శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి ?

Devotional

శనివారం అనగానే… ఉదయం రేడియోలోనో… దేవాలయం నుంచో సుప్రభాతం వస్తూ ఉంటుంది.  మన చిన్నప్పటి నుంచి శనివారం అంటే… శ్రీ వేంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజుగా పెద్దలు చెబుతూ వస్తున్నారు.  కానీ నిజానికి శనివారానికి – శ్రీ వేంకటేశ్వర స్వామికి సంబంధం ఏంటి అంటే… శనివారంను వేంకటేశ్వరుడికి ఇష్టమైన వారంగా ఎందుకు చెప్పారు. దీనికి నిజంగా శాస్త్ర ప్రమాణం ఏమైనా ఉన్నదా అన్నది  తెలుసుకుందాం. వివిధ ఆచారాలు, సంప్రదాయాలకు ప్రమాణాలు అనేవి మన పురాణాల్లో, ధర్మశాస్త్రల్లో స్పష్టంగా చెప్పారు.  శ్రీవేంకటేశ్వర స్వామికి శనివారం ఇష్టం అనడినికి మన పురాణాల్లో ఆధారాలు ఉన్నాయి.

మార్కండేయ పురాణంలో ఈ విషయంపై ప్రస్తావన ఉంది…

         కలౌ కుమార రూపేణ షణ్ముఖౌ భగవాన్ హరి

          దృశ్య తైక ముఖే నైవ వేంకట చల నాయక

          సౌభాగ్యదాయకం విష్ణుం వేంకటేశం సమర్చయ: శనివారే… అని ఉంది.

అలాగే

          సుబ్రహ్మణ్య కుమారాఖ్యా విష్ణ్వాఖ్యా వేంకటాచలే

          శేష శైషీ కలా బ్రహ్మీ సర్వ చైతన్య రూపిణీ

          శ్రీవేంకటేశ్వర రూపేణ కలౌ ప్రత్యక్ష దర్శనం

          సర్వదాషి శనేర్వారే భక్తేష్టార్ధ ప్రదాయినీ…

          ఇదం కలియుగే ముఖ్యం సత్యం సత్యం న సంశయ :

అని చెప్పారు.

అంటే… ఆరు ముఖాలు కలిగిన కుమార స్వామి – కలియుగంలో ఏకముఖుడైన వేంకటాచల నాయకుడిగా దర్శనం ఇస్తూ అనుగ్రహిస్తున్నాడు.  సౌభాగ్యదాయకుడునూ, విష్ణు స్వరూపుడునూ అయిన శ్రీ వేంకటేశ్వరుని శనివారం నాడు తప్పక పూజించాలి.  కుమారాఖ్య కలిగిన సుబ్రహ్మణ్యుడు విష్ణ్వాఖ్యతో వేంకటాచలం నందు వెలిశాడు. సర్వ చైతన్య రూపిణి అయిన, బ్రాహ్మీ శక్తి యైన సరస్వతి – శ్రీ వేంకటేశ్వర రూపంతో కలియుగంలో ప్రత్యక్ష దర్శనం ఇస్తోంది.  శనివారం నాడు అట్టి సుబ్రహ్మణ్య, సరస్వతీ, మహా విష్ణువుల సమగ్ర స్వరూపం అయిన శ్రీవేంకటేశ్వరుడిని  పూజించడం భక్తులకు సర్వతా సర్వ అభిష్టాలను ప్రసాదిస్తుంది. ఈ వ్రతం కలియుగంలో చాలా ముఖ్యమైనది.  ఇది సత్యం… ఇందులో ఎలాంటి సంశయం లేదు అని మార్కండేయ పురాణంలో చెప్పారు.

అందువల్ల శనివారం నాడు శ్రీవేంకటేశ్వరుడిని ఉద్దేశించి వార నియమాన్ని పాటించడం, శనివారం నాడు శ్రీవేంకటేశ్వరుడిని పూజించడం… రెండూ కూడా పురాణ ప్రమాణం కలిగిన విషయాలే అని భక్తులు గ్రహించాలి.

దేవతల అనుగ్రహం కోసం… ఆయా దేవతలకు ఇష్టమైన వారాల్లో ఏక భుక్తం (ఒక్క పూట మాత్రమే భుజించడం) నియమంగా పాటించాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి.  అలాగే శ్రీవేంకటేశ్వరుడికి ఇష్టమని చెప్పిన శనివారం నాడు కూడా… వార నియమాన్నీ, ఏక భుక్తాన్ని పాటించాలని పెద్దలు చెబుతారు.

(ఈ ఆర్టికల్ ను వీడియో ద్వారా చూడండి :  ఇక్కడ క్లిక్ చేయండి )

Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *