మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో దేశమంతటా మెరుగైన ఫలితాలు సాధించి బీజేపీకి (BJP)చెక్ పెట్టిన కాంగ్రెస్ (Congress), దాని మిత్ర పక్షాలకు మహారాష్ట్రలో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్రలో అధికారం తమదే అని గంపెడు ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రీయన్లు ఎందుకు షాకిచ్చారు. పొరపాట్లు ఎక్కడ జరిగాయో తెలుసుకోకుండా కాంగ్రెస్ తో శివసేన (ఉద్దవ్) పార్టీలు ఇప్పుడు EVM లను నిందించి లాభం ఏంటి ?
మహారాష్ట్రలో బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో మహాయుతి (Mahayuthi) పేరుతో అసెంబ్లీలో పోటీ చేసి విజయం సాధించాయి. బీజేపీ 149 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబడితే, షిండే వర్గం 81, NCP 59 సీట్లల్లో పోటీ పడ్డాయి. మహావికాస్ (Maha Vikas) లో ఉద్దవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ కలసి పోటీ చేశాయి. ఆ కూటమిలో కాంగ్రెస్ 86 సీట్లల్లో, శివసేన 95, ఎన్సీపీ 101 స్థానాల్లో పోటీ పడ్డాయి. బీజేపీ ఆధ్వర్యంలో మహాయుతి 288 స్థానాల్లో 235 సీట్లు గెలుచుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట అయిన మహారాష్ట్రలో 86 సీట్లల్లో పోటీ చేస్తే, హస్తం పార్టీకి దక్కింది 16 స్థానాలుమాత్రమే.
కాంగ్రెస్ ఎక్కడ దెబ్బతింది ?
మహారాష్ట్రలో ఒకప్పుడు కాంగ్రెస్ కి కార్యకర్తలు, నాయకుల బలం బాగా ఉండేది. వాళ్ళ అండతో పార్టీకి తిరుగులేని అధికారం లభించింది. ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలన్నది కూడా డిసైడ్ చేసేది వాళ్ళే. వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపిక ఉండేది. కానీ ఈమధ్య కాలంలో కాంగ్రెస్ కేవలం ఎన్నికల వ్యూహకర్తలను నమ్ముకొని అభ్యర్థులకు టిక్కెట్లు ఇస్తోంది. కర్ణాటక, తెలంగాణలో ఫాలో అయిన ఫార్ములానే హర్యానాలో, మహారాష్ట్రలో కూడా అనుసరించింది. ముఖ్యంగా ఆ పార్టీకి పొలికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు (Congress Political Strategist Sunil Kanagolu) పెద్ద దిక్కుగా మారారు. హర్యానా (Haryana) లో ఆయన చెప్పినవాళ్ళకే టిక్కెట్లు ఇచ్చి పార్టీ బొక్క బోర్లా పడింది. తప్పుడు అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. అయినా డోన్ట్ కేర్ అంటూ… మహారాష్ట్రలో సునీల్ కనుగోలు చెప్పిన వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వడం ఆ పార్టీ చేసిన పెద్ద పొరపాటు అంటున్నారు. మహారాష్ట్రలో ఆఖరికి AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా పక్కనబెట్టినట్టు సమాచారం.
ఇది కూడా చదవండి :PAN 2.0: పాన్ కార్డ్ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?
స్థానిక అంశాలు గాలికొదిలిన కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడైనా స్థానిక అంశాలకే ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారు. కానీ కాంగ్రెస్ వాటిని పట్టుకోవడం విఫలమైంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)… రాజ్యాంగాన్ని రక్షించాలి… కుల గణన జరగాలి అంటూ జాతీయ అంశాలపైనే ఫోకస్ చేశారు. మహారాష్ట్రలో విదర్భ ఏరియాలో 10 స్థానాల్లో ఏడు కాంగ్రెస్ గెలిచింది. కానీ అసెంబ్లీలో మాత్రం స్థానిక అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో సక్సెస్ కాలేకపోయింది. అదే బీజేపీ మాత్రం పూర్తి స్థానిక అంశాలను లేవనెత్తింది. లడ్ కీ బహిన్ (Ladki bahin) లాంటి పథకాలు, రిజర్వేషన్లు, మహారాష్ట్ర రైతుల సమస్యలపై ప్రశ్నలు లాంటి అంశాలతో ప్రచారం చేసింది. బీజేపీలాగా కాంగ్రెస్ లోకల్ ఇష్యూస్ పట్టించుకోకపోవడం ఆ పార్టీ పుట్టి ముంచింది. లోక్ సభకు, అసెంబ్లీకి వేర్వేరు వ్యూహాలు అనుసరించాల్సి ఉన్నా… కాంగ్రెస్ ఆ విషయంలో ఫెయిల్ అయినట్టు మహారాష్ట్రలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు…. ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు విషయంలోనూ గుడ్డిగా వ్యవహరించకుండా స్థానిక నాయకత్వాన్ని కూడా నమ్ముకుంటే బెటర్ గా ఉండేదని అంటున్నారు. అటు ఝర్ఖండ్ లోనూ కాంగ్రెస్ సొంతంగా ఎక్కువ స్థానాల్లో గెలవలేకపోయింది. గతంలో లాగే ఇప్పుడూ 16 స్థానాలకే పరిమితం అయింది. అక్కడ కూడా స్థానిక సమస్యలను గుర్తించడంలో కాంగ్రెస్ విఫలమైనట్టు విశ్లేషకులు చెబుతున్నారు. పైగా స్థానిక నేతల మధ్య ఘర్షణలు, టిక్కెట్ల పంపకంలో సరైన విధానం లేకపోవడం కాంగ్రెస్ మెజార్టీ సీట్లల్లో గెలవలేకపోయింది.
