రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు ఎందుకు ఆదర్శం ?

Latest Posts Sriramanavami Top Stories

త్రేతా యుగం ముగిసి ఏళ్ళ సంవత్సరాలు గడిచాయి… కానీ ఆ కాలంలో ప్రజారంజకంగా పాలించిన రామయ్య తండ్రిని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు… దేశంలో రామ మందిరం లేని ఊరు లేదు… రాముడు లేని ఇల్లు లేదు… యుగ యుగాలకు రాముడు ఎందుకింత ఆదర్శంగా మారాడు ? రామో విగ్రహవాన్ ధర్మ:… రాముడు ధర్మ స్వరూపుడు… అని రాక్షసుడైన మారీచుడే రామాయణంలో చెబుతాడు. మానవ అవతారంలో జన్మించిన శ్రీరామచంద్రుడు… మనిషిగా ఎలా బతకాలి… ఎంత ఆదర్శప్రాయంగా ఉండాలో తాను ఆచరించి… మానవ లోకానికి చూపించాడు. అందుకే ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అని కూడా అంటారు. శ్రీ రామనవమి సందర్భంగా రామయ్య తండ్రి ఆదర్శాలను తలుచుకుందాం ….
హిందూ బంధువులు… భక్తులందరికీ Telugu Word తరపున శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

రామాయణ మహా కావ్యానికి… మానన జీవితంతో విడదీయరాని సంబంధం ఉంది. రాముడు పరిపూర్ణ మానవుడు. మనిషి ఎలా ఉంటాడో అలాగే జన్మించాడు… మన లాగే పెరిగాడు… మన లాగే కష్టాలు పడ్డాడు… లోకం నుంచి నిష్టూరాలు కూడా అందుకున్నాడు… ఎన్ని కష్టాలు వచ్చినా… ఏ సందర్భంలోనూ శ్రీరామచంద్రుడు ధర్మాన్ని తప్పలేదు. తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. ఆదర్శ-పుత్రుడు, ఆదర్శ శిష్యుడు, ఆదర్శ భర్త… ఆదర్శ-సోదరుడు, ఆదర్శ- స్నేహితుడు, ఆదర్శ రాజు… ఇలా అన్నీ తానే అయ్యాడు. మానవ జీవితానికి అతి దగ్గరగా మెలిగింది శ్రీరామావతారం. అందుకే “రామ” నామం వింటే హిందువులు రోమరోమానా పులకించిపోతారు. సాటి వారిపై గౌరవం, తోటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం రాముడిలోని గొప్పతనం. తన అన్న రావణుడితో విభేదించి… శ్రీరాముడిని శరణు కోరతాడు విభీషనుడు. కానీ రాముడు నేరుగా అభయం ఇవ్వడు. జాంజవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, ఆంజనేయుడు. శరభుడు లాంటి వారిని పేరు పేరునా అభిప్రాయం కోరతాడు. తన మాట నెగ్గాలని ఎప్పుడూ రాముడు అనుకోలేదు. ప్రతి విషయంలో ప్రజాభిప్రాయాన్ని మన్నించే సుగుణం రాముడి సొంతం.

రాజ ధర్మం ముఖ్యం

రాజుగా ప్రజా జీవితంలోకి ఉండే వారికి ఎలాంటి కళంకం ఉండకూడదు అని సీతమ్మతో అగ్నిప్రవేశం చేయిస్తాడు. కిష్కింద, లంక రాజులను ఓడించాడు రాముడు. అయినా ఆ రాజ్యాలం కోసం ఆశపడ లేదు. మిత్రులకు ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం… కిష్కిందను సుగ్రీవుడికీ, లంకను విభీషణుడికి అప్పగించాడు. రాజ్యకాంక్ష, పరుల సొమ్ము పై వ్యామోహం లాంటి చెడ్డ లక్షణాలు మనిషికి ఉండకూడదని ఆచరించి చూపాడు. మాటపై నిలబడటం ఆయనలోని అద్భుత లక్షణం. తండ్రి మాట నిలబెట్టేందుకు అడవులకు వెళతాడు… పితృవాక్య పాలనే శిరోధార్యమని నమ్ముతాడు. మరికొన్ని గంటల్లో రాజుగా పగ్గాలు చేపట్టే సమయంలో… తనను అడవులకు పంపారని పరనింద చేయలేదు. అంతేకాదు… కైకేయిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెబుతాడు. శ్రీరాముడు సత్యవాక్పాలకుడు. తాను గొప్ప వీరుడైనా శాంతిని కోరుకున్నాడు. హనుమంతుడిని రావణుడి దగ్గరకు దూతగా పంపాడే తప్ప… ముందే యుద్ధానికి కాలు దువ్వలేదు.

