై ఉత్కంఠ వీడిపోయింది. దేశ పార్లమెంట్‌ను రద్దు చేయడంతో, మాజీ చీఫ్ జస్టిస్ సుశీల కర్కిని తాత్కాలిక ప్రధానిగా జన్ జడ్ ఉద్యమకారులు ఎంచుకున్నారు. ఆమె పేరును అధ్యక్షుడి ఆమోదం కోసం పంపించారు. సుశీల కర్కి త్వరలో నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
సుశీల కర్కి ఎవరు?
సుశీల కర్కి (72) నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం కలిగిన వ్యక్తి. ఆమె తన వృత్తి జీవితాన్ని ఉపాధ్యాయురాలిగా ప్రారంభించి, తర్వాత న్యాయవ్యవస్థలోకి అడుగుపెట్టారు. నిర్భయంగా, సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ అవినీతి లేని వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2009లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. రాజ్యాంగ మండలి సిఫార్సుతో ఆమె నేపాల్ మొదటి మహిళా చీఫ్ జస్టిస్‌గా చరిత్ర సృష్టించారు.
లేటెస్ట్ గా జరిగిన జన్ జడ్ ఉద్యమంలో కూడా సుశీల కర్కి కీలక పాత్ర పోషించారు. ఆమె నాయకత్వంలో ఉద్యమకారులు రాజకీయ సంస్కరణల కోసం పోరాడారు. ఆమె నీతి, నిజాయితీకి ప్రజల మధ్య గొప్ప గౌరవం ఉంది.
నేపాల్‌లో ఇటీవలి రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో పార్లమెంట్ రద్దు నిర్ణయం తీసుకున్నారు. దాంతో దేశంలో కొత్త రాజకీయ సమీకరణలకు దారితీసే అవకాశం ఉంది. సుశీల కర్కి నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు, ఎన్నికల ప్రక్రియను స్థిరీకరించే దిశగా పనిచేయనుంది. ఆమె న్యాయవ్యవస్థలోని అనుభవం, పారదర్శకత దేశ రాజకీయ స్థిరత్వానికి దోహదపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


