Winter Problems: చలికాలం వచ్చేసింది… జాగ్రత్త !

Healthy Life

అక్టోబర్ నెల అయిపోయింది.. నవంబర్ నెల… కార్తీక మాసం కూడా వచ్చేశాయి. అందుకే ఇప్పుడిప్పుడే చలి పెరుగుతోంది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, వైజాగ్, రాజమండ్రి లాంటి సిటీల్లోనే చలి కనిపిస్తుంటే ఇక మన్యం ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? ముందే తెలుసుకుంటే బెటర్.

ఈ సూచనలు పాటించండి

చలి ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకపోవటమే మంచిది. వృద్ధులు ,పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం ముక్కుకు, నోటికి కర్చీఫ్ చుట్టుకోవడం బెటర్. తలకు మఫ్లరు లేదా మంకీక్యాప్‌ పెట్టుకోండి.

చాలామంది చలికి భయపడి వాకింగ్ కి వెళ్ళడం మానేస్తారు. కానీ డయాబెటీస్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు వాకింగ్ మానేస్తే ఇంకా ప్రమాదం. డయాబెటీస్ వాళ్ళకైతే షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. చలికాలంలోనే వ్యాయామం అవసరం ఎక్కువ అని గుర్తుపెట్టుకోండి. గుండెజబ్బులు, బీపీ, డయాబెటీస్ ఉన్న వారికి ఎక్సర్ సైజెస్ చాలా అవసరం. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది, చురుకుదనం పెరుగుతుంది. రోగనిరోధకశక్తి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ లాంటి సమస్యలు త్వరగా దాడిచేయవు. ఉదయం వేళల్లో వాకింగ్ కి వెళ్ళే వారు కాస్త ఎండ మొదలయ్యాక ప్రారంభించండి. అప్పుడు డీ విటమిన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది.

చలికి భయపడి కొందరు స్నానం మానేస్తుంటారు. కానీ చలి కాలంలో కూడా రెండు పూటలా స్నానం చేయాల్సిందే. కొందరు చలికాలంలో చాలా వేడి నీళ్ళతో స్నానం చేస్తుంటారు. అలా చేయొద్దు. మరీ వేడి నీళ్ళతో స్నానం చేస్తే చర్మం పొడి బారుతుంది. అందుకే గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయండి.

చలికాలంలో సాధ్యమైనంతగా చద్ది అన్నం, చద్ది కూరలు తినడం మానేయాలి. అప్పుడే వండిన వేడివేడి పదార్థాలే తినాలి. దాంతో పాటు మంచి పోషకాహారం తీసుకోవాలి. నీళ్ళని గోరువెచ్చగా చేసుకొని తాగితే ఆరోగ్య సమస్యలు రావు.

చలికాలంలో కూడా కూల్‌డ్రింకులు తాగుతున్నారా… ఐస్‌క్రీములకు తింటున్నారా… వాటికి దూరంగా ఉంటేనే బెటర్. ఇవి నోరు, గొంతు పైపొరలను దెబ్బతీస్తాయి. దాంతో గొంతునొప్పి, జలుబు లాంటి సమస్యలు రావొచ్చు.

గర్భిణులకు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు వస్తే యాంటీబయాటిక్‌ మందులు ఇవ్వడం కష్టం. అందుకే తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి. చేతులను కళ్లు, ముక్కు, నోటికి తాకనీయొద్దు. డాక్టర్‌ పర్యవేక్షణలో ఫ్లూ, న్యుమోనియా టీకాలు లాంటివి తీసుకోవాలి.

 

Tagged