FOR ENGLISH VERSION : CLICK HERE
బాకా ఊదుకోనివ్వలేదని వ్యక్తిగత కక్ష
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారత్ పై టారిఫ్స్ విధించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌తో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న టైమ్ లో రెండు దేశాల మధ్య మీడియేషన్ కు భారత్ ఒప్పుకోలేదు. అందుకే ట్రంప్ కి కోపం వచ్చిందని అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల సంస్థ జెఫరీస్ తెలిపింది. రెండు దేశాల మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకొని నోబెల్ పీస్ ప్రైజ్ కొట్టేయాలనుకున్నారు. కానీ ఆయన పేరును బాకా ఊదుకోవడానికి భారత్ ఒప్పుకోలేదు. దాంతో ఇగో దెబ్బతిన్న ట్రంప్ వ్యక్తిగత కోపాన్ని భారత్‌పై 50శాతం టారిఫ్స్ రూపంలో చూపించాడని జెఫరీస్ సంస్థ తెలిపింది. అమెరికా బిజినెస్ పార్టనర్షిప్స్ పై విధించిన టారిఫ్స్ లో భారత్ పైనే ఎక్కువ అని సంస్థ తెలిపింది. ట్రంప్ వ్యక్తిగత కక్ష వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, జనం ఇబ్బందులు పడుతున్నారని జెఫరీస్ అభిప్రాయపడింది.
కశ్మీర్ సహా పాకిస్థాన్ తో జరుగుతున్న వివాదాల్లో మూడో పక్షం మీడియేషన్ కు అవకాశం లేదని భారత్ మొదటి నుంచి చెబుతోంది. అయినా సరే టారిఫ్‌ల బూచి చూపించి ఆ ఘర్షణను తానే ఆపేసినట్టు క్యాంపెయిన్ చేసుకోవడం మొదలుపెట్టాడని జెఫరీస్ తెలిపింది. భారీ ఆంక్షలు విధిస్తామని బెదిరించినా, మూడో పార్టీ జోక్యం అక్కర్లేదు’ అన్న సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉండటం గ్రేట్ అని జెఫరీస్ సంస్థ వివరించింది. ఈ ఘర్షణే భారత్‌తో అమెరికా సంబంధాలు దెబ్బతినడానికి కారణమయ్యాయని అభిప్రాయపడింది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాంతో రెండు దేశాల మధ్య అణుయుద్ధాన్ని తప్పించాననీ, టారిఫ్స్ విధిస్తానంటూ భారత్‌ను భయపెట్టి కాల్పుల విరమణకు ఒప్పించానని ట్రంప్ ప్రకటించారు. ఈ ప్రకటనను భారత్ కొట్టిపారేసింది. పాకిస్తాన్ నుంచే కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చిందని తెలిపింది. అయినా సరే ట్రంప్ ఇప్పటికే చాలా సార్లు పాత పాటే పాడుతున్నారు. కశ్మీర్ విషయంలో మీడియేషన్ కు అమెరికా సిద్ధమని గతంలో మొదటిసారి అధ్యక్షుడు అయినప్పుడు కూడా అన్నారు. అందుకు భారత్ ఒప్పుకోకపోవడం వల్లే టారిఫ్ రూపంలో తన దారికి తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. రెండు దేశాల మధ్య మరో వివాదాస్పద అంశం వ్యవసాయం. భారత్ లో తమ వ్యవసాయ, పాల ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని అమెరికా కోరుతోంది. కానీ అందుకు భారత్ ఒప్పుకోలేదు. 250 మిలియన్ల మంది రైతులు ఆధారపడిన ఆ మార్కెట్‌ను ఓపెన్ చేయడానికి నిరాకరించినట్టు కూడా జెఫరీస్ తెలిపింది.
Read also : 15 రోగాలకు పసుపే మందు!