ఉపకారం మర్చిపోవద్దు

మనకు ఉపకారం చేసినవారికి అపకారం తలపెట్టడం మహాపాపమని రామాయణం చెబుతుంది. ఎలాంటి పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంటుంది… కానీ కృతఘ్నతకు లేదని చెబుతాడు రాముడు. లంకు వెళ్ళే వంతెన నిర్మాణంలో సాయపడిన ఉడుత దగ్గర నుంచి రావణుడి చేతిలో చనిపోయిన జటాయువు దాకా కృతజ్ఞతను చాటాడు శ్రీరాముడు. జటాయువు తన కోసం చనిపోయిందని బాధపడతాడు. యుద్ధంలో సుగ్రీవుడు గాయపడితే… అయ్యో తన వల్లే మిత్రుడు గాయపడ్డాడని దుఃఖిస్తాడు. రావణ సంహార ఘట్టం పూర్తయ్యాక… దేవేంద్రుడు వరం కోరుకొమ్మని అడిగితే… తన కోసం యుద్ధంలో చనిపోయిన వానరులను బతికించమని అడుగుతాడు. సీతమ్మ జాడ కనిపెట్టడాన్ని స్వామికార్యంగా ఆంజనేయుడు భావిస్తాడు. కానీ అది మహోపకారం అంటూ రాముడు గాఢాలింగనం చేసుకుంటాడు.

ధర్మాచరణ

ధర్మాచరణలో రాముడు తమ, పర భేదాలు చూపించలేదు. సీతమ్మను ఉద్దేశించి అయోధ్య వాసి తప్పుగా మాట్లాడితే… ఆమెను వాల్మీకి ఆశ్రమానికి పంతున్నప్పుడు…… సీత నా ప్రాణం… సీతకన్నా, నా ప్రాణంకన్నా సోదరుడికన్నా అన్నింటికన్నా ధర్మం… వంశగౌరవం గొప్పవి’ అని లక్ష్మణుడితో అంటాడు.

ఆదర్శ రాముడు

రాజధర్మం విషయంలో రాముడు ఆదర్శమూర్తి. అందుకే రామరాజ్యాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటాం. వనవాసానికి వెళ్ళిపోయిన రాముడిని వెతుకుతూ వెళ్ళిన భరతుడికి,… రాజ్యపాలన, రాజధార్మాల గురించి చెబుతాడు. ధర్మోపదేశం చేస్తాడు. పాలకుడు గురువులను, రాజనీతిజ్ఞులను ఆదరించాలి. రాజుకు వ్యక్తిగత క్రమశిక్షణ చాలా అవసరం. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి… అప్పుడే కాలం సద్వినియోగం అవుతుంది. చక్రవర్తికి కళ్తూ చెవులూ మంత్రులు. వాళ్ళల్లో అసమర్థుల్ని పెట్టుకుంటే… రాజు తన కన్ను తాను పొడుచుకున్నట్టే అని చెబుతాడు. న్యాయవ్యవస్థ బలంగా ఉంటేనే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. శాంతి భద్రతలు లేకపోతే… జనం ప్రభువును గౌరవించరు. జనం భరించలేనంతగా పన్నులు ఉండకూడదు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పకూదు. అబద్దాలు ఆడరాదు. పొగడ్తలకు పొంగిపోకూడదు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. నేను రాజుని అని అహం ఉండొద్దు. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేయాలి. అపరాధులను నేరం రుజువయ్యాకే శిక్షించాలి. రాజు, మంత్రులు, సేనాధిపతులు, ఉద్యోగులంతా ధర్మబద్ధంగా ఉండాలి. వాళ్ళ సక్రమంగా ఉంటేనే జనం కూడా సత్యమార్గంలో నడుస్తారు. ఇలా రాముడు తమ్ముడైన భరతుడికి చెప్పడమే కాదు… అయోధ్య పట్టాభిషేకం తర్వాత ఆచరించి చూపాడు. అందుకే రాముడు అప్పటికీ… ఇప్పటికీ… ఆదర్శ ప్రాయుడు అయ్యాడు.

( – మేడుకొండూరు విష్ణుకుమార్, సీనియర్ జర్నలిస్ట్ )

Also Read :

Tagged