Social media : తాట తీయాల్సిందే … నోటికి ఎంత వస్తే అంతేనా ?

Blog Top Stories Trending Now

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే కొద్ది రోజుల పాటు మనం సరికొత్త యుద్ధాన్ని చూడబోతున్నాం. అది కూడా సోషల్ మీడియా మీద. అవును… సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ పెడుతూ… మహిళలు, పిల్లలు అని చూడకుండా చెలరేగి పోతున్న తీటగాళ్ళ భరతం పట్టాలని సీఎం చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అంతకంటే ముఖ్యంగా ఇలాంటి చెత్త రాతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు యాక్షన్ మొదలు పెట్టి ఏ పార్టీ వాళ్ళయినా… ఏ కులం వాళ్ళయినా… జైలుకు పంపాల్సిందే…. 

రాజకీయాలంటే ఒకప్పుడు హుందాగా ఉండేవి. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా చేసే తప్పులను మాత్రమే ఎత్తి చూపేవాళ్ళు. కానీ గత కొంత కాలంగా దేశంలో దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని… అడ్డమైన వెధవలు చెలరేగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మరీ ఎక్కువగా… తెలంగాణలో కాస్త తక్కువగా ఇలాంటి సంస్కృతి పేట్రేగి పోతోంది. పార్టీ అభిమానులుగా తమ పార్టీని, నాయకుడిని సమర్థించుకుంటూ పోస్టులు పెడితే ఫర్వాలేదు. కానీ ఎదుటి పార్టీకి చెందిన నాయకుల భార్యలు, అక్కా చెల్లెళ్ళు, ఆఖరికి వాళ్ళ ఆడపిల్లలు, చిన్నారులను కూడా వదలడం లేదు కొందరు సైకోలు. ఉన్మాదంతో నోటికి ఎంత వస్తే అంత … చేతికి ఏది తోస్తే అది రాసుకుపోతున్నారు. మొన్న మొన్నటిదాకా వైసీపీ హయాంలో చెలరేగిన ఇలాంటి బ్యాచ్ కి (వీళ్ళని పేటీఎం బ్యాచ్ అని ముద్దుగా పిలుస్తారు ) ఏపీ డిజిటల్ మీడియా నుంచే అంటే గవర్నమెంట్… అంటే ప్రజల సొమ్మునే ఖర్చుపెట్టారంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోంది. … కూటమి ప్రభుత్వం వచ్చాక  కూడా  గవర్నమెంట్  డిజిటల్ మీడియా సిబ్బంది నిస్సిగ్గుగా … సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, హోంమంత్రి అనితతో పాటు ఇతర మంత్రుల మీద రాయడానికి వీల్లేని భాషలో పోస్టులు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి లక్షల రూపాయల సొమ్ములు తీసుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ దందా కొనసాగిస్తున్నారు.

సైకోలను వదిలేస్తున్న పోలీసులు

గత ఐదేళ్ళ పాటు సోషల్ మీడియాలో దారుణమైన బూతులతో చెలరేగిన సైకోలపై ఒక్కొక్కరి మీదా కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కొందరు పోలీసులు మాత్రం అరెస్ట్ చేసినట్టు చూపించి వదిలిస్తుండగా… మరికొందరు అలాంటి నిందితులను రెస్టారెంట్స్ కి తీసుకెళ్ళి బిర్యానీలు తినిపిస్తూ… వాళ్ళ సేవలో తరిస్తున్నారు. ఇలాంటి పోలీసులను గుర్తించి సస్పెండ్ చేశారు డీజీపీ. గత ఐదేళ్ళూ టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్, లోకేశ్ , అనిత సహా చాలామంది సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ని ఎదుర్కొన్నవాళ్ళే. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొందరి అరాచకాలు ఇలాగే కొనసాగుతున్నాయి. దాంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓపెన్ అయిపోయారు. పోలీసులు చేతులు ముడుచుకు కూర్చున్నారని పిఠాపురం సభలో గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పవర్ స్టార్ పంచ్ కి హోంమంత్రి, డీజీపీతో పాటు సీఎం చంద్రబాబు కూడా స్పందించాల్సి వచ్చింది.

ఇక సైకోలు జైలుకే

రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన… వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్యా బిడ్డలు అవమానాలు ఎదుర్కోవాలా ? వాళ్ళను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చారు. ఇంత హీన స్థితికి ఎందుకు దిగజారారు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని కూడా ఇలాగే తిడితే ఊరుకుంటారా ? అసలు వీళ్ళకు ఎందుకు ఇంత స్వేచ్ఛ వచ్చింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ళు, భార్యల మీద కామెంట్స్ చేయడం చాలా సభలో చూశాం. ఆఖరికి మనం ఏ సభలో మాట్లాడుతున్నాం అన్న సోయి లేకుండా బడి పిల్లల కార్యక్రమాల్లోనూ ఆయన కామెంట్స్ చేశారు.

కన్నీళ్ళు పెట్టిన పవన్ బిడ్డలు

పవన్ కల్యాణ్ కి చెందిన ఇద్దరు కుమార్తెలను కూడా సోషల్ మీడియా సైకోలు వదిలిపెట్టలేదు. పిల్లలిద్దరూ కన్నీళ్ళు పెట్టుకున్నారని ఏపీ కేబినెట్ మీట్ లోనే పవన్ చెప్పారు. ఆయనే కాదు… ఇప్పటికీ చంద్రబాబు, లోకేశ్, హోంమంత్రి అనితను టార్గెట్ చేస్తున్నా  కొందరు పోలీసులు చేతగాని వాళ్ళు లాగా చేతులు కట్టుకొని కూర్చున్నట్టు కనిపిస్తోంది. పవన్ పిఠాపురంలో పోలీసుల మీద సీరియస్ అవడంలో ఎలాంటి తప్పూ లేదు. డీజీపీ ద్వారకా తిరుమల రావు, హోంమంత్రి అనిత స్పందించినా… ఏపీలో పోలీస్ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరమైతే కనిపిస్తోంది. కేబినెట్ లో చంద్రబాబు నెల రోజుల టైమ్ లో అంతా సెట్ చేస్తానని చెప్పారు. సో… ఇక సోషల్ మీడియాలో రెచ్చిపోయి పోస్టులు పెడుతున్న సైకోలు జైలుకెళ్ళాల్సిన రోజులు దగ్గరపడ్డాయని అనుకోవాలి… పవన్ కల్యాణ్ అన్నట్టుగా… అది ఏ పార్టీ లీడరైనా టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ… ఇలా ఏ పార్టీకి అఫిలియేట్ ఉన్నా… ఏ కులం వాళ్ళయినా…. ఎవర్నీ వదిలి పెట్టకూడదు… ఇలాంటి కంత్రీ గాళ్ళను మూసేయ్యాల్సిందే.

Tagged