For English Version : CLICK HERE
మన ఇంట్లో వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఓటీటీలు ఇప్పుడు పిల్లలకు క్రైమ్ స్కూళ్ళుగా మారిపోయాయి అనిపిస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ నేరానికి పాల్పడింది పక్క బిల్డింగ్ లో ఉండే 15 ఏళ్ల టెన్త్ విద్యార్థి ఈ హత్య చేశాడని నిర్ధారించారు. ఘోరం ఏంటంటే, వాడు వచ్చింది సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్నందుకు సహస్రను అతి కిరాతకంగా చంపేశాడు. ఈ దొంగనం కోసం ప్రత్యేకంగా ఓ SCREEN PLAY కూడా రాసుకున్నాడు ఆ నిందితుడైన స్టూడెంట్. మిషన్ థెప్ట్ పేరున రాసుకున్న ప్లాన్ తిరగబడింది… దాంతో దాన్ని మిషన్ మర్డర్ గా మార్చేసి పక్కగా ప్లాన్ అమలు చేశాడు ఆ స్టూడెంట్.
ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసి…
ఇంట్లో ఓటీటీల్లో క్రైమ్ వెబ్ సిరీస్ లు, క్రైమ్ కంటెంట్ లు బాగా చూడటం అలవాటు పడ్డాడు. అందులో సీన్స్ ని మక్కీ మక్కీకి దించేస్తూ ప్లానింగ్ రాసుకొని మరీ దొంగతనానికి వెళ్ళాడు. ఆ టైమ్ లో అడ్డుగా వచ్చిన అభం శుభం ఎరుగని అమ్మాయి సహస్రను అతి కిరాతకంగా చంపేశాడని పోలీసులు తెలిపారు. ఓటీటీ కంటెంట్ జనానికి అవగాహన కల్పించడం ఏమో గానీ, నేరాలను ప్రోత్సహించేందుకు అడ్డాలుగా మారిపోయాయి. సహస్ర హత్య కేసులో నిందితుడి నేర స్వభావం వెనుక ఓటీటీల ప్రభావం పిల్లలపై ఎంతా పనిచేస్తుందో అర్థమవుతోంది. పోలీసులు అందర్నీ ఎంక్వైరీ చేస్తున్న టైమ్ లో, ఆ బాలుడిని ప్రశ్నించారు. అయితే సహస్ర మూడు సార్లు డాడీ అని పిలిచిందంటూ బాలిక తండ్రిపై ఆరోపణలు చేశాడు. దాంతో పోలీసులు సహస్ర తండ్రి అనుమానించేలా క్రైమ్ సీన్ మొత్తం మార్చేసిన ఘనుడు. ఓ టెన్త్ స్టూడెంట్ కి ఇంత చావు తెలివితేటలు రావడానికి కారణమైన ఓటీటీ విషయంలో తల్లిదండ్రులు అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. మీ పిల్లలు ఎటు వెళ్తున్నారు… ఏం చదువుతున్నారు… ఏం చూస్తున్నారు… ఖాళీ టైమ్ లో ఎలా గడుపుతున్నారు అన్నది కన్నేసి ఉంచాల్సిన బాధ్యత ప్రతి పేరెంట్స్ మీదా ఉంది. ఓటీటీలకు సెన్సార్‌షిప్ లేకపోవడం, తల్లిదండ్రులు తమ పిల్లలను పర్యవేక్షించలేకపోవడం లాంటివి సహస్ర హత్యకు కారణాలుగా తెలుస్తోంది. ఇలాంటి క్రైమ్, మర్డర్, అసభ్య కంటెంట్ ను అందిస్తున్న ఓటీటీల మీద చర్య తీసుకోవాలని జనం కోరుతున్నారు.