* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు
* క్యూలైనల్లో నిలబడలేక రైతన్నల అవస్థలు
* షాపులు, సొసైటీల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు
* గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలాంటి కష్టాలే
తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్ మధ్యలో వర్షాలు పడుతుండటంతో, రైతులు యూరియా కోసం షాపులు, సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వానలో తడుస్తూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నా, ఒక్క బస్తా కూడా దొరక్క ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడం, బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మకాలు చేయడం లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి యూరియా కేటాయింపుల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్‌లు పెట్టి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలపై విరుచుకుపడుతున్నారు. యూరియా కేటాయింపులు తీసుకురావడంలో విఫలమయ్యారని, రైతుల బాధలు పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తున్నారు. మరోవైపు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ కే.రామకృష్ణ రావు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి, యూరియా నిల్వలను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు.
యూరియా కొరత ఎందుకు ?
జూలై, ఆగస్టు నెలల్లో మంచి వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వరి, పత్తి, మిర్చి, పప్పు ధాన్యాలు వంటి పంటలు ఒకేసారి సాగు చేశారు. 2025 ఖరీఫ్ సీజన్‌కు తెలంగాణకు 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా, జులై 31 వరకు కేవలం 4.36 లక్షల టన్నులు మాత్రమే సరఫరా అయింది, దీంతో 2.24 లక్షల టన్నుల కొరత ఏర్పడింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 3.20 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఉందని రాష్ట్రం ఆరోపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 5 లక్షల టన్నుల డిమాండ్‌కు 3.07 లక్షల టన్నులు మాత్రమే వచ్చాయి.
విదేశాల నుంచి తగ్గిన దిగుమతులు
చైనా, జర్మనీ, ఇరాన్ లాంటి దేశాల నుంచి యూరియా సరఫరా లేట్ అవుతోంది. జియో పొలిటికల్ కారణాలు, రామగుండం ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌లో టెక్నికల్ ప్రాబ్లెమ్స్ వల్ల ఉత్పత్తి నిలిచిపోతుండటంతో లాంటి కారణాలో సప్లయ్ నిలిచిపోయింది. ఈమధ్య రెండు రోజులుగా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది, దీంతో కొరత మరింత తీవ్రమైంది. గతంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌తో రైతులకు సప్లయ్ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. కేంద్రం నుంచి వచ్చే యూరియాలో 3 లక్షల టన్నుల కోత ఉన్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే లక్ష టన్నుల అదనంగా సప్లయ్ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ ఎక్కువ యూరియా తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. అయితే, చైనా ఇటీవల ఎగుమతి ఆంక్షలు సడలించి, భారత్‌కు 3 లక్షల టన్నుల అదనంగా సరఫరా చేయడానికి సిద్ధమైంది.
కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా
మండల స్థాయిలో స్టాక్ వివరాలు మానిటరింగ్ చేస్తూ, అవసరమైన చోటికి యూరియా తరలించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రైవేటు డీలర్ల దగ్గర 35 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. అంది పరిశ్రమలకు వెళ్ళకుండా రైతులకు సక్రమంగా సప్లయ్ అయ్యేలా చూడాలి. రైతులు కూడా తమకు ఎంత కావాలో అంతే కొంటే బెటర్. అనవసరమైన స్టాక్ పెట్టుకోవద్దని ప్రభుత్వం చెబుతోంది. యూరియాకు బదులుగా నానో యూరియా, డీఏపీ కాంప్లెక్స్‌ను ప్రోత్సహించాలని సూచిస్తోంది.
తనిఖీలు చేయాల్సిందే
ప్రైవేటు డీలర్ల షాపులు, యూరియా అవసరమున్న పరిశ్రమలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. వ్యవసాయ ఎరువులను ఫ్యాక్టరీలకు వాడితే కఠిన చర్యలు తీసుకోవాలి. జూన్-జూలైలో ఎక్కువగా కొనుగోలు చేసిన బయ్యర్ల వివరాలు ట్రాక్ చేయాలి, డైవర్ట్ చేస్తున్నారా అన్నది పరిశీలించాలి.
ఆదిలాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, నారాయణపేట లాంటి బోర్డర్ జిల్లాల్లో ఇతర రాష్ట్రాల రైతులకు యూరియా అమ్మకుండా చూడాలి. బ్లాక్ మార్కెట్ కాకుండా బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.
Read also : మార్వాడీ గో బ్యాక్ – ఎందుకీ వివాదం ?
Read also : బెస్ట్ దోస తవా ఎంచుకోవడం ఎలా? – పూర్తి గైడ్
Read also : Airtel Network Outage Disrupts Services Nationwide, Users Left Frustrated
Read also : Trump-Zelensky Summit Signals Hope for Ukraine Peace Talks
🛍️ Recommended for You
Explore top picks in tech, lifestyle & home essentials. Every click supports https://teluguword.com/