బీజేపీ సొంత బలం, RSS బలమైన ముద్ర
మహారాష్ట్రలో మహావికాస్ ఓటమికి మరో కారణం ఏంటంటే… అక్కడ బీజేపీ సొంతంగా బలం ఉండటం, రెండోది రాష్ట్రీయ స్వయం సేవకర్ సంఘ్ ప్రభావం. ఈసారి బీజేపీ గెలుపులో RSS చాలా కీలకంగా వ్యవహరించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కూడా ఎన్నికల వ్యూహకర్తల సాయం తీసుకున్నా… పార్టీలో వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది.
ఇది కూడా చదవండి: మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా ?
సొంతంగా బలం పెంచుకోలేని కాంగ్రెస్
ఒకప్పుడు దేశంలోనే పెద్ద పార్టీగా ఉండి అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాన్రాను ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడుతోంది. బిహార్ లో రాష్ట్రీయ జనతాదళ్, తమిళనాడులో DMK, జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పై ఆధారపడింది. ఒడిశాలో కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయింది. మిగతా రాష్ట్రాల్లోనూ మిత్రపక్షాల మద్దతుతోనే కొద్దో గొప్పో సీట్లల్లో గెలుస్తోంది. ఒకప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కాంగ్రెస్ కు కంచుకోట. కానీ అక్కడ కూడా బీజేపీ హవా నడుస్తోంది. ఏ రాష్ట్రంలో ఎలాంటి వ్యూహం అనుసరించాలి అన్న విషయంలో కాంగ్రెస్ లో స్పష్టత లేకపోవడం, స్థానిక అంశాలు పక్కనబెట్టి జాతీయ స్థాయి అంశాలను ప్రస్తావిస్తుండటం ఆ పార్టీ ఓటమికి కారణాలు అవుతున్నాయి. ఒకప్పుడు బీజేపీ చేసిన తప్పును ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది. గతంలో బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా రామజన్మభూమి, హిందూత్వాన్నే నమ్ముకునేది. ఇప్పుడు కాంగ్రెస్ ఎజెండా జాతీయ ఎజెండాగా మారింది. ఒక్క కర్ణాటక, తెలంగాణలో మాత్రం… స్థానిక నాయకత్వం… స్థానిక అంశాలపై దృష్టి పెట్టడం వల్ల హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. హర్యానా, మహారాష్ట్రలో అధికార బీజేపీపై వ్యతిరేకత ఉన్నా వాటిని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైంది. కానీ బీజేపీ మాత్రం… ఒక్కో రాష్ట్రానికి ఒక్కో మెథడ్ ఫాలో అవుతోంది. పైగా కాంగ్రెస్ లో పెరిగిపోతున్న గ్రూపులు కూడా ఆ పార్టీ అభ్యర్థుల ఓటమికి కారణం అవుతోంది.
EVM లు ఓడించాయట !
ఇన్నేళ్ళూ ఈవీఎంలతోనే అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇప్పుడు వాటిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గెలిస్తే ఈవీఎంలు గొప్ప… ఓడితే అవే కారణం అంటూ నిందిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇలాగే వాదించారు. ఆ తర్వాత హర్యానాలో… ఇప్పుడు మహారాష్ట్రలో… ఇలా ఓడిన ప్రతిచోటా ఈవీఎంలను నిందించడం పార్టీలకు అలవాటుగా మారింది. మరి అదే కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచింది…
సుప్రీంకోర్టు చివాట్లు
మొన్న సుప్రీంకోర్టులో కేఏ పాల్ (KA Paul) పిటిషన్ పై స్పందించిన తీరు అందరికీ నవ్వు తెప్పించింది. గెలిస్తే ఓకే కానీ… ఓడితే ట్యాంపరింగా ? మీకింత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ కేఏ పాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు (Supreme Court) కామెంట్ చేసింది. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికలు జరిగేలా చూడాలన్న కేఏపాల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. చాలా దేశాల్లో ఇప్పటికీ బ్యాలెట్స్ వాడుతున్నారని కేఏపాల్ అంటే… మిగిలిన ప్రపంచానికి భిన్నంగా ఉండాలని మీరెందుకు కోరుకోరు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది.