* శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు
* సభ ముందుకు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు
* కేసీఆర్, హరీష్ రావుపై చర్యలుంటాయా?
* బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈసారి సెషన్స్ నాలుగైదు రోజులు జరుగుతాయని అనుకుంటున్నారు. అయితే ఎన్ని రోజులు జరపాలన్న దానిపై బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడంపైనా చర్చిస్తారు. .
కాళేశ్వరం రిపోర్ట్ ప్రధాన ఎజెండా
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ లోపాలు, అవినీతి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ చంద్ర ఘోష్ కమిటీని నియమించింది. ఆ రిపోర్ట్ ఈమధ్యే ప్రభుత్వానికి చేరింది. దీన్ని అసెంబ్లీలో చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు బాధ్యులుగా పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ రిపోర్టు తప్పుల తడక, రాజకీయంగా కక్ష సాధింపు కోసమే ఏర్పాటు చేశారనీ, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ అసెంబ్లీలో చర్చించకుండా ఏ చర్య తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇచ్చింది. దాంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేసీఆర్, హరీశ్ రావు ప్రయత్నిస్తున్నారు. ఈలోగా వెంటనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయడం చర్చకు దారి తీసింది.
అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ప్రభుత్వం వాదనను ఎలా ఫేస్ చేయాలన్న దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నాయకులు ఫాంహౌస్‌లో సమావేశమై తీవ్రంగా చర్చించారు. దాంతో ఈ సెషన్స్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య కాళేశ్వరంపై హాట్ డిస్కషన్, తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉంది. సమావేశాలు అయిపోయాక, కేసీఆర్, హరీశ్ రావు తో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతర నాయకులు, అధికారులపై చర్యలు తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది.
బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ
ఈ అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి కోర్టు గడువు విధించింది. అందుకోసం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. అటు ఢిల్లీ నుంచి దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం బీసీ కోటాను అడ్డుకుంటుందని సీఎం, మంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే జీవో ద్వారా అమలు చేసే అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది.
Read also : ట్రంప్ ఇగో దెబ్బతింది – అందుకే టారిఫ్స్
Read also : TVS Orbiter Electric Scooter Review: బెస్ట్ ఫీచర్లు, ఉత్తమ ధర
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/